Home Unknown facts మడికట్టుకోవటం అంటే ఏమిటో తెలుసా ?

మడికట్టుకోవటం అంటే ఏమిటో తెలుసా ?

0
మడికట్టుకోవటం

ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం. ఆచార హీనున్ని ఎంతో పవిత్రమైన వేదాలు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటించాలి. మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. నేటికీ ఇలా మడి కట్టేవాళ్ళు లేకపోలేదు. మడి అనేది కేవలం ఆచారంగా మాత్రమే చూడకూడదు వైద్య పరంగా కూడా ఎన్నో లాభాలు ఉంటాయి. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. అసలు మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. మన ఇంట్లో ఉండే బామ్మలకు దీనిగురించి స్పష్టంగా తెలిసి ఉంటుంది. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువతకు అర్ధం కాదు. అందుకే మడి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం… మడి అంటే శారీరక పరిశుభ్రత. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదాలు) శౌచము లేక శుభ్రత అనేది శారీరకం, మానసికం అని రెండు విధాలు. శారీరక శౌచము లేకుండా గృహస్థునికి మానసిక ప్రశాంతత కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కాబట్టి నిత్య జీవితంలో మానసికంగా ప్రశాంతత కలగాలి అంటే ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. మడి ఎలా కట్టుకోవలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మరుసటి రోజు అంటే రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేస్తే ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనం స్నానం చేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మళ్ళీ తడిపి, పిండి దండెం మీద ఇంట్లో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయాలి. ఎవరు తాకకూడదు. ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెం వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.

మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ స్నానం చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోవాలి. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయాలి. మడితోనే సంధ్యావందనం, నిత్యానుష్ఠానాలు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి, ఆ మడి తోనే భోజనం చేయాలి. ఆ తరువాత మడి వదలి బయట వస్తువులు తాకుతారు. ఇది ఉత్తమమైన మడి.

ఇక శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చేయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మళ్ళీ తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవాలి. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మళ్ళీ తరువాత రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయాలి. లేకపోతే పట్టుబట్టలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడం పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషం ఉంది, అదే జీవహింస, కాబట్టి కొంతమంది దానిని త్యజిస్తారు. అందువల్ల నూలుగుడ్డ శ్రేష్టము. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనప్పుడు (స్వచ్ఛమైన) పట్టువస్త్రం వాడాలి.

మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యాలు చేయకూడదు. కారణం ఏమిటంటే జననేంద్రియాలు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కాబట్టి మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టాలి. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టాలి అంటే ఏక వస్త్రంతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు లేవు. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తికలిగినవారు క్రమక్రమంగా ఇలాంటి మార్పుకు సిద్ధపడాలి. మళ్ళీ ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవం లోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు.

 

Exit mobile version