సాధారణంగా మీరు చాలా ఆలయాలు చూసే ఉంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోబోయే ఆలయం మాత్రం అసాధారణమైనది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ పూజకు అనర్హం అనే విధంగా మన దేశంలో కొన్ని ఆశ్చర్యకర దేవాలయాలు ఉన్నాయి. మనదేశంలో కొలువై ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్ద పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాల వరకు ఎన్నో వింతలు అద్భుతాలు దాగి ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆలయాలలో ఒకటిగా మహబూబాబాద్ రూరల్ జిల్లా గార్ల మండలంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.
గత ఏడాది నుండి కరోనా ప్రభావం వల్ల ఉత్సవాలు జరగకపోయినప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయంలో అడుగడుగునా పాములు కనిపిస్తాయి. రుద్రమదేవి పాలనలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడ శాసనాలు చెబుతున్నాయి.
వేయి స్తంభాల గుడి, గార్ల కొండమ్మ ఆలయం ఒకేసారి నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. గారమ్మ, కొండలమ్మ, భయమ్మ అనే ముగ్గురు అక్కా చెల్లెల్ల పేరుమీదనే జిల్లాలో మూడు చెరువులు నిర్మించినట్లుగా చెబుతారు.
కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొలువై ఉన్నాయి అమ్మ వారి పేర్ల పై గార్ల చెరువు, బయ్యారం చెరువు, కొండాలమ్మ చెరువు ఆ దేవతల పేర్లు పైనే ఏర్పడ్డాయని అక్కడి ప్రజలు చెబుతారు. ఎంతో మహిమగల ఈ అక్క దేవతలే ఈ ఆలయంలో పాములుగా ప్రత్యక్షమై తిరుగుతుంటాయని అక్కడి వారు విశ్వసిస్తారు.
అయితే ఈ పాములు భక్తులకు ఎటువంటి హాని కలుగజేయవు. ఎంతో మహిమ గల ఈ కొండలమ్మ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరుకుందని, అధికారులు స్పందించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని , ఆలయానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.