మహాశివుడు కొండపైన కొలువై ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో పవిత్ర జలాశయం ఉన్నది. అయితే ఈ పవిత్ర జలాశయం లోని నీరు ఎల్లప్పుడు నిండుగా ఉండటం విశేషం. మరి కొండపైన వెలసిన ఆ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సింగుపురంలో ని సింధూర కొండపై శ్రీ ఉమహాటకేశ్వరస్వామివారి దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన గుహాలయం. ఇక్కడ ఉన్న శాసనాలను బట్టి ఈ ఆలయం 11 వ శతాబ్దంలో నిర్మించారని తెలియుచున్నది. ఇక్కడ బంగారానికి హాటక అనే పేరు కలదు. హాటక వరమును ప్రసాదించిన శివుడిని హటకేశ్వరస్వామి అని అమ్మవారిని ఉమా అని ఆలా ఈ క్షేత్రాన్ని శ్రీ ఉమహాటకేశ్వరస్వామి దేవాలయంగా ప్రసిద్ధ్ది చెందింది.
పురాణానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో పరమ శివభక్తుడు అయినా నారాయణప్ప అనే బ్రాహ్మణుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేయగా శివుడు ప్రత్యేక్షమై స్వర్ణయోగము అనే బంగారమును తయారుచేసే విద్యని బోధించి ఆలయాన్ని పురుద్దరించి తనని ప్రతిష్టించి ఆరాధించి మోక్షం పొందమని చెప్పగా, ఆవిధంగా క్రీ.శ. 11 – 12 శతాబ్దాల మధ్య కాలంలో ఈ ఆలయం పునః ప్రతిష్టించబడినది.
ఇక ఈ ఆలయంలో ఇంకో పురాణం ఉంది, కరజాడ గ్రామానికి చెందిన కొండమ్మ అనే వైశ్య బాలిక ఇచట దేవి అనుగ్రహంతో జన్మించిందని, ఆమె తన పెళ్లి సమయంలో జ్యోతిగా మారి ఉమాదేవిలో ఐక్యం చెందినది అని పురాణం. అందుకే ఈ స్వామిని కొంతమంది ఉమా కొండమ్మ హటకేశ్వరస్వామి అని పిలుస్తారు.
ఇది వెలసిన ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొమ్మిది రోజుల పాటు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక విజయదశమి, శివరాత్రి వంటి పర్వదినాల్లో స్వామి పుష్పకము నందు గిరిజ కొండమ్మలతో కలసి గ్రామా పురవీధులలో ఉరేగును. ఈ సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శిస్తారు.