A Slipper Shot Write Up To All The Pseudo Intellectuals Who Criticised SP Balu Garu After His Demise

Written By Moshe Dayan

ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయాడని తెలిసినప్పుడు నాకు బాలసుబ్రమణ్యం గుర్తుకురాలా.మా ఊరు గుర్తుకొచ్చింది.మేడికొండ యోహానన్న గుర్తుకొచ్చాడు.మేషగ్గాడు గుర్తుకొచ్చాడు.రాయిదొరువు వొడ్డున పూచే ఉమ్మెత్తపూలు గుర్తుకొచ్చాయి.దిబ్బతాళ్ళూ,మొగలిపొదలూ గుర్తుకొచ్చాయి.నేనయిదో క్లాసులో ఉన్నప్పుడు రోజూ నాతో చదువు చెప్పించుకుని నా చేతిలో ఇంత బెల్లం ముక్క పెట్టే కోమటోళ్ళ పుష్పాలమ్మ గుర్తుకొచ్చింది.

చిన్నప్పుడు slambook లో ‘what is your favourite place?’అన్న ప్రశ్నకి my village అని రాసేవాణ్ణి.ఈరోజుకీ నాదదే మాట.మా ఊరంటే నాకెందుకిష్టం?మీకు మీ ఊరెందుకిష్టమో నాకు మా ఊరందుకిష్టం.మేఘమాలికలని ముద్దాడే పర్వతపంక్తులున్నాయా? లేవు.సప్తవర్ణఫలపుష్పాలంకృతమైన సుందరనందనాలూ,గలగలపారే సెలయేళ్ళున్నాయా? లేవు.తాటిచెట్లూ తుమ్మచెట్లూ ఉన్నాయి.మురుగునీటిదొరువులున్నాయి.కాల్లో విరిగిన తుమ్మముళ్ళ జ్ఞాపకాలున్నాయి.దొరువుల్లో ఈదులాడిన రోజులున్నాయి.అయినా ఇష్టం.అందుకే ఇష్టం.మా ఊరు నా అస్తిత్వం లో భాగం.నా అస్తిత్వానికి మూలం.నాకు జన్మనిచ్చిన తల్లి.ఎస్పీ పాటలతో నా అనుబంధం కూడా అటువంటిదే.

నాకు ఊహ తెలిసేటప్పటికే ఎస్పీ పాటలున్నాయి.ఇన్నేళ్ళలో ఈ రోజువరకూ ఏదో ఒక రూపంలో ఆయన పాట లేని రోజు బహుశా ఒక్కటికూడా లేదు.రోజంతా ఆ పాటలే వినిపించిన కాలమొకటుండేది.పొద్దుపొద్దున్నే చర్చిలోనుండి బిల్మోరియానో ఎస్పీనో పాడిన పాటలొకవైపూ శివాలయం నుండి అదే మనిషి పాడిన శివస్తుతో,బిల్వాష్టకమో మరొకవైపూ క్రిస్టమస్ పొగమంచుని చీల్చుకుంటూ వినబడేవి.ఇంటిముందు మెంటా పెదబాబన్న గొడ్లకి కుడితి పెడతానో తూర్పుకి మేతకి తోలుకెల్తానో గొడ్లకోసం ,కొంత తనకోసం పాడుకునే పాటలినిపించేవి.అయితే ఎస్పీ, లేకపోతే చీమకుర్తి నాగేశ్వర్రావూ, అప్పుడప్పుడు గంటసాలా. అంతే. పండగలకీ పెళ్ళిళ్ళకీ జుట్టుపిట్టడనబడే యెషయానో మల్లిగాడనబడే మార్పు ఎలీషా అన్నో చెట్లకీ వెదురు బొంగులకీ మైకులు కట్టి పాటలు పెట్టేవాళ్ళు.అక్కడ కూడా అయితే ఎస్పీ లేకపోతే చీమకుర్తి నాగెశ్వర్రావు.ప్రేం కుమారూ,బొనిగల సురేషూ పెళ్ళి స్టేజీల మీదకెక్కి మహిళా ప్రేక్షకుల కోసం ‘నేనొక ప్రేమ పిపాసిని ‘ వంటి పాటలు పాడేవాళ్ళు.అడపాదడపా వర్కౌట్ చేసుకునేవాళ్ళు.ఎస్పీవోడూ ఇళయరాజా మా మేడికొండోళ్ళేననేవాడు మేడికొండ యొహానన్న.కరుణామయుడు సినిమాలోని ఐటం సాంగ్ కూడా దేవుడిపాటేననుకునే పిచ్చిజనంలో పుట్టిపెరిగిన నేను నిజమేననుకునేవాణ్ణి.సర్వం బాలుమయం.మాకుగానీ మా గొడ్లకిగానీ శాస్త్రీయ సంగీతపు సొబగులు తెలియదు.సైగల్ గానీ బడేగులాం అలీఖాన్ గానీ మాఇళ్ళకి రాలేదెప్పుడూ.అందుకు మేము సిగ్గుపడాలంటారా?అన్నమయ్యలోని ఆర్ద్రతకి కరిగిపోకుండా,తలత్ మహమూద్ గాత్రం లోని రసమాధుర్యాన్ననుభవించకుండా సాంస్కృతిక వెనుకబాటుతనంలో మగ్గిపోతున్న మమ్మల్ని చూసి జాలిపడుతున్నారా? My foot!

ఈ మధ్యే హాలీవుడ్ సినిమాలు చూట్టం మొదలుబెట్టిన మిత్రుడొకడున్నాడు.ప్రతి మూడోమాటకి క్రిస్టొఫర్ నోలన్ అంటాడు [ మొదటి రెండుమాటలు ‘నేను ‘,’నాకు ‘ ].అంటే పరవాలేదు,తెలుగుసినిమా అంతా చెత్తేనంటాడు.మన కల్చరల్ పావర్టీ గురించి ఉపన్యాసాలిస్తాడు.నిజానికా విమర్శలేవీ నాకు వర్తించవు.నేను థియేటర్లో తెలుగు సినిమా చూసి రెండేళ్ళవుతుంది.నోలన్లే కాదు,నాకు కురసోవాలూ,తర్కోవ్ స్కీలు కూడా తెలుసు.అయినా తన మేధోప్రదర్శనలోని దబాయింపుకి చిరాకేస్తుంది.ఎక్కడో కాలుతుంది.అసలే మేధోప్రదర్శనలోని దబాయింపుకైనా ఎవరికైనా ఎందుక్కాలుతుందో అప్పుడర్ధమౌతుంది.భౌతికమైన సరిహద్దులన్నీ చెరిగిపోయిన ఈ కాలంలో ఏ అంశం గురించయినా ప్రాధమిక సమాచారం తెలుసుకోలేని వాజమ్మలెవరున్నారిక్కడ?రఫీ ,రహత్ ఫతేఅలీ ఖాన్ గురించి మా పక్కింటి పుల్లారావుకి తెలియదా? తెలుసు.నాకూ తెలుసు.త్యాగరాజు కృతులూ చౌరాసియా ఆలాపనలూ మీ పక్కింటి పుల్లారావు వినలేదా?విన్నాడు.నేనూ విన్నాను.ఇంకా చాలా విన్నాను.Nancy sinatra,Nawang Kechog,Sarah Brightman,Mangolian throatsingers,మొన్నీమధ్యే పరిచయమైన కన్నడ ఫోక్ సింగర్ Ananyaa bhatt…… చాలామందే ఉన్నారు.కానీ ‘ఆకుచాటు పిందెతడిసే’ పాట Pavarotti పాడలేడు.’నీలాలూ కారేనా’ పాట రహత్ పాడలేడు.పాడుంటే వాళ్ళే బాలసుబ్రమణ్యాలయ్యుండేవాళ్ళు.ఒక్క పాటతో నన్ను నాకు దగ్గర చేస్తాడే, అందుకా గాత్రానికి నిస్సందేహంగా రుణపడిఉన్నాను.ఎప్పటికైనా ఎవ్వరైనా ఒక్క మనిషి జీవితమ్మీద అంతబలమైన ముద్ర వెయ్యగలిగే ఒక్క బొమ్మ వెయ్యగలిగితే చాలనుకుంటాను

ఆయనకసలు ప్రతిభే లేదంటున్నారా? మీకొక నమస్కారం.

కరుడుగట్టిన సినిమా గాయకుడనీ ,పాండిత్యపు ఛాయలే లేవన్నదే మీ అభ్యంతరమైతే ఎందుకుండాలంటాను. మేధస్సు,పాండిత్యం కళకున్న అతిపెద్ద అవరోధాలని నమ్మేవాణ్ణి.Lovemaking లాగా,జీవించటంలాగా కళ కూడా an act of innocence అని నా విశ్వాసం.శృంగారం వ్యాయామం కోసం కానట్టూ,జీవితం విజయసోపానాలధిరోహించటానిక్కానట్టూ కళ కూడా మేధోప్రకటన కోసం కాదనుకుంటాను.కాదూ నేను బొజ్జ కరిగించుకుంటానికే శృంగారం చేస్తాననంటే మీ స్వేచ్చని కాదందెవరు?కానీ అదేమీ శిలాక్షరనియమం కాదని గమనించుకోవాలి.

ఆయనలోని కులతత్వం గురించీ కెరీరిస్ట్ రాజకీయాలగురించీ మాట్లాడవలసిందే.ఖచ్చితంగా నిలదీయవలసిందే.అంత దుర్మార్గుడే అయితే సమర్ధించేదెవరు?కానీ నిజంగా మనందరిలో లేని ప్రత్యేకమైన దుర్మార్గం ఆయనొక్కడిలోనే ఉందా? Aren’t we all part of the same hypocrisy ?

ఎదగటం మాట దేవుడెరుగు అసలు బతకటానికే నానాపాట్లూ పడుతుంటాం,వందరకాలుగా విలువలతో రాజీ పడుతుంటాం,సామూహిక దుర్మార్గాన్నొకవైపు పెంచిపోషిస్తూ వ్యక్తులనేమని నిందిస్తాం?మనమంతా చేస్తున్నదేమిటి?అసమానతలనీ అణచివేతనీ వ్యవస్తీకృతం చేసిన విద్యావ్యవస్తలో పైకెదుగుతాం.ఉద్యోగాలూ హోదాలూ సంపాదిస్తాం.అదంతా మన గొప్పతనమని ప్రకటించుకుంటాం.ఎంతమంది పతనాల మీద నడిచొచ్చి ఈ స్టాయికి చేరామో ఏనాడైనా లెక్కలేసుకున్నామా? అయినా సరే ఆయన్ని శిలువెయ్యాల్సిందే అంటే చేసేదేముంది?అట్లాగే చేద్దాం.

కానీ నాయనలారా, ఆ వంకతో జనం మీద మీ పెత్తనమేమిటో అర్ధం కావటంలేదు.బాలసుబ్రమణ్యం దేవుడనీ,గంధర్వుడనీ జనమనుకునే మాటలకెందుకంత కలవరపడుతున్నారు?వీళ్ళంతా సాధారణమైన భావోద్వేగాలున్న సాదాసీదా మనుషులేకదా?అవన్నీ అభిమానంతో కూడిన అతిశయోక్తులేనని మీకూ తెలుసుకదా?ఆమాత్రం క్షమించలేరా?మరి మీరెందుకు ఒక్కపూట సుఖవిరేచనం కాకపోతే అదొక పెద్ద existential crisis గా చిత్రీకరిస్తూ కవిత్వం రాస్తారు?అది అతిశయం కాదా? ఎందుకు మీ కళాకౌశలాలని వంద డెసిబెల్స్ లో ప్రకటించుకుంటారు? మంచినే కాదు చెడునీ చర్చించాలంటారు.నిజం నిగ్గు తేల్చాలంటారు. .మరి మీ మేధస్సునీ,సంస్కారాన్నీ స్థుతించుకుంటూ మీరు క్రమం తప్పకుండా రాసే పది పోస్టుల్లో ఒక్కటైనా మీలోని మురికిని చర్చించేదుంటుందా?
సకలమైన దురహంకారాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేసే మీకు జ్ఞానాహంకారం కూడా దుర్మార్గమైనదేనన్న జ్ఞానం లేకపోవటం మా ప్రాణానికొస్తుంది.భగవంతుడు మిమ్మల్నాదిశగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

ఎస్పీబీ వినయంలో బయటికి కనిపించే అతి మమ్మల్నీ ఇబ్బంది పెడుతుంది.’సాజన్ ‘ పాటలు వినబడితే ‘ ఇదిగో,బాలు తెలుగులో పాడిన హిందీ పాటలొస్తున్నాయని మేమూ జోకులేసుకుంటాం.మీరు నమ్మరు.మాది తప్పులెన్నలేని గుడ్డిప్రేమ అనుకుంటారు.అట్లనుకుంటేనే తృప్తి మీకు.సరే కానివ్వండి.

నిజమే,బాలుకి బొజ్జ లేకుండా సిక్స్ పాక్స్ ఉంటే బాగుండేది.రఫీలాంటి సంస్కారముంటే బాగుండేది.మా తాతయ్య Astrophysics లో Ph.D చేసుంటే బాగుండేది.మా ఊరు నీలగిరి కొండల్లో ఉంటే బాగుండేది.కొండలూ గుట్టలూ,ఎత్తుపల్లాలూ లేకుండా నేలంతా సమతలంగా ఉంటే బాగుండేది . ఉమ్మెత్త చెట్లకి గులాబీలు పూస్తే బాగుండేది. లేదని మాకూ తెలుసు.అందుకే ఉన్నదాంతో తృప్తి పడతాం.చేతనైనంత మార్చుకుంటాం.

ఘనత వహించిన అయ్యలారా,అమ్మలారా,మీరు దేవుళ్ళూ,దేవతలూ. మీ చదువులు గొప్పవి.మీ సంస్కారం సర్వోత్కృష్టమైనది. మీ సిద్ధాంతాల దారి నుండి ప్రాణం పోయినా ఒక్కడుగు బయటికి పోరు. మీ పొట్టపట్టేదానికంటే ఒక్క ముద్ద ఎక్కువ తినరు.లెక్కమించి ఒక్క గ్రాము అపానవాయువు ఎక్కువ వదలరు.మేము మనుషులం.కాబట్టి అజ్ఞానులం.అయినా అనందంగానే ఉన్నాం.జీవితంలో కొంచెమైనా అందం మిగుల్చుకోగలిగాం.మా దారిన మమ్మల్ని బతకనివ్వండి.మా పాటలు మమ్మల్ని పాడుకోనివ్వండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR