విష్ణు మూర్తి శపించడం వల్ల బ్రహ్మ ని ఎవరూ పూజించరు అనేది పురాణాతిహాసం. అందుకే బ్రహ్మ దేవుడికి ఎక్కువగా ఆలయాలు ఉండవు. మనదేశంలోని అరుదైన మూడు బ్రహ్మ దేవాలయాల్లో ఒకటి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా, పుష్కర్ అనే ఊరులో ఉంది. ఇక్కడ పుష్కర నది ఒడ్డున బ్రహ్మ దేవాలయం ఉంది. ఉత్తర భారత దేశంలో ఉన్న అయిదు పవిత్ర ధామములలో ఇది ఒకటి.
ఈ నగర నిర్మాణం ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం ఈ నగరం యొక్క రూప కర్త బ్రహ్మ దేవుడని తెలుస్తుంది. బ్రహ్మ దేవుడు విష్ణు మూర్తి గురించి అరవై వేల సంవత్సరాలు యజ్ఞం చేసాడని ప్రతీతి. ద్వాపరయుగంలో వజ్రనాభుడు అనే రాక్షసుడిని వధించటానికి బ్రహ్మ తన ఆయుధమైన తామర పుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకులు భూమి మీద పడ్డాయట. ఆ రేకులు పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెపుతారు. ఈ ప్రాంతంలోనే బ్రహ్మ యజ్ఞం చేసాడని అందుకే ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యత వచ్చింది అని చెపుతారు. ఈ ఆలయం రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెపుతుంది.
ఈ గుడి క్రి.శ 14 వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ గాయత్రి, సరస్వతి లతో చతుర్ముఖ బ్రహ్మ దేవుడు నయనానందకరంగా ఉంటాడు. అయితే ఈ ఆలయ గర్భ గుడిలోకి వివాహితులైన పరుషులకు ప్రవేశం లేదు. బ్రహ్మ దేవుడు పుష్కర సరస్సు దగ్గర యజ్ఞం చేయాలని తలపెట్టగా… సరస్వతీ దేవీ ఆలస్యంగా వచ్చిందట.
దీంతో బ్రహ్మ గాయత్రి దేవిని పెళ్లాడి క్రతువు పూర్తి చేశాడట. ఈ విషయం తెలిసిన సరస్వతీ దేవి.. ఆగ్రహోదగ్రురాలై పెళ్లయిన పురుషులు గర్భాలయంలోకి ప్రవేశించొద్దని శపించింది. ఒకవేళ ప్రవేశిస్తే.. వివాహ జీవితంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది. అందుకే ఈ ఆలయంలోకి పురుషులు వెళ్లరు.