ఉలి చెక్కని విగ్రహంతో తెలంగాణ చిన్న తిరుపతి ఆలయం

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కలిపాపాల నుండి మనుషులని కాపాడేందుకు ఏడుకొండలపై కొలువుదీరాడు. అలాగే ఏడుకొండలు ఎక్కి ఆ శ్రీనివాసుని దర్శించుకోలేని భక్తుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి మన్యంకొండ. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరారు.

Telangana Tirupathi Manyam kondaఈ మన్యంకొండను భక్తులు ‘పేదల తిరుపతి’ అని, ‘రెండవ తిరుపతి’ అని, ‘తెలంగాణ తిరుపతి’ అని, ‘చిన్న తిరుపతి’ అని, ‘పాలమూరు తిరుపతి’ అని పిలుస్తుంటారు. ఈ క్షేత్రం మహబూబ్ నగర్ కు 17 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ – రాయచూర్ వెళ్లే మార్గంలో ఉంది. సిద్దులు, మునీశ్వరులు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని అందుకే అప్పట్లో దీనిని ‘మునుల కొండ’ అని పిలిచారని, ఆతర్వాత అరణ్యప్రాంతంలో ఉండటంతో ‘మన్యంకొండ’ గా పేరు నిలిచిపోయిందని ఇక్కడివారు చెబుతారు.

Telangana Tirupathi Manyam kondaకొలిచిన వారికి కొంగుబంగారంగా విలసిల్లుతోన్న ఈ మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే, తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. దిగువ కొండ వద్ద అలివేలు మంగతాయారును దర్శించుకోవచ్చు. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం ఈ ఆలయంలోని ప్రత్యేకతలు. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి రెండు చరిత్రలు ఉన్నాయి.

Telangana Tirupathi Manyam kondaఅందులో మొదటిది. దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడు శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో వేంకటేశ్వరుడు కనిపించి, కృష్ణానదీ తీరంలో గల మన్యంకొండపై వెలిసి ఉన్నానని, నీవు వెంటనే అక్కడికెళ్లి నిత్య సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించాడట. వెంటనే అళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోటకదిరిలో నివాసం ఏర్పరుచుకున్నాడు. అక్కడి నుంచి గుట్టపైకి వెళ్లి దేవుడికి సేవ చేయడం ప్రారంభించాడు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలిలో అర్ఘం వదులుతుండగా, చెక్కని శిలారూపంలోగల వేంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి, మన్యం కొండపై శేషసాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి, నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు.

Telangana Tirupathi Manyam kondaరెండవది ఒక ముసలావిడ తరచూ శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లివచ్చేది. ఓసారి తిరుపతి వెళ్లివస్తుండగా అలసిపోయిన ఆ ముసలావిడ – స్వామీ! నీ దర్శనం కోసం ఇంతదూరం రాలేకపోతున్నాము, మాకు చేరువలో ఎక్కడైనా దర్శనం ఇవ్వాలని ప్రార్థించగా, మన్యంకొండ లో నేను స్వయంభూవుగా వెలిశానని, అక్కడికి వెళ్లి నా దర్శనం చేసుకో అని శ్రీవారు చెప్పారని అక్కడి స్థానికుల కథనం.

Telangana Tirupathi Manyam kondaఇక్కడ ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చి పులుసు చేసి, వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదించడం సంప్రదాయంగా వస్తోంది. అళహరి వంశానికి చెందిన హనుమద్దాసులు స్వామికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు.

Telangana Tirupathi Manyam kondaమన్యంకొండ క్షేత్రం అచ్చం తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పోలి ఉంటుంది. కొండ చిన్నదైనప్పటికీ ఒకవైపు మెట్ల మార్గం, మరోవైపు ఘాట్ రోడ్డు మార్గం ఉన్నాయి. ఏడు ద్వారాలు దాటి వెంకటేశ్వరున్ని ఎలా దర్శించుకుంటున్నామో, అలాగే మన్యంకొండ లో కూడా ఏడు ద్వారాలు దాటి కొండగుహలో ఆదిశేషుని పడగనీడలో శ్రీ లక్ష్మి సమేతుడైన శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. తిరుమల లాగే భక్తులు తలనీలాలను చెల్లిస్తుంటారు.

Telangana Tirupathi Manyam kondaమన్యం కొండ దిగువ కొండ వద్ద ఉన్న అలమేలు మంగతాయారు దేవస్థానానికి 58 ఏళ్ల చరిత్ర ఉంది. అళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి, అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువ కొండ వద్ద నిర్మించాలని సూచించారట. దీంతో 1957– 58 సంవత్సరంలో అమ్మవారి విగ్రహాని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే , నిత్యసుమంగళత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని ప్రజల విశ్వాసం. అందుకే పెళ్లి కావాల్సినవాళ్లు, సంతానం లేనివారు అమ్మవారి సన్నిధిలో ముడుపులు కడుతుంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR