దేనినైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇలా ఎన్నో. మన తాతలు, ముత్తాతలూ ఫాలో అయిన సాంప్రదాయాల్లో కొన్నింటిని మనమూ పాటిస్తూ ఉంటాం. కొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటాయి. కాలగమనంలో ఎన్నో వింతలు, విచిత్రాలూ మన జీవితంలో భాగమవుతాయి. వాటిని ఫాలో అయ్యేవారున్నట్లే, వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు. కొందరు వాటిని పిచ్చి నమ్మకాలు అంటే కొందరు వాటిని పాటించకపోతే ప్రమాదమే అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతులకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. అయితే ఒక్కో జాతికి చెందిన ప్రజలు ఒక్కోరకమైన ఆచారవ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అవే ఆచారాలను కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని రకాల జాతులకు చెందిన వారు చేసే పూజలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ఇటువంటి వింత ఆచారం ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం పాటిస్తూ ఉంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ వేడుకలో ఊరంతా బంధనం చేసి ఆ గ్రామంలో అమ్మవారికి చేసే పూజ పూర్తయ్యేవరకు గ్రామస్తులు ఎవరూ కూడా పాచి పని చేయరు. ఈ వింత ఆచారం గురించి పూర్తిగా తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో ఉంది ఈ వింత ఆచారం. ఈ గ్రామంలోని ప్రజలు ఒక వింత ఆచారాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాటిస్తూ ఉంటారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ బోనాల వేడుకలో ఆ ఊరికి మొత్తం బంధనం చేసి ఉంచుతారు.ఈ సాంప్రదాయాన్ని పాటించే విషయంలో ఆ గ్రామం మొత్తం ఎంతో ఐక్యమత్యంతో ఉంటారు. తెల్లవారుజాము నుంచి ఈ వింత పూజలు ఆ గ్రామంలో ప్రారంభిస్తారు. ఈ పూజలు పూర్తి అయ్యేంత వరకూ గ్రామస్తులెవ్వరూ పాచి ముఖం కూడా కడగరు.వాకిళ్లు ఊడవరు. కళ్లాపి చల్లరు ఈ గ్రామంలోని ఈ ఆచారం పూర్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.
సుగ్లాంపల్లి గ్రామంలో ప్రతి ఐదేళ్లకి ఒకసారి గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి ఈ విధమైన ఆచారంతో పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించి గ్రామం మొత్తం సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి ఈ వేడుకను నిర్వహిస్తారు. ఆ రోజు తెల్లవారిజాము నుంచి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.పూజారులు అమ్మవారికి గొఱ్ఱపిల్లను ఇచ్చి రక్తతర్పణం చేస్తారు. అయితే ఈ పూజా కార్యక్రమం ముగిసేవరకు ఆ ఊరు మొత్తం ఇల్లు కడగరు, వాకిలి ఊడవరు అదేవిధంగా ఆ గ్రామస్తులు ఎవరు పాచి ముఖం కూడా కడగరు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా ఈ వింత ఆచారం ఇప్పటికీ ఆ గ్రామస్తులు నిర్వహిస్తారు.
అయితే ఈ పూజా కార్యక్రమం ముగిసేవరకు ముందు రోజు నుంచి ఆ గ్రామంలోకి ఇతరులని అనుమతించరు. అదేవిధంగా ఆ గ్రామంలోని వారు ఎలాంటి పరిస్థితులలో కూడా బయటకు వెళ్లరు. కరోనా సమయంలో కూడా కరోనా జాగ్రత్తలను పాటిస్తూ ఈ గ్రామస్తులు అమ్మవారికి ఈ జాతర చేయడం పట్ల వారు వారి ఆచార వ్యవహారాలకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థమవుతుంది.