Let’s Take A Look At Few Catchy One-Liners of Our Heroines From 11 Noted Movies

Contributed by Boddula Rakesh

సినీ పరిశ్రమలో నటులు ఎవరైనా తమకంటూ ఓ గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మెప్పు పొందితే చాలని భావిస్తారు. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి ప్రయత్నాల్లో మన నటీనటుల మేనరిజమ్స్ కి అనుగుణంగా చెప్పే క్రేజీ డైలాగ్స్ కూడా ఒకటిగా చెప్పొచ్చు. మరి అందుకు తగ్గట్లుగానే మన హీరోలు సైతం అలాంటి క్రేజీ పంచ్ డైలాగ్స్ విసురుతూ మరింత ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. అవి చాలాసార్లు సినిమాకే హైప్ తెచ్చిపెడతాయి. దర్శకులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మన అభిమాన హీరోలతో అలాంటి డైలాగ్స్ చెప్పిస్తుంటారు. హీరోలే కాదండోయ్.. ఇప్పుడు హీరోయిన్లు, కమెడియన్లు సైతం ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. చేసే పాత్ర చిన్నదైనా.. పెద్దదైనా సరే.. క్రేజీ డైలాగ్స్ చెప్పి మనల్ని అలరిస్తున్నారు. అంతేనా.. అక్కడితో ఆగిందా..? సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సందర్భానుసారం ఆ డైలాగులు చెప్పుకుని మురిసిపోయేలా తయారైంది ఇప్పుడు పరిస్థితి. అలా చూస్తే ముఖ్యంగా ఇప్పటి దర్శకులు తెలుగు సినిమా హీరోయిన్ల పాత్రల పేర్లతో.. పాత్ర స్వభావాన్ని తెలిపేలా వారితో డైలాగ్స్ చెప్పించి క్రేజీ పుట్టిస్తున్నారు. ఫలానా సినిమాలో చేసిన హీరోయిన్ ఎవరంటే.. రియల్ నేమ్స్ మర్చిపోయి రీల్ నేమ్ గుర్తు పెట్టుకునేలా మారిపోయింది. అలా తెలుగులో డైలాగ్స్ తో కేక పుట్టించి మనకు గుర్తుండిపోయిన కొందరు హీరోయిన్స్ గురించి తెలుసుకుందామా.. పదండి..!

1) సదాఫ్

Sadha‘జయం’ సినిమా అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది ‘వెళ్లవయ్యా.. వెళ్ళు వెళ్ళు..’ అంటూ సదా చెప్పే డైలాగ్. ఇదే డైలాగ్ సినిమా పాటలో కూడా వాడారంటే ఇక చెప్పక్కర్లేదు అనుకుంటా ఆ డైలాగ్ స్టామినా. ఈ సినిమాలో ముఖ్యంగా ఈ డైలాగ్ సదాకు ఎక్కడ లేని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అచ్చమైన తెలుగమ్మాయిలా, అమాయకంగా ఈ డైలాగ్ చెప్తుంటే ఎవరైనా సదాకి ఫిదా అవాల్సిందే.

2) రెజీనా కాసాండ్రా

Razinaతెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ.. నేనున్నా అంటూ గుర్తు చేస్తుంటుంది రెజీనా. కానీ రెజీనా అనగానే మనకు గుర్తు వచ్చేది మాత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో తను చేసిన సీత క్యారెక్టర్. ‘సీతతో అంత ఈజీ కాదు’ అంటూ పాత్ర స్వభావాన్ని ఉట్టిపడేలా దర్శకుడు ఈ డైలాగ్ చెప్పించాడు. ఒకవైపు కామెడీ పండిస్తూనే.. అచ్చ తెలుగు అమాయకపు సీత పాత్రలో రెజీనా మనకు దగ్గరైంది.

3) సాయిపల్లవి

Sai Palavi‘ఫిదా’ విడుదలకు ముందు మళయాళం సినిమా ‘ప్రేమమ్’ చూసిన వాళ్ళకు సాయిపల్లవి మలర్ గా తెలుసు. కానీ ఎప్పుడైతే తెలుగు సినిమా ‘ఫిదా’తో ఇక్కడ అడుగుపెట్టిందో అప్పటి నుండి మన పక్కింటి అమ్మాయి భానుమతి అయిపోయింది. సినిమాలో భానుమతి చెప్పిన డైలాగ్ గుర్తు ఉందా.. ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల..’ అంటూ కుర్రకారు గుండెల్లో చిచ్చుపెట్టేసింది. తెలంగాణ యాసలో అధ్బుతంగా డైలాగ్స్ చెప్పి అదరగొట్టి ‘ఫిదా’ సక్సెస్ కి ఒక కారణమయింది.

4) తమన్నా భాటియా

Thamana‘హ్యాపీడేస్’తో శుభారంభం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ‘100% లవ్’ సినిమాతో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ అనిపించుకుంది. సినిమాలో దట్ ఈజ్ మహాలక్ష్మి అంటూ తమన్నా డైలాగ్ చెప్తుంటే ఆ పేరు పెట్టుకున్న అమ్మాయి అది నేనే అని ఫీల్ అయ్యేంతగా నటించి అలరించింది. ఇంకా చెప్పాలంటే ఇదే డైలాగ్ తో ఇప్పుడు తమన్నా సినిమా కూడా చేస్తుందంటే తనకి ఆ పాత్ర ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

5) ఛార్మి కౌర్

Charmi‘పద్దు.. శివంగి.. ఆడపులి’ అంటూ ఛార్మి ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తన మేనరిజం డైలాగ్ తో ఆకట్టుకుంది. క్లాస్ అమ్మాయి.. మాస్ డైలాగ్ చెప్తుంటే థియేటర్లో ఈలలు, గోలలు. కొత్త హీరోయిన్ భలే చేసిందిరా.. అనుకోని వాళ్ళు ఉండరు ఆ టైంలో. ఈ సినిమా తర్వాత ఛార్మి వరుస ఆఫర్లతో బిజీ అయిపోయి స్టార్ హీరోల సరసన నటించి అగ్రతారగా వెలిగింది.

6) శ్వేత బసు ప్రసాద్

Swetha basu Prasad‘కొత్త బంగారు లోకం’ సినిమాలో పెద్ద కళ్ళు, పొడుగు జడతో తెలుగు తెరకు పరిచయమయింది శ్వేత బసు ప్రసాద్. ఈ సినిమాలో హీరోయిన్ కి ఓ క్రేజీ డైలాగ్ ఉంటుంది. ‘ఏక్క..డా.. ఏప్పు..డూ’ అంటూ సాగదీసి పలికే విధానం మనల్ని ఎంతో ఆకట్టుకుంది. సినిమా చూసినంత సేపు హీరోయిన్ క్యారెక్టర్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ‘కొత్త బంగారు లోకం’సినిమాను ఇష్టపడిన ఎవరైనా శ్వేత బసుని అంత ఈజీగా మర్చిపోగలరా..?

7) కాజల్ అగర్వాల్

Kajalదర్శకుడు తేజ సినిమాలో హీరోయిన్లది ప్రత్యేక స్థానం. అలాంటి దర్శకుడు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే.. అందులో కాజల్ హీరోయిన్ అయితే.. అది ‘సీత’ సినిమాలా ఉంటుంది. సీత క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు అన్నట్లు కాజల్ ఆ పాత్ర చేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో కాజల్ తో ‘సీత.. నేను గీసిందే గీత’ అనే ఒక్క డైలాగ్ ద్వారా ఆ పాత్ర ఎలాంటిదో మనకు తెలిసేలా చేశారు.

8) నభా నటేశ్

Naba Natesh

‘సిరి.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్’ అంటూ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో నభా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన చిలిపితనంతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ గొప్పగా ఫీలవుతూ పేరు చెప్పిన ప్రతిసారి సాఫ్ట్ వేర్ అని చెప్పడం తన క్యారెక్టర్ లో ఉన్న అమాయకత్వాన్ని చూపించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా నభా మాత్రం ‘ఇస్మార్ట్’గా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది.

9) పూజా హెగ్డే

Pooja Hegde‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజ వచ్చిన తక్కువ సమయంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా జూ.ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’లో. ఈ సినిమాలో ‘కొంచెం జరగరా..నాకు స్పేస్ కావాలి’ అని పదేపదే చెప్పించారు పూజతో త్రివిక్రమ్ గారు. మామూలుగానే ఆయన సినిమాల్లో అదిరిపోయే డైలాగ్స్ ఉంటాయి.. ఇక ఇలాంటి మేనరిజమ్స్ డైలాగ్స్ కి తక్కువేం ఉంటుంది చెప్పండి.

10) మెహరీన్ పిర్జాదా

Meharinక్యూట్ హీరోయిన్ మెహరీన్ నేచురల్ స్టార్ నానితో ‘నేను చెప్పానా.. నీకు చెప్పానా’ అని తన మొదటి సినిమాలోనే అనేసింది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో.. మేనరిజమ్స్ డైలాగ్స్ తో మనకు తెగ నచ్చేసింది. ‘నీకు చెప్పనా.. చెప్పానా..’ అంటూనే అడగకుండానే మళ్ళీ మళ్ళీ చెప్పింది. ఇక మరో సినిమా ‘ఎఫ్-2’లో కూడా అదే ఫార్మూలాలో వెళ్ళింది. ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అని అందంగా చెప్పుకుంటూ నిజంగానే ‘మెహరీన్ ఈజ్ ద బెస్ట్’ అనిపించుకుంది.

11) రకుల్ ప్రీత్ సింగ్

Rakulరకుల్.. హీరో సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మనకు బాగా దగ్గరయింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ బడా హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో రకుల్ పాత్ర పేరు ప్రార్థన. తనని మోసం చేయడం అంత ఈజీ కాదు అని చెబూతూ ‘ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అని కౌంటర్లు వేసింది హీరో మీద. ఆ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మనల్ని అలరించి మన ఫేవరెట్ అయిపోయింది రకుల్.

ఇవండీ.. మన హీరోయిన్ల మేనరిజమ్ డైలాగ్స్.. పాత, కొత్త కలిపి ఇలా క్రేజీ డైలాగ్స్ చెప్పిన హీరోయిన్లు ఇంకా చాలా మందే ఉన్నారు. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో మనల్ని అలరించిన మన హీరోయిన్లు అప్పుడప్పుడూ ఇలా కొంచెం తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. పొరపాటున ఎవరినైనా మిస్ చేసి ఉంటే క్షమించేయండే మరి.. ఉంటాను.. బై..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR