లాల్ బహాదుర్ శాస్రి డెత్ మిస్టరీ

0
2372
భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశ భక్తులలో ప్రముఖుడు, భారతదేశానికి రెండవ ప్రధాని, ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆదర్శ నేత లాల్ బహాదుర్ శాస్త్రి గారు. గాంధీజి పుట్టిన తేదీ రోజే జన్మించి అయన అడుగు జాడల్లో నడుస్తూ తన జీవితాన్ని తుది శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు లాల్ బహాదుర్ శాస్త్రి. మరి అయన ఉద్యమం వైపుకు అడుగులు ఎలా అడుగులు వేసాడు? దేశానికి రెండవ ప్రధాని ఎలా అయ్యాడు?పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అయన వ్యూహం ఎలా ఉంది? పాకిస్థాన్ తో సంధి కోసం విదేశానికి వెళ్లి అక్కడే మరణించిన ఆయనది హత్య నా లేదా సహజ మరణమా? అయన డెత్ మిస్టరీ ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
lala bahadur sastry
లాల్ బహాదుర్ శాస్త్రి గారు ఉత్తర ప్రదేశ్ లోని ముఘల్సరాయిలో 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన శ్రీవాస్తవ  కాయస్థ కుటుంబంలో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామదులారి దేవి దంపతులకు జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి మొదట బడి పంతులు గా పనిచేసి తరువాత అలహాబాద్ లోని రెవిన్యూ కార్యాలయంలో గుమాస్తాగా స్థిర పడ్డారు. లాల్ బహదూర్ శాస్త్రి సంవత్సరం వయసులోనే తండ్రిని కోల్పోయారు. లాల్ బహదూర్ శాస్త్రి తల్లి రామదులారి దేవి కొడుకుని మరియు తన ఇద్దరు కూతుళ్ళను తీసుకుని తన తండ్రి గారింటికి చేరుకొని అక్కడే స్థిరపడి పోయింది. శాస్త్రి గారి చదువు మొగల్సరాయి మరియు వారణాసిలలో కొనసాగింది.
lala bahadur sastry
లాల్ బహదూర్ గారు స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. అప్పుడు లాల్ బహదూర్ గారు తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు.
lala bahadur sastry
ఇక 1926వ సంవత్సరంలో శాస్త్రి కాశీ విద్యాపీటం నుండి ప్రధమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. కాశీ విద్యాపీటం ఇచ్చే పట్టాను ఆ రోజులలో శాస్త్రి అనే పదంతో గౌరవంగా సంభోదించే వారు. ఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమై పోయింది. శాస్త్రి గారు మహాత్మా గాంధి, బాల గంగాధర తిలక్ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1921వ సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాని శాస్త్రి గారు అప్పటికి ఇంకా మైనర్ కావడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను జైలు నుండి విడుదల చేసింది.
lala bahadur sastry
శాస్త్రి గారు 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. 1937వ సంవత్సరంలో శాస్త్రి గారు ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేసారు. 1940వ సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనడంవల్ల తిరిగి జైలు పాలయ్యారు. ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదల అయిన తరువాత శాస్త్రి గారు మహాత్మా గాంధి చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత అలహాబాద్ చేరుకొని జవహర్ లాల్ నెహ్రుతో కలసి అనేక స్వాతంత్రోద్యమ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఫలితంగా తిరిగి జైలుపాలై  1946 వరకు జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయన దాదాపు తొమ్మిది సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలు శిక్షను గడుపుతున్న కాలంలో శాస్త్రి గారు ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చించారు. ఆ సమయంలోనే ఆయన విప్లవాత్మకతను, వేదాంతాన్ని, వివిధ సంస్కరణలను ఆకళింపు చేసుకున్నారు.
lala bahadur sastry
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. అయితే తమిళనాడు లోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత ఎన్నికల్లో తిరిగి మంత్రి వర్గం లో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా ఆ తరువాత గృహ మంత్రిగా పనిచేసారు.
lala bahadur sastry
ఇక 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసారు. ఆ తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై గ్రీన్ రెవల్యూషన్ కి బాటలుపరిచాడు. ఇంకా ఇంగ్లీష్ భాషను అధికార భాషగా చేస్తూ తమిళనాడులో ఊపందుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించారు. జాతీయ స్తాయిలో పాల ఉత్పత్తిని పెంచే దిశగా శ్వేత  విప్లవాన్ని ప్రోత్సహించి, జాతీయ పాడిపరిశ్రామాభి వృద్ది సంస్థను మరియు  అముల్ సహకార సొసైటీ ఏర్పాటుకు ఎనలేని కృషి చేసారు.
lala bahadur sastry
ఇక 1965వ సంవత్సరంలో పాకిస్థాన్ భారత్ పైన యుద్దానికి దిగింది. ఆ సమయంలో ఇండియన్ మిలిటరీ కంటే పాకిస్థాన్ మిలటరీ దగ్గరనే అడ్వాన్స్డ్  మిలటరీ ఇక్విప్మెంట్ ఉండేది. ఇక అప్పటికే చైనా తో చేసిన యుద్ధంలో ఇండియా ఓడిపోయింది. ఇదే అనువైన సమయం అని భావించిన పాకిస్థాన్ కాశ్మీర్ కోసం కుట్ర పన్ని రహస్యంగా కాశ్మీర్ లోకి చొరబడి దొంగ దెబ్బ తీయాలని పాకిస్థాన్ భావించింది. కానీ కాశ్మీర్ లోని ప్రజలు ఈ సమాచారాన్ని ఇండియా కి చెప్పడంతో మనమే ముందు యుద్ధం మొదలు పెట్టాలని శాస్రి గారు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు.  ఇలా యుద్ధం మొత్తం 22 రోజుల పాటు జరుగగా ఆ యుద్ధంలో ఎక్కువ భూభాగం మనమే గెలుస్తూ విజయం సాదిస్తునప్పుడు పాకిస్థాన్ UN ని ఆశ్రయించింది.
lala bahadur sastry
అప్పుడు అగ్రరాజ్యాలు ఇందులో కలుగచేసుకొని ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పాకిస్థాన్ కి ఇవ్వాలని లేదంటే భారతదేశానికి తీవ్రమైన ఎకనామిక్ సాంక్షన్ విధిస్తామంటూ హెచ్చరిస్తూ బాగా ఒత్తిడి చేసాయి. ఆ సమయంలో ఇప్పటికే భారతదేశం ఆర్థికపరంగా చాలా వెనుక బడి ఉందని ఈ సమయంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఉంటె దేశం చాలా నష్టపోతుంది అని భావించి ఒప్పుకున్నారు. దీనితో యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో పాకిస్తాన్ రాష్ట్రపతి మొహమ్మద్ ఆయుబ్ ఖాన్ తో కలసి పాకిస్థాన్ తో శాంతి ఒప్పందం జరిగింది. ఇలా 1966 జనవరీ 10వ తేదీన శాస్త్రి గారు, ఖాన్ గారు తాష్కెంట్ వాంగ్మూలం పైన సంతకాలు చేసి ఆ రోజు పాలు తాగి పడుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే శాస్త్రి గారు తాష్కెంట్ లోనే గుండె పోటుతో మరణించారు.  శాస్త్రిగారి ఆకస్మిక మరణం భారత ప్రజలు జీర్ణించు కోలేక పోయారు. అయితే అయన మృతదేహాన్ని దేశానికి తీసుకువచ్చాగా అతడి భార్య అతడి మృత దేహం చూసి నీలం రంగులో ఉందని ఎవరో విషం పెట్టి హత్య చేసారంటూ ఆరోపణలు చేసింది. దీనితో ఒక్కసారిగా నిజంగా అయన గుండెపోటుతో చనిపోయారా లేదా ఆయన్ని ఎవరైనా హత్య చేశారనే అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు కొన్ని ఎవిడెన్స్ అనేవి బలాన్ని ఇచ్చాయి.
lala bahadur sastry
అయితే శాస్రి గారి శరీరం మీద కొన్ని కట్స్ అనేవి ఉన్నాయి. అయితే అసలు పోస్టుమార్టాన్ కానప్పుడు ఈ కట్స్ దేనికి ఉన్నాయి అనేది మొదటిది, అతను విషం వలన చనిపోకపోతే శరీరం పైన నీలం రంగు ఎందుకు వచ్చింది అనేది రెండవది, ఇక ఈ కేసు కోర్టులో ఉండగా కేసులో సాక్ష్యం చెప్పాల్సిన శాస్రి గారి పర్సనల్ డాక్టర్ మరియు పర్సనల్ అటెండెంట్ అయినా వీరిద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇంకా శాస్రి గారి భౌతికకాయం మీద ఎందుకు పోస్టుమార్టాన్ ఎందుకు జరగలేదు, ఇక  ఈ విషయాలు అన్ని కూడా అయన సహజంగా చనిపోలేదు శాస్రిగారిని హత్య చేశారనే దానికి బలాన్ని చేకూర్చాయి. అయితే అగ్రిమెంట్ పైన సంతకం చేయడం ఇష్టం లేని శాస్రి గారు ఆ రోజు రాత్రి బాగా ఆందోళన చెంది గుండెపోటుతోనే మరణించారని కొందరి వాదన.  ఇలా ఆయన మరణం ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక శాస్రి గారు మరణించిన తరువాత భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్కమైన  భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం 1966 లో ప్రకటించింది.
యావత్ భారతదేశం ఎప్పటికి గుర్తించుకోవాల్సిన  ఒక ఆదర్శ మూర్తిని, మహానేత,  గొప్ప దేశ దేశభక్తుడు లాల్ బహాదుర్ శాస్త్రి గారు.
SHARE