పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా చిక్కుకున్నాడు?

శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. ఇది వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ‘చక్రవ్యూహం’ అని కూడా వ్యవహరిస్తారు. అసలు ఏంటీ పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు?

Surprising things behind Padmavyuhయుద్ధవ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం, చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే, సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. దాంతో పద్మవ్యూహం లోపలి వెళ్లడమే తప్ప బయటికి రావడం తెలుసుకోలేకపోయాడు అభిమన్యుడు.

Surprising things behind Padmavyuhఅసలు అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై రెండు రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి ‘నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను. అది దేవతలు కూడా భేదించలేనిది. మహావీరుడైతే తప్ప దాన్ని భేదించటానికి ప్రయత్నించలేడు’ అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం.

Surprising things behind Padmavyuh‘పద్మవ్యూహం’ రహస్యం:

కౌరవ సేనలను తామరపువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, వారి మధ్య దుర్యోధనుడూ ససైన్యంగా నిలిచారు. సైంధవుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు, వారి కుమారులూ తమ స్థానాల్లో నిలిచారు. మహా వీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు. (ఆ రోజు అర్జునుడిని సంశప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుపోయారు)

Surprising things behind Padmavyuhఇక దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజు అభిమన్యుడుని పంపక తప్పలేదు. ‘కుమార అభిమన్యా..! ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకూ, నీ తండ్రి అర్జునుడూ, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడుకి మాత్రమే తెలుసు. అర్జునుడు లేని ఈ సమయంలో ఆ పద్మ వ్యూహాన్ని నీవే ఛేదించాలి అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో ‘నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించడం వరకూ చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను’ అన్నాడు. ‘ఆ మాత్రం చాలు కుమారా! నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే, నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం’ అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా ‘కుమారా! నువ్వు వూహ్యాన్ని ఛేదిస్తే చాలు. నీ వెంటనే నేనూ, దృష్టద్యుమ్నుడూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టుపెడతాం’ అని భరోసా ఇచ్చాడు. అభిమన్యుడు వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏ మాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు.

Surprising things behind Padmavyuhమెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలు పెట్టాడు. అతడి ధాటికి కురు సేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లా చెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛిల్లపోయేలా చేశాడు. శల్యుణ్ణీ, దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది జయద్రధుడు (సైంధవుడు) అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడినీ, కోసల దేశాధీశుడైన బృహద్బలుణ్ణీ సంహరించాడు. యోధులపరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు.

Surprising things behind Padmavyuhఅలా యుద్ధంలో వీర విహారం చేస్తున్నఅభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా, కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణీ, విరథుణ్ణీ చేసి బాణాల వర్షం కురపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టి ఆ ఆయుధాన్నీ ముక్కలు చేయగా, గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లైంది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. ఇప్పటికీ వీరుడి గురించి చెప్పే సందర్భం వస్తే అభిమన్యుడినే ఉదాహరణగా చెబుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR