శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం సాక్ష్యాత్తు పరమేశ్వరుడే విశ్వేశ్వరునిగా జన్మించాడా?

0
11247

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో తెలిపిన విధంగా సుమారు 260 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు విశ్వేశ్వరుడుగా జన్మించాడు. మరి ఆ పరమేశ్వరుడు సనారి విశ్వేశ్వరస్వామిగా పూజలందుకొంటున్న ఆ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Sanari Vishweshwara Swamula

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలంలో శ్రీ సనారి విశ్వేశ్వరస్వామి ఆలయం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో తెలిపిన విధంగా సుమారు 260 సంవత్సరాల క్రితం పాలకొండలో సాక్ష్యాత్తు పరమేశ్వరుడే సనారి విశ్వేశ్వరునిగా జన్మించి, ఆంధ్రప్రదేశ్ లోనేకాక ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల భక్తుల పులందుకుంటాడని తెలియచేసారు.

Lord Sanari Vishweshwara Swamula

అయితే సనారి విశ్వేశ్వరుడు పాలకొండలో జన్మించి యుక్త వయసులో అన్నపూర్ణాదేవిని వివాహమాడి పాలకొండ పరిసర ప్రాంతాల ప్రజలకు తన మహిమలు చూపిస్తూ, భక్తులను రోగాలనుండి వారి వారి భాదల నుంచి విముక్తి చేస్తూ ఎన్నో మహిమలు ప్రదర్శించారని పూర్వికులు ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. తన భార్య అన్నపూర్ణాదేవి తన సన్నిధిలోనే లోకకల్యాణార్థం సజీవ సమాధి అయినా తరువాత పాలకొండ పొరుగున గల అన్నవరం గ్రామా పరిసరాల్లో శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయాన్ని నిర్మించి లింగ ప్రతిష్ట చేసి తన యావదాస్థులను శ్రీ రామలింగేశ్వరాలయానికి ధారాదత్తం చేసి తరువాత కాలజ్ఞానం బోధిస్తూ దేశపర్యటనలో భాగంగా మద్రాస్ చేరుకున్నారు.

Lord Sanari Vishweshwara Swamula

మద్రాస్ చేరుకున్న తరువాత అచట కుష్ఠువ్యాధితో బాధపడుతున్న వైశ్యునికి తన దివ్యశక్తులతో వ్యాధి నయం చేసి తానూ సాక్షాత్తు పరమేశ్వరుని అంశయే అని తెలియపరిచారు. దానికి నిదర్శనంగా త్రినేత్రాన్ని కూడా ప్రదర్శించారు. అయితే ఏలూరులో స్వర్ణయాగం చేసి కాలజ్ఞానం బోధిస్తూ శ్రీశైల అడవుల్లో జ్ఞాన యోగిగా తపస్సులో మునిగిపోయినట్లు భక్తుల విశ్వాసం.

Lord Sanari Vishweshwara Swamula

ఇక శ్రీ సనారి విశ్వేశ్వర అన్నపూర్ణాదేవిల సన్నిధానంలో వెలసిన ఆలయం పవిత్ర స్థలంగా భావించి భక్తులు నిత్యా ధూప దీప నైవేద్యాలతో పూజిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో నిర్మల హృదయంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ఈ ప్రాంతంవారే కాకుండా తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు మహాశివరాత్రి పర్వదినాన జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలిరావడం పాలకొండ పట్టణానికి ఒక ప్రత్యేకత.

Lord Sanari Vishweshwara Swamula

ఈవిధంగా మూడురోజులు స్వామి సన్నిధిలో నిర్మలమైన మనసుతో నిద్రించినవారి మనసులోని కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం.