Home Unknown facts శ్రీ కృష్ణుడి తల్లులు గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

శ్రీ కృష్ణుడి తల్లులు గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

0

మాధవుణ్ణి ప్రేమ మూర్తి అని ఊరికే అనలేదు పదహారువేల మందికి పతిదేవునిగా ప్రేమను పంచడమే కాదు, అయిదుగురు తల్లులకు పుత్రునిగా వారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు, ప్రేమానురాగాలు పంచాడు. అదేంటి దేవకి, యశోద కదా కన్నయ్యకు తల్లులు అని అనుకుంటున్నారా.. వీరు కాకుండా మరో ముగ్గురికి మాతృ హోదాను ఇచ్చాడు మాధవుడు. మరి ఆ ఐదుగురు తల్లుల గురించి తెలుసుకుందాం.

Surprising things about the mothers of Sri Krishnaవెన్న దొంగ, కన్నయ్య, రాధాకృష్ణుడు, ఇలా ఏ పేరున పిలిచినా సరే తన ప్రేమసాగరంలో మునిగిపోయేలా చేస్తాడు. చేతిలో వేణువు…తలపై నెమలి ఫించంలో శ్రీ కృష్ణడిని చూస్తుంటే సర్వ కళలు ఆయనలోనే ఉన్నాయని అనిపించక మానదు. నీలమేఘ శ్యాముడు ఈ భూమిపై ఉన్నంత కాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు. అంతే కాకుండా కోరివచ్చిన ప్రతి ఒక్కరి కోరికను తీర్చాడు.

విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీ కృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు. చిన్నతనంలో గోకులంలో చేసిన ఆయన లీలల ద్వారా ఆందరిని ఆకర్షించాడు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి ఇద్దరు తల్లులు ఉన్నారని అందరికి తెలుసు. అయితే వీరిద్దరు కాకుండా మరో ముగ్గురిని కన్నయ్య మాతృసమానులుగా కొలిచేవాడు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యశోద :

దేవికి పుత్రుడు అనేకంటే శ్రీకృష్ణుడు యశోద కొడుకు అంటారు అందరు. కన్నయ్యను కనకపోయిన కంటికి రెప్పలా చూసుకుంది యశోద. నందుడు-యశోద దంపతులు. వీరితో కలిసి శ్రీ కృష్ణుడు గోకులంలో పెరిగాడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేస్తాడు చిన్ని కృష్ణుడు. భాగవతం ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే.. ఎంతో ప్రేమగా చూసుకున్న యశోదకు కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది.

దేవకి :

వసుదేవుని సతీమణి అయిన దేవకి.. శ్రీ కృష్ణుడి నిజమైన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన ఆ కారగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి మాత. దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తే. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలకి సోదరి అష్టమ సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధిస్తాడు. దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా చెబుతారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది. ఈ కారణంగా శ్రీ కృష్ణుడిని దేవకి నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.

రోహిణి :

వసుదేవుడు దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకుంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానం. దేవకి-వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు. రోహిణి తన కుమార్తే, కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు. శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడు, ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగ జాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుని సోదరుడు బాహిలిక కుమార్తే అని కూడా అంటారు.

సుముఖి దేవి :

సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడు, బలరాముడు, సుదాముడు.. సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖి దేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది. ఎందుకంటే ఆమె శంఖాసురుడి అధీనంలో ఉంటుంది. మాధవుడు ఆమెను అతడి చెర నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది. అనంతరం గురమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవదని చెప్పింది. అందుకే కృష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది.

పూతన :

శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది. తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని చిన్ని కృష్ణుడిని చంపాలని చూస్తుంది. అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించే పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు. పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన వాతవరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అయిదుగురు తల్లులకు పుత్రుడు అయ్యాడు.

 

Exit mobile version