అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పక్షంలో 11 వ రోజును ఏకాదశిగా పిలుస్తారు. ప్రతి నెలలోనూ రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్ల పక్షం, రెండు కృష్ణ పక్షం. కాబట్టి ఏకాదశులు కూడా రెండు. క్రమంగా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉండడం పరిపాటి. అధిక మాసాలను పక్కన పెడితే నిజానికి శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావించడం జరుగుతుంది. మరియు శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రాద ఏకాదశిగా పరిగణిస్తారు. నిజానికి ప్రతి ఏకాదశి కూడా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది దీనికి కారణం విష్ణు దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి.
శ్రావణ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారి ఇంట మగ పిల్లవాని జననం ఆశీర్వదించబడుతుంది. అందుచేతనే ఈ రోజును పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రావణమాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఎందుకు పెట్టారు? మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుంధాం.
పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్యపురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం- పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికీ, ధాన్యానికీ ఆ రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు.
ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే, తమ రాజుకు పుత్రసంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమశుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్రసంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు.
పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ ఏకాదశి రోజున రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన మరునాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక సంతానం ఒక లెక్కా!
ఈ శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతున్నారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్తరాన్ని పఠించినా విశేషమైన ఫలితం దక్కుతుందట.