పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతి ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఆచారం మంగళ స్నానం. మంగళ స్నానం వెనుక పరమార్ధం ఏమిటో తెలుసుకుందాం.
భారతీయ వివాహ వేడుకల్లో పసుపు, కుంకుమ, చందనంలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీటిని కచ్చితంగా వివాహాల్లో వాడుతుంటారు. ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల నలుగు, మెహందీ ఫంక్షన్స్ పెద్ద వేడుకల్లా చేస్తారు. మన దగ్గర ఇంతకు ముందు అంతగా లేదు కానీ, ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. పెళ్లికూతురుని, పెళ్ళికొడుకుని చేసే సమయంలో ఒంటికి పసుపు రాసి మంగళస్నానం చేయిస్తుంటారు. అయితే, ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీని వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పసుపు దంపతుల ఆరోగ్యకర వైవాహిక జీవితాన్ని నిర్దేశిస్తుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం ముత్తైదువులంతా కలిసి వధూవరువులిద్దరికీ పసుపు రాస్తే వారి దీవెనలు అందుతాయి. ఇక పసుపులో కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనలని దూరం చేస్తుంది. వీటితో పాటు కొన్ని దుష్ట శక్తులను కూడా పారద్రోలే శక్తి పసుపుకి ఉంది. అందుకే పసుపు రాస్తుంటారు. వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు పసుపు రాస్తుంటారు.
పెళ్ళి పీటల మాదకు రాబోయే వధువుకి ప్రత్యేకమైన స్నానం చేయిస్తే ఆ అమ్మాయి చర్మ సౌందర్యం కాంతిగా ఉండడమే కాకుండా శరీరం సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుందట. గులాబీ పూల రెక్కలను శుభ్రమైన నీటిలో వేసి కొన్ని గంటల సేపు ఉంచుతారు. పెళ్ళి కూతురు శరీరానికి వెన్నెతో కలిపిన పసుపు, చందనం బాగా మర్థిస్తారు ఆ తరువాత శెనగపిండితో మృదువుగా రుద్దుకున్నాక స్నానం చేయిస్తారు. పెళ్ళికూతురు స్నానం చేసే నీళ్ళలో గులాబీ రేక్కలు నానేసిన నీటిని పోస్తారు. కొంచెం పన్నీరు కూడా ఆ నీళ్ళలో కలపినట్లయితే ఆ అమ్మాయి చర్మం కాంతిగానూ, మృదువుగానూ, సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట.
స్నానానికి ఉపయోగించే నీటిలో మరువం, దవనం లాంటి సువాసనలు వెదజల్లేవాటిని వేయవచ్చు. సంపంగి, మల్లె, జాజి, విరజాజి లాంటి పూలను చేసినట్లయితే ఆ నీళ్ళు మరింత పరిమళ భరితంగా ఉంటాయి. కమలాపండు తొక్కలను స్నానం చేసే నీటిలో వేసి కొంతసేపు అయిన తరువాత స్నానం చేస్తే చర్మం సువాసనగా హాయిగా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఎంతో అందంగా అలంకరించిన పెళ్ళి కూతురు పెళ్ళిపీటల మీదకు రాగానే పరిమళాలు వ్యాపిస్తాయి.
అదే విధంగా పెళ్లికి ముందు గంధం, నలుగు, చందనం, పసుపు రాయడం వల్ల వాటిలోని ప్రత్యేక గుణాలు ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమలను పోగొట్టిక.. పెళ్లి సమయానికి అందంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అందుకే పెళ్ళికూతురుకు ఇలా పెళ్ళికి ముందు స్నానం చేయిస్తారు.