తెలంగాణ రణరంగానికి ప్రాణం పోసిన పొదరిళ్ళుగా చెబుతారు. ఇక్కడ అనేకమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొలువైఉన్నాయి. అలా వెలసిన కొన్ని ముఖ్యమైన ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. మరి ఆ ఆలయాలు ఏంటి? వాటికీ ఉన్న ప్రాముఖ్యత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సరస్వతి ఆలయం:
దేశంలో సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలు. అందులో ఒకటి కాశ్మీర్ లో ఉండగా, రెండోది తెలంగాణలోని బాసరలో ఉంది. బాసరలో వెలసిన సరస్వతి ఆలయంలో, వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం ఇదే అవ్వడం విశేషం.
బ్రహ్మ ఆలయం:
బ్రహ్మదేవుడి ఆలయాలు దేశం మొత్తంలో రెండు ప్రాంతాలలో ఉన్నాయి. అందులో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంటె మరొక ఆలయం తెలంగాణలోని ధర్మపురిలో ఉంది. ఇక ఆలయ విషయానికి వస్తే ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమమునందు ఎక్కడా కనబడని బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్రపురాణము తెలుపుతున్నది. ఇంకా యముడు శివునికై తపస్సు చేసిన ప్రాంతం ఇదేనని చెబుతారు.
త్రివేణి సంగమం:
త్రివేణి సంగమాలు ఉన్నవి కూడా రెండు ప్రాంతాలలోనే ఉన్నాయి. ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో ఉంటె మరొకటి తెలంగాణలోని కాళేశ్వరంలో ఉంది. ఈ ఆలయ విషయానికి వస్తే, సాధారణంగా గర్భగుడి లో ఒకటే శివలింగం ఉంటుంది. కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది , మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). దేశం మొత్తంలో ఇలా గర్భగుడిలో రెండు శివలింగాలు దర్శనం ఇచ్చే ఆలయం ఇదొక్కటే అని చెబుతారు.
ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషమైతే ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్ళి కలుస్తుందంటారు.
నది ఉత్తర దిక్కుకు ప్రవహించే అరుదైన దృశ్యం:
దేశంలో ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు. అందులో ఒకటి మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ ఆలయ సమీపంలోని నర్మదా నది అయితే, మరొకటి తెలంగాణ రాష్ట్రంలోని, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నుండి 30 కీ.మీ. దూరంలో చెన్నూరు గ్రామం కలదు. ఈ గ్రామంలో శ్రీ అగస్తేశ్వరాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిది గాంచింది. దీనినే ఉత్తర వాహిని తీరం అని కూడా పిలుస్తుంటారు.
ఇక్కడ విశేషం ఏంటంటే, సాధారణంగా నదులన్నీ పశ్చిమదిశ నుండి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ ఇచట ఉన్న గోదావరి నదికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో గంగానది ఉత్తరదిశగా 6 కీ.మీ. ప్రవహిస్తుండగా చెన్నూరు ప్రాంతంలో పక్కూర్ గ్రామం నుండి కోటపల్లి మండలంలో పదుపల్లి గుట్టలవరకు గోదావరి నది ఉత్తరదిశగా 15 కీ.మీ. ప్రవహిస్తుంది.
ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే అఖండజ్యోతి. ఇది సుమారుగా 410 సంవత్సరాల నుండి నిరంతరం వెలుగుతూనే ఉంది. పూర్వము దీన్ని జక్కేపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణా భక్తుడు ఈ అఖండ దీపని వెలిగించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జ్యోతి దేదీప్యమానంగా నిరంతరం వెలుగుతూనే ఉంది.
ఇలా తెలంగాణాలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నకొన్ని ఆలయాలుగా వీటిని చెప్పవచ్చును.