Home Unknown facts Shri Ramudu Brahmahathyapathakanni pogottukunna pavithra punyakshetram

Shri Ramudu Brahmahathyapathakanni pogottukunna pavithra punyakshetram

0

శ్రీ రాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాతకం పోయేందుకు దేశం అంతటా శివలింగాలు ప్రతిష్టించాడు. అయితే ఈ ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు ఇద్దరు రెండు శివలింగాలు ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. shri ramuduఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లిలో శ్రీకృతకృత్య రామలింగేశ్వరం ఆలయం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అందువల్ల ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వరమని కూడా అంటారు. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకానికి గురైన శ్రీరామచంద్రుడు మహర్షుల ప్రోద్బలంతో కోటిలింగాలను ఆసేతు హిమాలయ పర్యంతం ప్రతిష్ఠ చేశాడని పురాణ ప్రతీతి. ఈ క్రమంలో శివలింగాన్ని వశిష్టనదికి తూర్పువైపున గుడిమూలలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. వశిష్టానది పడమర వైపున మరొక శివలింగాన్ని లక్ష్మణునిచే ప్రతిష్ఠింపచేశాడు. అప్పటినుండి తూర్పుగోదావరి జిల్లాలో రామప్రతిష్టకు రామేశ్వరమని, పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష్మణప్రతిష్ఠకు లక్ష్మణేశ్వరమని సార్థక నామమయింది. ఇప్పటికీ అవే నామాలతో దివ్య క్షేత్రాలుగా కొనసాగుతున్నాయి. కోటిలింగ ప్రతిష్ఠల కార్యక్రమం ప్రారంభంలో వశిష్ఠుడు శ్రీరాముని చేతికి ఓ కంకణం కట్టి, అది ఎక్కడ రాముని చేతినుంచి విడువడుతుందో, అప్పటినుంచి బ్రహ్మహత్యా పాతకం తొలగుతుందని చెప్పాడట. ఆ ప్రకారం ఈ క్షేత్రంలో లింగప్రతిష్ఠతో రాముని చేతినుంచి కంకణం విడివడి బ్రహ్మహత్యా పాతకం తొలగటంతో శ్రీరాముడు కృతకృత్యుడయ్యాడు. దీంతో ఈ క్షేత్రం నాటినుంచి కృతకృత్య రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక శ్రీరాముడు కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా తన పరివారంతో పర్యటిస్తుండగా ఒక ప్రాంతానికి చేరుకున్నారు. చీకటి కావస్తున్న సమయంలో శ్రీరాముడు సీతాదేవితో సఖీ మనం విశ్రమించే నేటి పల్లి ఇదే అని చెప్పాడట. శ్రీరాముడు సీతమ్మవారితో పలికిన సఖి, నేటి పల్లి మాటలు ప్రస్తుతం సఖినేటిపల్లి గ్రామంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు పర్యటించిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం నిత్యం సుభిక్షంగా, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా పచ్చని వాతావరణంతో కూడి ఉంటుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇలా శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయిన ఈ పవిత్ర క్షేత్రానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version