ప్రకృతి అందం, చుట్టూ ఎప్పుడు నీటితో నిండి ఉండి పచ్చట వాతావరణంలో కొండలు కోణాల మధ్య వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొండ లోయలో వెలసిన ఈ ఆలయంలో నరసింహస్వామి కొలువై ఉన్నారు. మరి ఆ స్వామి అక్కడ ఎలా వెలిసాడు? ఇంకా ఆ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కర్నూలు జిల్లా, బేతంచెర్ల మండలం, ఆర్. ఎస్. రంగాపురం గ్రామానికి కొంత దూరంలో కొండల నడుమ శ్రీ మద్దులేటి నరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహక్షేత్రాలు చాల వరకు కొండలపై వెలసి ఉండగా అందుకు బిన్నంగా ఇచటి స్వామి ఒక లోయలాంటి ప్రాంతంలో ఉండటం విశేషం. ఇక్కడి వెలసిన స్వామి వారు కదిరి క్షేత్రం నుండి ఇక్కడికి వచ్చినట్లుగా చెబుతారు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, మద్దిలేటి నరసింహస్వామి మొదట కదిరి నరసింహస్వామి. ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారు ఓటమి పొందుతారు. విజయగర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయడంతో ఆయన ఆ అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువుతీరాలని నిశ్చయించుకుంటారు. ఎర్రమల, నలమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు. ఆయన సూచనమేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువుదీరాలని నిర్ణయించుకుంటారు.
అదే సమయంలో మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు. ఓరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది కోమలి పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు.
అదేరోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని అర్చక వేదపండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యం అవుతారు. అలా మద్దులేరు పక్కన కొలువై ఉండటంతో మద్దులేటి స్వామిగా, మద్దిలేటి నరసింహ స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు.ప్రతి శుక్ర, శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులు తాము అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అశేషభక్తుల మధ్య జరుగుతుంది. ఈ ఆలయాన్ని ప్రతి శనివారం ఎక్కువమంది భక్తులు దర్శిస్తారు. సంతాన ప్రదాతగా ఈ లక్ష్మి నరసింహస్వామి భక్తుల హృదయాలలో నిలిచి ఉన్నాడు. సంతానార్థం ఇక్కడికి వచ్చిన దంపతుల కోసం ప్రతి శుక్రవారం రాత్రి ఇక్కడ ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేస్తారు. ఇలా గుడిచుట్టూ ఎత్తైన కొండచెరియలు ఉండి ప్రకృతి శోభతో, మానసిక ప్రశాంతతకు నిలయంగా, పర్యాటక కేంద్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.