పెద్దగా వర్షం పడుతున్నప్పుడు, ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు చిన్నపిల్లల దగ్గరినుండి పెద్దవారి వరకు భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో పెద్దవారు వారు ఉంటే అర్జున… ఫల్గుణ… అనుకోమని చెబుతూ ఉంటారు. దానికి అర్ధం తెలియక పోయినా పెద్దవారు చెప్పారు కాబట్టి పాటిస్తూ ఉంటాం. అయితే అలా అనుకోవడం వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం…
మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే ‘అర్జున ఫల్గున పార్థ కిరీటి…’ అనే అర్జునుడి పది పేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా. అది ఒక నమ్మకం, ఈ తరానికి తెలియని విషయం.
పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు కౌరవులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. జమ్మిచెట్టు మీది బాణాలు తీసేటప్పుడు తాను అర్జునుణ్ననే నమ్మకం ఉత్తర కుమారుడికి కలిగించే ప్రయత్నంలో అతడు పాండవ మధ్యముడి పది పేర్లు చెప్పమంటే అర్జునుడే స్వయంగా తన పది పేర్లు చెప్పుకున్నాడు. అంతేకాదు- ఆ పేర్ల సార్థక్యాన్నీ వివరించాడు.
అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు- అనేవి ఆ పది పేర్లు.
అర్జున అంటే తెల్లని వర్ణమని అర్థం. అర్జునుడు తెల్లగా ఉంటాడు. అది నిర్మల వర్ణం. మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, తాను పరిశుద్ధమైన పని చేస్తానని, అందుకే తనను అర్జునుడంటారని భారతంలో అతడు ఉత్తరుడితో చెబుతాడు.
అర్జునుడు ఉత్తర ఫల్గునీ విశేషకాలంలో అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడంవల్ల ఫల్గునుడయ్యాడు.
కుంతీదేవికి పృథ అనే పేరుంది. ఆమె కొడుకుల్లో చివరివాడైన అర్జునుడికి పార్థుడనే పేరు వచ్చింది.
ఇంద్రుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరం. అందుకే అర్జునుడు కిరీటి.
యుద్ధరంగంలో అర్జునుడు ఎప్పుడూ తన రథానికి నియమంగా తెల్లటి గుర్రాలనే కడతాడు గనుక శ్వేతవాహనుడని పేరు వచ్చింది.
అర్జునుణ్ని బీభత్సుడంటారు. బీభత్సమంటే- చూసేవారికి ఒళ్లు జలదరించేలా చేసే స్థితి. యుద్ధరంగంలో అర్జునుడు శత్రువుల్ని చీల్చిచెండాడినప్పుడు అటువంటి దృశ్యాలను సృష్టిస్తాడు కనుక బీభత్సుడయ్యాడు.
ఎంతటి బలవంతులు తనను ఎదిరించినా, యుద్ధంలో జయాన్ని సాధించగలడు. అందుకే అందరూ అర్జునుణ్ని విజయుడంటారు.
తాను చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు గనుక తాను జిష్ణుడనని అర్జునుడు చెప్పాడు.
యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని లాగగలడు. కానీ ఆ లాగడంలో ఎడమచేతి వాటం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సవ్యసాచిగా అర్జునుడు ప్రసిద్ధుడయ్యాడు.
భూమినంతటినీ జయించి పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందడంవల్ల ధనంజయుడయ్యాడు.
ఖాండవ వన దహన సమయంలో శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై అర్జునుడికి ‘కృష్ణుడు’ అనే నామధేయాన్ని ప్రసాదించి దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడికి పదకొండు పేర్లయినా పది పేర్లే ప్రసిద్ధం. వీటిలో మహాభారతంలోనూ భారత సంబంధమైన కావ్య నాటకాదుల్లోనూ- ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, సవ్యసాచి, ధనంజయుడు అనే పేర్లు ఎక్కువగా ప్రశస్తమయ్యాయి.