Home Unknown facts శివుడు లింగరూపంలో కాకుండా వేటగాని రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శివుడు లింగరూపంలో కాకుండా వేటగాని రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం

0

పరమశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శివుడు లింగరూపంలో కాకుండా మానవరూపంలో దర్శనం ఇస్తుంటాడు. ఇలా శివుడు ఒక వేటగాని రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయంగా ఇది. మరి శివుడు ఇలా దర్శనం ఇవ్వడం వెనుక కారణం ఏంటి? ఈ ఆలయంలో నీటి వరద అద్భుతం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Lingam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతికి సుమారు 20 కి.మీ. దూరంలో ఏర్పేడు మండలం లో స్వర్ణముఖి నది తీరాన గుడిమల్లం అనే ఒక గ్రామంలో అతి పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1 లేదా 2 శతాబ్దములలో నిర్మించినట్లుగా ఇక్కడ బయటబడిన శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ ఆలయం చంద్రగిరి రాజుల కాలంలో వైభవంగా విరాజిల్లినది. తరువాతి కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలావరకు ధ్వంసం చేసారు.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, గుడిమల్లం శివాలయంలోని మూర్తి పరశురామేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత కలదు. ఈ ఆలయంలోని గర్భాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగరూపంలో కాకుండా శివుడు మానవరూపంలో కాకుండా శివుడు మానవరూపంలో మహావీరుడైన వేటగానివలె మూర్తీభవించి ఉన్నాడు.

ఈ ఆలయ పురాణానికి వస్తే, పరశురాముడు తన తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించి తిరిగి మళ్ళీ తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు. కానీ తన తల్లిని చంపినా అనే అవమాన భారంతో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని ప్రార్ధించడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన అతడికి ఈ అరణ్య ప్రాంతంలో ఇక్కడ శివలింగం దర్శనం ఇస్తుంది. ఇక ఆ లింగాన్ని ప్రార్ధించి అక్కడే సరోవరం ఏర్పాటు చేసుకొని సరోవరం ఒడ్డున తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఇక ఈ సరస్సులో రోజుకి ఒక పుష్పం మాత్రమే పూస్తూ ఉండేది. పరశురాముడు ఆ పుష్పంతో శివుడికి పూజాసమయంలో సమర్పించేవాడు.

అయితే పరశురాముడు సరోవరంలో పూసే ఆ ఒక్క పువ్వు ని కాపాడటం కోసం ఒక యక్షుని కాపలా ఉంచేవాడు. ఇలా కాపలాగా ఉంటునందుకు పరశురాముడు యక్షునికి రోజు ఒక జంతువును, పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానికి సరే అని యక్షుడు రోజు ఆ పుష్పానికి కాపలాగా ఉండేవాడు. ఇలా ఒకరోజు యక్షుడు బ్రహ్మ దేవుని ఉపాసకుడై పరశురాముడు రాకముందే ఆ పుష్పంతో శివుడిని ఆరాధిస్తాడు. దీంతో కోపానికి గురైన పరశురాముడు అతడితో దాదాపుగా 14 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఇలా ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరిగిన విజయం ఎవరిని వరించదు దీంతో పరమశివుడు ప్రత్యేక్షమై వారిద్దరిని తనలో కలుపుకుంటాడు. అందుకే మనకి శివలింగం పైన గోర్రే, పరుశువు, పానపాత్ర కనిపిస్తాయి.

ఇలా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రదేశంలో యుద్ధం జరగడం వలన ఇక్కడ పల్లం ఏర్పడి ఐదు అడుగుల గుంట ఏర్పడింది. ఇక గుడి పల్లం అని కాలక్రమేణా గుడిమల్లం అని పిలువబడుతున్నదని పురాణం. ఇంకా చిరసేనుడే బ్రహ్మ అని, పరశురాముడు విష్ణువు అని, పైన శివుడు అని భక్తులు భావించి పూజలు చేస్తుంటారు.

ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏంటంటే, ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి వరదలు వచ్చి ఆలయంలోపల మొత్తం నీటితో నిండి పోగా, ఆ వరద నీరు అకస్మాత్తుగా శివలింగాన్ని తాకి క్రిందకు ప్రవహిస్తుంది. ఆ తరువాత భూగర్భ ట్యాంక్ ఎండిపోతుంది. ఇలా ఈ వరద నీరు నాలుగు గంటలు కనబడి మళ్ళీ ఆ తరువాత ఏమి జరగనివిధంగా కనిపిస్తుందని ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసి ఉంది. ఈవిధంగా 2005 లో జరుగగా, ఆ గ్రామంలోని ఒక వృద్ధుడు ఇలానే 1945 లో కూడా జరిగిందని చెప్పాడట.

ఈ శివలింగం ముదురు కాఫీ వర్ణముతో ఉన్న శిల్పంతో చేయబడిన మానుష లింగము. ఈ శివలింగం సుమారు ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగాను శివలింగం బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, యక్షుని భుజాలపై నిలబడిన పరశురాముడు వానిని అణగద్రొక్కుతున్న దృశ్యం అతి సుందరముగా చిత్రించి ఉంది.

ఇంకా ఈ స్వామివారు రెండు చేతులని కలిగి ఉన్నారు. కుడిచేతిలో ఒక జింకపిల్ల యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో నీటికుండ పట్టుకున్నాడు. మల్లయుద్ధ యోధుడిలా శరీరం, ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని, జటలన్నీపైన ముడివేసినట్లుగా తలకట్టుతో, చెవులకి మణికుండలాలు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టు చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లుగా ఉన్న ఆర్దోరుకము అంటే నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండే వస్త్రము ధరించి ఉంది. అంతేకాకుండా ఈ శివలింగం పురుషాంగమును పోలి ఉంది.

ఇలా ఎంతో విశేషం గల ఈ ప్రాచీన శివాలయంలోని ఈ అరుదైన శివలింగాన్ని చూడటానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version