కొత్త సంవత్సరం వచ్చిందంటే మద్యం ప్రియులకు పండగే. 31st రాత్రి నుండే తాగడం మొదలవుతుంది. ఆ కొత్త సంవత్సరంలో పార్టీల జోరు దాదాపు జనవరి అంతా కొనసాగుతూనే ఉంటుంది. బంధువులతో, స్నేహితుల బలవంతంతో ఎక్కడో ఒక దగ్గర ఓ పెగ్గు ఎక్కువ కూడా తాగాల్సివస్తుంది.

కానీ, ఫలితంగా రాత్రి జరిగిన పార్టీ మత్తు దిగగానే, తల బరువుగా అనిపిస్తుంది. వాంతులు, కళ్లు తిరగడం ఉంటుంది. అతిగా మద్యం సేవించినప్పుడు మైకంతో పాటు దాహం, అలసట, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే. చాలా మంది ఇది తాగడం వల్ల వచ్చిన హ్యాంగోవర్ అంటారు. ఊరగాయ, లేదా గుడ్డు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందని చెబుతారు.
ఎక్కువ మద్యం తాగిన తర్వాత తరచూ కొంతమంది హ్యాంగోవర్ ఉందని చెబుతుంటారు. దాంతో, రాత్రి పట్టుబట్టి ఎక్కువ మద్యం తాగించిన స్నేహితులే, తర్వాత రోజు హ్యాంగోవర్ దిగడానికి చిట్కాలు చెప్పడం మొదలెడతారు. కానీ, దేనివల్ల మీకు నిజంగా హ్యాంగోవర్ నుంచి విముక్తి లభిస్తుంది.. అసలు అలాంటివి ఏవైనా ఉన్నాయా?

హ్యాగోవర్ దిగడం ఎలా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, ఇది వేల ఏళ్ల క్రితం నుంచీ ఉంది. ఈజిఫ్టులో 1900 ఏళ్ల క్రితం దొరికిన ఒక మెనూలో మద్యం తాగిన తర్వాత ఆ హ్యాంగోవర్ దించుకోడానికి కొన్ని చిట్కాలు కూడా రాశారు. అంటే ఆ కాలంలో కూడా జనం ఎక్కువ మద్యం తాగినపుడు ఆ హ్యాంగోవర్ వదిలించుకోడానికి నానా తంటాలు పడేవారని, దానికి పరిష్కారం వెతుక్కునేవారని తెలుస్తుంది. కానీ ఆ మెనూలో ఉన్న మందును ఈరోజుల్లో అమల్లోకి తీసుకురావడం చాలా కష్టం.

కానీ, ఇప్పటికీ మద్యం హ్యాంగోవర్ దిగడానికి ఎన్నో చిట్కాలు చెబుతుంటారు. అంటే వేయించిన కనరీ పిచ్చుక మాంసం, ఉప్పు చల్లిన రేగుపండ్లు, పచ్చి గుడ్డు, టమాటా జ్యూస్, సాస్ తదితరాలు తినమంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీటిలో ఏదైనా మత్తు లేదా హ్యాంగోవర్ నుంచి నిజంగా విముక్తి కల్పిస్తుందా అనేది పక్కాగా చెప్పలేం.
మన దురదృష్టం ఏంటంటే… హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేవు. మత్తు దిగేదాకా తాగకుండా విరామం ఇవ్వడమే ఉత్తమైన మార్గం. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే మరింత ఆల్కహాల్ తాగకుండా ఉండాలి.

రెడ్ వైన్ తీవ్రమైన హ్యాంగోవర్‌కు కారణమవుతుంది. అందులో ఉండే రసాయ పదార్థం రక్త నాళాలు కుంచించికుపోయేలా చేస్తుంది. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వోడ్కాతో అలాంటి సమస్యలు కాస్త తక్కువ. ఎందుకంటే స్వచ్ఛమైన వోడ్కాలో ఆల్కహాల్ మద్యం, నీరు మాత్రమే ఉంటాయి.

హ్యాంగోవర్‌లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా చాలా పెద్దదిగా వినిపిస్తుంది. ఎక్కువ వెలుతురులో ఉండలేరు. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది కషాయం లాంటివి తాగుతుంటారు. లేదా చంకలో నిమ్మకాయ రుద్దుకుని హ్యాంగోవర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇవి కాకుండా హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు మరిన్ని సులభమైన మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
ఆల్కహాల్ పీయూష గ్రంథిని నిలువరించి, వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు… మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి పడుకునే ముందు నీళ్లు తాగితే హ్యాంగోవర్‌ను కాస్త తగ్గించేందుకు వీలుంటుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం వల్ల హ్యాంగోవర్‌ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ నియంత్రణకు వచ్చి వికారం, అలసట, బలహీనత వంటివి తగ్గుతాయి. కాబట్టి అతిగా మద్యం సేవించినప్పుడు.. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం తీసుకుంటే హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవచ్చు.
చాలావరకు డ్రింక్ పార్టీలు రాత్రి సమయాల్లోనే జరుగుతుంటాయి. రాత్రి పూట ఎక్కువసేపు తాగడం వల్ల నిద్రభంగం కలుగుతుంది. తద్వారా తొందరగా అలసిపోతారు. అందుకే డ్రింక్ చేసినప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అలా కాకుండా అలసటతోనే ఇతరత్రా పనులు చేస్తే హ్యాంగోవర్ మరింత పెరుగుతుంది. కాబట్టి హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే ఎక్కువసేపు నిద్రపోవడం చాలా ముఖ్యం.

కొందరు అరటిపండు తింటే ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఎందుకంటే మద్యం తాగడం వల్ల శరీరంలోని పొటాషియం తగ్గిపోతుందని, అరటిపండు తినడం వల్ల శరీరానికి పొటాషియం లోటు తీరుతుంది అంటారు. హ్యాంగోవర్ కూడా దిగిపోతుందని చెబుతారు.
