Home Unknown facts గ్రహపీడలు తొలగించే తమిళనాడులోని నవగ్రహదేవాలయాల గురించి తెలుసా?

గ్రహపీడలు తొలగించే తమిళనాడులోని నవగ్రహదేవాలయాల గురించి తెలుసా?

0

గ్రహాలు మొత్తం తొమ్మిది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహ‌స్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు. అయితే కుజ దోషం, శుక్ర గ్రహ దోషం, రాహు దోషం ఇలా ఇలా సర్వగ్రహరిష్టాలు తొలగి పోవడానికి తమిళనాడులో కుంభకోణం చుట్టూ నవగ్రహదేవాలయాలు అనేవి ఉన్నాయి. మరి ఆ నవగ్రహదేవాలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నవి? ఏ ఆలయం ఏ గ్రహానికి సంబందించిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యదేవాలయం: 

navaghraha templesతమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 కి.మీ. దూరంలో గల తిరుమంగళం కుడి అను ప్రాంతంలో సూర్యనార్ కోయిల్ గా పిలువబడే సూర్యదేవాలయం ఉంది. పురాణం ప్రకారం బ్రహ్మ ఒకసారి నవగ్రహాలకి కుష్టురోగం వస్తుందని శపించాడు. అప్పుడు శాపవిమోచనం కోసం ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ పూజలు చేసిన శాపవిమోచనం పొందారని, అప్పటి నుండి ఇది నవగ్రహ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ ఆలయంలో పూజ చాలా నిష్ఠగా ఉంటుంది. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చెయ్యవలసి ఉంటుంది. ఈ నవగ్రహ దేవాలయాల ప్రదక్షిణను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ప్రధాన మూర్తి సూర్యభగవానుడు.

చంద్ర దేవాలయం:

తమిళనాడు రాష్ట్రం, తిరువైయార్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో చంద్రదేవాలయం  ఉంది. ఈ స్వామివారిని దర్శిస్తే దీర్ఘాయుష్షును, సుఖాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో వచ్చే పురట్టాసి, మార్చి – ఏప్రిల్ లో వచ్చే ఫల్గుణి నక్షత్ర సమయంలో చంద్ర కాంతి అనేది ఈ ఆలయంలోని శివలింగం పైన పడుతుంది.

అంగారక దేవాలయం: 

తమిళనాడు రాష్ట్రంలోని, నాగపట్నం జిల్లాలో, వైదీశ్వరన్ కోయిల్ అనే రైల్వేస్తైషన్ కు సమీపంలో వైదీశ్వరన్ ఆలయం ఉంది. పూర్వము ఒక ముని తనకు పెద్ద జబ్బు చేయగా,పరమేశ్వరుని గూర్చి భక్తితో తపస్సు చేయగా,శంకరుడు ఒక వైద్యుని రూపములో ప్రత్యక్షమై,అతని జబ్బు నయం చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అందువల్ల ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసిన ఈ వైదీశ్వరుని ఆలయానికి వచ్చి మ్రొక్కుకుంటారు. శ్రీరాముడు జటాయువు ఇచ్చటనే దహన సంస్కారాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే నవగ్రహ దేవతామూర్తులైన బుధుడు, కేతువుకు ఇచట విడివిడిగా ఆలయాలు కన్పించుట ఒక విశేషంగా చెబుతారు.

బుధాలయం: 

అంగారక ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుధాలయం ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని స్వేతారన్యేశ్వరుడని, అమ్మవారిని బ్రహ్మ విద్యాంబికా దేవి అని కొలుస్తారు. ఈ ఆలయం 3000 ఏళ్ళ నాటిదిగా చెబుతారు.

బృహస్పతి ఆలయం: 

కుంభకోణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బృహస్పతి ఆలయం ఉంది. ఇక్కడి శివలింగం స్వయంభువు అని చెబుతారు. పార్వతీదేవి ఇక్కడే శివుడిలో ఐక్యమైందని స్థల పురాణం.

శుక్రదేవాలయం:

తమిళనాడు లోని సూర్యదేవాలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే శుక్రదేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మ శివ పార్వతుల వివాహాన్ని దర్శించాడని పురాణం.

శని దేవాలయం: 

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే నలమహారాజుకు శని పట్టుకొని పీడించడం ప్రారంభించాడని పురాణం. ఇక్కడకి నల తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో వెలసిన స్వామివారి పేరు దర్బరణ్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయంలో గరిక మొక్కని అతి పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్బాధిపతి అని కూడా అంటారు. ఇక్కడ దేవాలయాన్ని దర్శించినప్పుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలోని శనీశ్వరుడికి బంగారు కాకి వాహనంగా ఉంది. అయితే ప్రత్యేకంగా శనివారం నాడు మరియు ఉత్సవాల సందర్భంగా మూలా విగ్రహానికి బంగారు కవచం తొడుగుతారు. శనిదేవుకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి శనిపీయేర్చి అనే ఉత్సవం జరుగుతుంది.

రాహు దేవాలయం:

తమిళనాడు రాష్ట్రం, కుంభకోణానికి 5 కి.మీ. దూరంలో తిరునాగేశ్వరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో అతి పురాతనమైన రాహుగ్రహ ఆలయం ఉంది. భారతదేశంలో రాహుగ్రహ మూర్తి కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన అతి పెద్ద ఆలయం ఇది ఒక్కటే అని చెబుతారు.  ఈ ఆలయంలో రాహుగ్రహ దోష నివారణకై ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం వద్దే వెండితో చేసిన నాగపడగలు అమ్ముతారు. నిత్యం వచ్చే రాహుకాల సమయంలో రాహువుకు క్షిరాభిషేకం చేయిస్తుంటారు. భక్తులు ఇచట ఒక మహిమగా చెప్పుకునే విశేషం ఏంటంటే రాహుకాల సమయంలో మాత్రమే క్షిరాభిషేకం జరిపినప్పుడు రాహువు శిరస్సు పై నుండి పాలు పోస్తే శిరస్సు దాటి కంఠ భాగం చేరేసరికి ఆ పాలు నీలం రంగులోకి మారిపోతాయి. మిగిలిన సమయాలలో ఆలా జరుగదు. అందువలన నిత్యం రాహుకాల సమయంలో క్షిరాభిషేకం జరిపించుటకు భక్తులు కుతూహుల పడతారు.

కేతు దేవాలయం: 

తిరువెన్నాడు నుండి కొంత దూరంలో కేజ్ పేరంపాలెం అనే గ్రామంలో కేతు గ్రహ ఆలయం ఉంది. కేతు గ్రహానికి ఇలా ప్రత్యేకంగా నిర్మించిన ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడ రాహు కేతువులు జంటగా సర్పాకారంలో కలసి ఉండి, క్షిరసాగరమధనంలో శివునికి సహాయం చేసారని ప్రతీతి. ఇలా కేతు గ్రహానికి అంకితమైన ఈ ఆలయంలో కేతు గ్రహ దోష నివారణకై ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ ఆలయ వద్ద పూజ సామాగ్రి లో భాగంగా ఒక ప్లేటులో 7 దీపాలు వెలిగించడానికి వీలుగా 7 ప్రమిధులను అమర్చి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కేతు గ్రహానికి దానంగా ఉలువలను సమర్పించి, ఏడు దీపాలను వెలిగించి పూజిస్తారు.

Exit mobile version