Home People The Inspiring Story Of Malavika Hedge & How She Fought Against All...

The Inspiring Story Of Malavika Hedge & How She Fought Against All Odds To Bring Back The Glory Of CCD

0
మాళవిక హెగ్డే.. ఈమె ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వాళ్లు మాత్రం ఈమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా మాళవిక హెగ్డేను ఆదర్శంగా తీసుకుంటారేమో? ఎందుకని ఆలోచిస్తున్నారా? అయితే మీరు అసలు ఈమె ఎవరో.. ఆమె ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవాల్సిందే.
మాళవిక హెగ్డే.. కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య.
కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు.
ఒకవైపు భర్త చనిపోయిన.. మరోవైపు రూ. 7 వేల కోట్ల అప్పుల్లో కంపెనీ.. ఇంకొక వైపు వేల మంది ఉద్యోగుల జీవితాలు.. ఇలా ఎన్నో కష్టాలు మాళవిక హెగ్డేను చుట్టుముట్టాయి. అప్పులు ఎగ్గొడితే.. భర్తకు, కుటుంబానికి చెడ్డ పేరు కంపెనీని మూసేస్తే వేల మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. మరి ఏం చేయాలి? మాళవిక కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీని తిరిగి నిలబెడతామని, అప్పులు అణాపైసలుతో సహా తీర్చేస్తానని మాటిచ్చారు.
భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు.
ఎక్కడ మొదలు పెట్టాలో? ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర సంవత్సరం తిరగకుండా ఏడు వేల కోట్ల అప్పును మూడున్నర వేల కోట్లకుతగ్గించగలిగింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలో మూడున్నర వేల కోట్లు సంపాదించగలిగింది. ఇదే పనితీరుతో నడిస్తే బహుశా మరో ఒకటిన్నర సంవత్సరంలో మిగిలిన మూడున్నర వేల కోట్ల అప్పు కూడా ఆమె తీర్చేయగలదు.
భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తానని, కేఫ్ కాఫీ డే ను లాభాల బాట పట్టించి ఉద్యోగులందరినీ కాపాడుకుంటానని ఆమె స్థిరంగా చెబుతోంది. ఆమె కృషి ఫలించి కేఫ్ కాఫీ డే సగర్వంగా నిలబడాలని మనం కూడా కోరుకుందాం.
పదివేల కోట్లు, అయిదు వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి హాయిగా లండన్ లో కూర్చోవచ్చు. రాజకీయాల్లో చేరి బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు కేంద్ర ఆర్థిక మంత్రికి అనుభవపూర్వకసలహాలు ఇవ్వవచ్చు. ఇతరేతర వ్యాపారాల్లో పెడితే నష్టం వచ్చింది- గోచీ గుడ్డ మిగిలింది- ఏం చేసుకుంటారో చేసుకోండి- అని బ్యాంకుల మొహం మీద సగౌరవంగా ఆ గోచీ వస్త్రం కప్పవచ్చు.
కానీ- సిద్దార్థ్ సగటు భారతీయుడిలా అవమానంగా ఫీలయ్యాడు. బరువుగా ఫీలయ్యాడు. డెడ్ ఎండ్ కు వచ్చినట్లు ఫీలయ్యాడు.కప్పులో ఘుమఘుమల కాఫీ వేడి చల్లారకముందే చల్లగా మెల్లగా వెళ్లిపోయాడు. పుట్టెడు దుఃఖంలో అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో తెలియని ఒక అయోమయ వేళ మాళవిక మెల్లగా అడుగులు మొదలు పెట్టింది.
ఇప్పుడు బ్యాంకులు ఆమెను నమ్ముతున్నాయి. ఉద్యోగులు నమ్ముతున్నారు.కేఫ్ కాఫీ డేలో వాటాలు తీసుకోవడానికి టాటా లాంటి విశ్వసనీయమయిన కొత్త పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఈలోపు కరోనా మీద పడింది. అయినా కేఫ్ కాఫీ డే నెమ్మదిగా పరుగు అందుకుంది. అన్ని వర్గాల అభిరుచులకు అనుగుణంగా కాఫీ డే మారుతోంది.జీవితం లెక్కలు కాదు. జీవితం ప్లాన్ కాదు. దేన్నయినా తట్టుకోవాలి. విధిని ఎదిరించి నిలబడాలి. సిద్దార్థ్ విధికి తల వంచాడు. మాళవిక విధికి విధి విధానాలను రాసి శాసిస్తోంది. బరిలో గిరి గీసి నిలబడితేనే దైవమయినా సహాయం చేస్తుంది.
మాళవిక గెలవాలి. తీసుకున్న అప్పు అణా పైసలతో సహాచెల్లించడం ధర్మంగా భావించే మాళవిక ఓడిపోకూడదు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక వ్యాపార పత్రిక ఎకనమిక్ టైమ్స్ కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడింది. ఏవి చెప్పకూడదో అవి చెప్పలేదు. గర్వం లేదు. భయం లేదు. స్పష్టత ఉంది. నమ్మకముంది.పట్టుదల ఉంది.
Credits: Timeline

Exit mobile version