Home Unknown facts సంతాన బిల్వ వృక్షం ఉన్న ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

సంతాన బిల్వ వృక్షం ఉన్న ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

కలియుగ దైవంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఇక్కడి కొండపైన వెలసి నామాల వెంకటేశ్వరస్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ కొండ చుట్టూ భక్తులు, ఆవులను కూడా గిరి ప్రదక్షిణ చేయిస్తుంటారు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో సంతాన బిల్వ వృక్షం కూడా ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ స్వామివారు ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Namala Venkateswara Swamy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటకు దగ్గరలో తిరుమలగిరి అనే ఊరిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. తిరుమలగిరి అని అనగా పవిత్ర కొండ అని అర్ధం. ఈ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం భరద్వాజ మహర్షి ఇక్కడ కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండమీద ఒక ఆశ్రమం నిర్మించుకొని గొప్ప తపస్సుని చేసాడు. ఇలా ఆ మహర్షి తపస్సు చేస్తుండగా ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యేక్షమై వరం కోరుకోమని అడుగగా, అప్పుడు ఆ మహర్షి నీవు ఈ కొండపైన వెలసి కలియుగంలో భక్తులని అనుగ్రహించాలని కోరుకోగా, శ్రీ వేంకటేశ్వరస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని పురాణం. అయితే ఈ కొండపైన స్వామివారు నామాలు ధరించి వెలిసాడు కాబట్టి ఈ స్వామికి నామాల వేంకటేశ్వరుడు అనే పేరు ప్రసిద్ధిచెందింది.

ఈ ఆలయ విషయానికి వస్తే, వేంకటేశ్వరస్వామి కి తూర్పున ఎడమకాలి పాద ఘట్టనతో ఒక కోనేరు ఏర్పడింది. ఏకశిలా పాదం ఆకృతిలో ఈ కోనేరు ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే బిల్వవృక్షం ఉంది. దీనినే సంతాన బిల్వవృక్షమని అంటారు. ఈ వృక్షానికి పూజ చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆవులను కూడా గిరి ప్రదక్షిణ చేయిస్తారు. ఇలా ఆవులు గిరి ప్రదక్షిణ చేస్తే ఆవులకు కోడదూడలు పుడుతాయనేది భక్తుల నమ్మకం.

ఇక ఆలయాన్ని సూర్యాస్తమయం అయిందంటే మూసివేస్తారు. అందుకే సాయంత్రం తరువాత ఇటు వైపుగా ఎవరిని కూడా అనుమతించారు. ఇక్కడ పండగల సమయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ఫాల్గుణమాసం నెలరోజులలో ఆఖరి శనివారం నాడు ఆ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

Exit mobile version