ముక్కోటి ఏకాదశని వైకుంఠ ఏకాదశి అని పిలవడం వెనుక పురాణం కథ ఏంటి ?

0
393

పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.

ముక్కోటి ఏకాదశిముక్కోటి ఏకాదశి నాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వారిరువురూ వేడుకున్నారట. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.

ముక్కోటి ఏకాదశివైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీన్ని స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.

ముక్కోటి ఏకాదశిసూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.

SHARE