మన దేశంలో నరసింహ స్వామి ప్రసిద్ధ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖమైన ఆ ఆలయాల్లో సింహాచలం ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. అయితే విదేశాలలో కూడా చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ ఆలయం సింహాచలం ఆలయాన్ని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇంకా విదేశాలలో ఉన్న రెండో అతిపెద్ద నృసింహ దేవాలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ దేశంలో పసావ్ పట్టణ సమీపంలో ఈ దేవాలయం ఉంది. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన బవేరియన్ ఫారెస్ట్ నేచర్ పార్కులో ఆండెల్స్‌బ్రన్ అనే సువిశాల వ్యవసాయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నెలకొల్పారు. ఇది మ్యునిక్‌కి 200 కిలోమీటర్లూ; ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాల సరిహద్దుల్లోని పసావ్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంస్థ ఇస్కాన్ నిర్మించిన ఈ గుడి వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలా ఉంటుంది. సాధారణ వైష్ణవ ఆలయాల్లో ఉండాల్సినవన్నీ అక్కడ కనిపిస్తాయి. వాస్తుకనుగుణంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభం, రథం అన్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడి నృసింహదేవుడు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు ఒడి చేరితే చల్లబడతాడని అక్కడి ప్రధాన పూజారి చెప్పారు. అందుకే ఇక్కడ స్వామి ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తసులభుడుగా పేరొందిన ఈ స్వామిని సంవత్సరంలో ఎప్పుడయినా ఎంత చలిలో అయినా దర్శనం చేసుకునేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. నరసింహస్వామి విగ్రహంతోపాటు ఇస్కాన్‌కు చెందిన ప్రభుపాదుల విగ్రహం, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తి, ఇతర దేవతా మూర్తుల ప్రతిమలూ ఇక్కడ నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణభక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అక్కడివాళ్లను చూస్తే శ్రద్ధ, నిర్మలత్వం, అంకితభావం మనకన్నా మన భావజాలాన్ని అందిపుచ్చుకున్న విదేశీ ఇస్కాన్‌వారికే ఎక్కువ అనిపించింది. ఈ ప్రహ్లాద నృసింహ దేవుణ్ణి కీర్తనలతో భజనలతో షోడశోపచార పూజలతో కొలుస్తారు. వేకువ జామునే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వేళల్లోనూ ఇక్కడ అర్చన, అభిషేకం, సుప్రభాతం యథావిధిగా జరుగుతాయి. మన సింహాచలం దేవాలయంలో మాదిరిగానే పూజా వేళల పట్టిక ఉంటుంది. వైష్ణవసంప్రదాయం ప్రకారం ఇక్కడ అన్ని పండగలూ నిర్వహిస్తారు. మే, జూన్ నెలల్లో వచ్చే నృసింహజయంతిని వైభవంగా చేస్తారు. అనేకమంది యూరోపియన్లు ఈ గుడిలో వైష్ణవ మతాన్ని స్వీకరించి పేర్లు మార్చుకుంటుంటారు. ప్రతి శనివారం వేదఘోష సాయంకాలం వేళ హోమం ఉంటుంది. ప్రతిరోజూ అగ్నిహోత్రపూజ జరుపుతారు. ఆలయాన్ని నిర్వహించేవారిలో భారతీయ సంతతికి చెందినవారు నలుగురే. మిగిలిన వారంతా ఐరోపావాసులే. వేదమంత్రాలతో వివాహం చేసుకోవాలనుకునే ఐరోపావాసులు ఈ ఆలయాన్ని ఆశ్రయిస్తుంటారు.ఆలయ పచ్చిక బయళ్లలో సుమారు యాభై ఆవులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. వాటిమెడలో గంటలు చేసే చిరుసవ్వడి ఆ నిశ్శబ్ద వాతావరణంలో వీనులవిందుని కలిగిస్తుంటుంది. ఈ ఆవులపట్ల ఎవరూ హింసాత్మకంగా ప్రవర్తించకూడదు. పూలతోటలకీ కూరగాయల మొక్కలకీ ఈ ఆవుల పేడను మాత్రమే ఎరువుగా వాడతారు. ఈ ఆవుల పాలు, పాల ఉత్పత్తులను ఆలయ అవసరాలకి ఉపయోగిస్తారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.