Home Unknown facts తమిళ రాష్ట్ర చిహ్నంగా ఉన్న రాజగోపురం ఏ ఆలయానిదో తెలుసా?

తమిళ రాష్ట్ర చిహ్నంగా ఉన్న రాజగోపురం ఏ ఆలయానిదో తెలుసా?

0

వజ్ర వైఢూర్యాలు, సిరిసంపదలు, హంగూ ఆర్భాటాలు ఇవేమీ భగవంతునికి అక్కర్లేదు. భగవంతుడు ఎప్పుడూ భక్తుల పాలిట పక్షపాతే. ఆ జగత్ పాలకుడికి కావల్సింది నిశ్చలమైన భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం, అవుంటే వైకుంఠం నుంచి కూడా తరలి వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కున చేర్చుకుని సేద తీరుస్తాడు. అలా తన నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాధుడినే మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి. ఆండాళ్‌గా పూజలందుకుంటున్న ఆ తల్లి ఆవిర్భవించిన పుణ్యధామమే ‘శ్రీవిల్లిపుత్తూరు’. ఇలలో శ్రీవైకుంఠంగా విరాజిల్లుతూ శ్రీమన్నా రాయణుడు ”వటపత్రశాయిగా కొలువు తీరి ఉన్న పుణ్యధామం కూడా ఇదే.

గోదాదేవిస్థల పురాణము:

పెరియాళ్వార్, ఆండాళమ్మ జన్మ స్థలం. పెరియాళ్వార్ కి విష్ణు చిత్తార్ అని కూడా పేరు. శ్రీవిల్లిపుత్తూరులో క్రీ.శ.725 లో శ్రీముకుందా చార్యులు- పద్మావతి దంపతులు నివసించేవారు. వారికి భట్టనాధుడు అనే పుత్రుడు కలిగాడు. అతడు నిరంతరం విష్ణుమూర్తినే మనసులో ధ్యానిస్తూ ఉండడం వల్ల విష్ణుచిత్తుడు అనేపేరు వచ్చింది. విష్ణుచిత్తుడు స్వయంగా పూలమాలలను అల్లి, వటపత్రశాయికి అలంకరించి, ఆనందించేవాడట! ఒకనాడు గరుడవాహనమెక్కి, లక్ష్మీనాధుడు ఆయనకు దర్శనమివ్వగా,ఆ సౌందర్యానికి ముగ్ధుడై, స్వామికి దృష్టి దోషం లేకుండా ఉండాలని, సహస్ర వర్షములు అలాగే వర్థిల్లాలని, కోరుకుంటూ తిరుప్పల్లాండు పాడాడట! అప్పటినించీ ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అనే పేరు వచ్చింది. అలాగే, శ్రీవిష్ణుచిత్తుడు ఒకరోజున తోటలో పూలు కోస్తూండగా, తులసీవనంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక ఆడపిల్ల దొరికింది. ఆయన ఎంతో సంతోషించి,సీతాదేవియే తన ఇంటికి వచ్చినట్లుగా భావించి, ఆ పాపకి కోదై అనే పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచాడట.

ఆ కోదై పేరు క్రమంగా గోదాగా స్థిరపడింది. తమిళంలో కోదై అంటే పూలమాలని అర్ధం చెబుతారు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాధుడ్ని అమితంగా సేవించేది. శ్రీరంగనాధుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్ప హారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి,ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. స్వామిని ఎప్పటికైనా వివాహమాడాలని తలచేది. ఎప్పుడూ స్వామి సేవలో తరిస్తూ గడిపేది. ఆమె వయస్సు పెరుగుత్నుకొద్దీ స్వామిపై భక్తి విశ్వాసాలు పెరిగాయి. భక్తిని మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ శ్రీహరిని సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇందులో 30 పాశురాలున్నాయి. ఆ పాశురాలను భక్తితో గానామృతం చేసి, తన భక్తిప్రపత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాధునిలోనే ఐక్యమైంది.

గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడ్తున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీవిల్లిపుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం. మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తులసీవనంలోనే అమ్మవారికి గుర్తుగా ఓ చిన్న మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు.ఆకట్టుకునే పరిసరాల మధ్య శోభాయమానంగా ఉన్న ఈ ప్రాంగణంలో తులసి వనం ఉంది. ఈ వనంలోనే అమ్మవారు ఓ శిశువుగా విష్ణుచిత్తునికి దొరికిందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. దీనికి సమీపంలోనే ఓ మండపాన్ని నిర్మించారు. ఈ మండపానికి ఆనుకుని ఉన్న మందిరంలో గోదాదేవి కొలువుదీరారు. ఆలయ బయట ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయ మందిరాలున్నాయి.

ఆండాళ్ శ్రీ విష్ణుమూర్తి నే వివాహమాడాలని నిశ్చయించి శ్రీ రంగనాధుడి పై ఇష్టం పెంచుకుంది. ఒక రోజు పెరియాళ్వార్ కి స్వప్నంలో రంగనాధుడు ఆండాళ్ ని తనతో వివాహం కోసం శ్రీరంగం తీసుకురమ్మని చెప్పాడు. పెరియాళ్వార్ ఆండాళ్ తో శ్రీరంగం వెళ్ళగా ఆండాళ్ ని శ్రీ రంగనాధుడు తనలో ఐక్యం చేసుకున్నాడు.

గోదాదేవి అమ్మవారి ఆలయానికి సమీపంలో వటపత్రశాయి మందిరం ఉంది. విశాలమైన ఆలయ ప్రాంగణం అత్యంత ఎత్తయిన రాజగోపురంతో ఈ ఆలయం అలరారుతోంది. ఈ గోపురం 11 అంతస్థులతో కూడి 192 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళనాడులో ఉన్నఆలయాల గోపురాలకెల్లా వటపత్రశాయి ఆలయ రాజగోపురం పెద్దది. అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వచిహ్నంగా ఈ ఆలయరాజ గోపురం విరాజిల్లుతోంది.

వటపత్ర శాయి ఆలయానికి సంబంధించి పురాణ గాధ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భూమండలం అంతా జలరాశిలో మునిగిపోయి ఉండగా, దాన్ని ఉద్ధరించడానికై శ్రీహరి వటపత్రశాయియై నీటిపైన తేలియాడిన ప్రాంతం ఇదేనని ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే భూమి జలరాశి నుంచి బయటపడిన తరువాత, స్వామి ఆ రూపంలోనే స్వయంభువుగా వెలిశాడని ఈ క్షేత్రం స్థలపురాణం చెబుతోంది.

శ్రీవిల్లిపుత్తూరు మదురై నగరానికి 74 కి.మీ దూరంలో శ్రీవిల్లిపుత్తూరు ఉంది. మదురై, తిరునల్వేలి, విరూద్ నగర్ తదితర ప్రాంతాల నుంచి, ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు శ్రీవిల్లిపుత్తూరుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవిల్లిపుత్తూరుకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. విమానం ద్వారా వచ్చేవారు మదురై వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో రావచ్చు.

Exit mobile version