సంక్రాంతి అంటే ఒక్క రోజు పండుగ కాదు. బోగి, మకర సంక్రాంతి, కనుమ. ఇలా మూడు రోజుల పాటు జరుగుతుంది. సంక్రాంతి అనగానే ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలు, గొబ్బెమ్మలు గుర్తొస్తాయి. కానీ.. అలా ముగ్గుల మధ్యలో ఎందుకు గొబ్బెమ్మలను పెడుతారనే విషయం మాత్రం అంతగా ఎవరికీ తెలియదు. అసలు సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు పెట్టడం వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటికి ప్రత్యేకమైన పూజ కూడా ఉంది. గొబ్బెమ్మను విడదీస్తే, గొబ్బి అంటే గోపి అని అర్థం. అది సంస్కృత పదం. గొబ్బెమ్మను నమస్కార దేవతగా, గౌరీ మాతగా కొలుస్తారు. ఇంకొందరు గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగానూ కొలుస్తారు.
పండుగ రోజు ముగ్గు వేసి, ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి, ఆ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. అలా చేస్తే భర్త బతికే ఉన్న పుణ్యస్త్రీతో సమానమట. అందులో పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తారు.
ముగ్గులు, గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి ఇష్టమైనవట. అందుకే పండుగ సమయాల్లో ఇలా ముగ్గులు వేసి ఆ ముగ్గులను గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ఇలా చేస్తే సాక్షాత్తూ ఆ దేవతలను తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుందని ప్రజల విశ్వాసం.