Home Unknown facts ఈ ఆలయంలో వెలసిన ముఖలింగాన్ని దర్శనం చేసుకోవడం వలన మోక్షం లభిస్తుంది

ఈ ఆలయంలో వెలసిన ముఖలింగాన్ని దర్శనం చేసుకోవడం వలన మోక్షం లభిస్తుంది

0

పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా, ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శివుడు లింగరూపంలో కాకుండా ముఖం దాల్చి భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. మన పురాణాల ప్రకారం, కాశీలోని లింగాన్ని దర్శించడం, గంగలో స్నానం చేయడం, శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవడం మరియు ఈ ఆలయంలో వెలసిన ముఖలింగాన్ని దర్శనం చేసుకోవడం వలన మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Srikakulam Srimukhalingam Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పవిత్ర వంశధార నది తీరంలో ఉన్న శ్రీముఖలింగం అనే గ్రామంలో శ్రీ ముఖలింగేశ్వరాలయం ఉంది. అతిప్రాచీన ఆలయమని చెప్పాబడే ఈ ఆలయంలో అష్టతీర్థాలను అశ్విని దేవతలు ఏర్పాటు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ శివలింగాలను దర్శించి శ్రీ ముఖలింగేశ్వరుని ముఖం చూస్తే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి ఇక్కడ కొలువైన మధుకేశ్వరుడుని దర్శించుకున్నారని పురాణం.

ఇక ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, ఆలయ గర్భగుడిలో శివలింగం వెనుక ఒక పెద్ద గోలెం ఉంది. అయితే పూర్వం ఒకతను స్వామివారిని రోజు పూజిస్తూ, తనకి సంతానాన్ని ప్రసాదిస్తే ఒక పెద్ద మట్టి గోళాన్ని తయారుచేసి అందులో ఆవు పాలు పోసి అభిషేకిస్తానని ప్రార్ధించగా, శివుడి అనుగ్రహంతో అతడికి కొడుకు జన్మించాడు. ఇక మొక్కు ప్రకారం ఒక పెద్ద మట్టి గోళాన్ని తయారుచేసి అందులో ఆవు పాలు పోసి గర్భగుడిలోకి తీసుకువెళ్లాడనికి ప్రయత్నించగా గర్భగుడి ద్వారం కంటే గోలెం పెద్దది అవ్వడంతో నిరాశతో ఇచ్చిన మొక్కు తీర్చలేదని ఆ గోలెం తో పాటు శివుడి అనుగ్రహం వలన పుట్టిన కొడుకుని కూడా ఆలయ గర్భగుడి బయట వదిలేసి వెళ్ళిపోయాడు.

ఇక మరుసటి రోజున ఆలయ అర్చకుడు ఉదయం వెళ్లి గర్భగుడి తీసి చూడగా శివలింగం వెనుక ఆ మట్టి గోలెం ఉండగా, దానిపక్కనే ఆడుకుంటున్న చిన్న బాలుడిని చూసి ఇది ముఖలింగేశ్వరుడి మహిమ అంటూ అందరు ఆ స్వామిని ప్రార్ధించారు. ఇక అప్పటినుండి కూడా కోరిన కోరికలు నెరవేరాలంటే, ఆ గోలెం నిండా బియ్యం, వడ్లు, అన్నం, పండ్లు వంటివి నిండుగా వేసి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయంగా వస్తుంది.

ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్న శివలింగం కాకా, ఎనిమిది వైపులా ఎనిమిది శివలింగాలున్నాయి. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహాలు ఉన్నాయి. ఇంకా అష్టతీర్థాలు అష్టదిక్కులు కొలువైన దేవతలు శ్రీముఖలింగంలో జరగనున్న రాజమహాయోగానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఆయా దేవతలను దర్శించుకోవడంతోపాటు ప్రధాన దేవాలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. ఇక్కడ దీర్ఘరోగాలు పటాపంచలైపోతాయి. కోరిన కోర్కెలు తీరి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మాన సిక రోగాలు, పిచ్చి, రుణబాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు చేయడం, తిల తర్పణ కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం.

సాధారణంగా పుణ్యనదులైన గంగ, కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి నదులకు గురుగ్రహం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభం తదితర రాశుల్లో ప్రవేశిస్తే నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వస్తాయి. అప్పుడు భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహిస్తారు. కాని శ్రీముఖలింగంలో జరగనున్న అష్టతీర్థాలకు అష్టమి, స్వాతి నక్షత్రంతో కూడిన పౌర్ణమి, సోమవారం, శ్రవణం నక్షత్రంతో ఒకే విధంగా ఉండాలి. ఇలా అరుదుగా సంభవిస్తాయి. ఇలా గతంలో 1946, 2000 సంవత్సరాల్లో వచ్చినట్లు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది.

ఈవిధంగా శివుడు ముఖలింగంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఇప్పచెట్టు నుండి వెలసిన ముఖలింగాన్ని దర్శనం చేసుకోవడం కోసం శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version