కొన్ని ప్రాంతాల్లో మినహా పరమేశ్వరున్ని లింగరూపంలోనే పూజిస్తారు ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే శివుడి విగ్రహం దేశంలోనే పొడవైన శివుడి విగ్రహం మరియు శివలింగం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోకెల్లా ఎత్తైన లింగం ఇదే.
అతిపెద్ద శివుడి విగ్రహం కర్ణాటకలోని హోనావర్ పట్టణం దగ్గర్లో శ్రీ మురుడేశ్వర ఆలయం ఉంది. 123 అడుగుల ఎత్తు ఉంటుంది. నేపాల్‌లోని భక్తాపూర్‌లోని 144 అడుగుల శివుడి విగ్రహం తర్వాత ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం ఇదే.
రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందాడనే కథ మనందరికీ తెలుసు. దాన్ని భూమిమీద పెట్టకూడదనే షరతుమీద రావణుడికి ఇస్తాడు శివుడు. మద్యలో సంధ్యావందనం ఇవ్వాల్సి రావడంతో రావణుడు అక్కడ కనిపించిన బాలుడిని (వినాయకుడు) పిలిచి ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని కోరతాడు. అయితే కావాలనే వినాయకుడు కింద పెట్టేస్తాడు. సంధ్యావందనం పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన రావణుడు ఆ లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నించినప్పుడు అందులోని ఒక ముక్క దూరంగా పడిందని, ఆ ప్రాంతమే మురుదేశ్వరాలయమని పురాణం చెప్తోంది.
ఆలయం వెనుక ఉన్న పురాతన కోటను విజయనగర రాజులు నిర్మించారు. దీనికి టిప్పు సుల్తాన్ పాలన కాలంలో మెరుగులు దిద్దారు. దీని నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. మూడు వైపులా సముద్రం మధ్యలో పెద్ద కొండ… దానిమీద వేల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం. పూర్వం ఈ ప్రాంతాన్ని కందుకగిరి అని పిలిచేవాళ్లు. ఒకప్పుడు ఈ ప్రాంతం విజయనగర రాజుల పాలనలో ఉండేది. ఇక్కడి ఆలయాలన్నీ వాళ్లే నిర్మించారు. మురుదేశ్వర్ దగ్గర సూర్యాస్తమయ దృశ్యం మరో ఆకర్షణ.
పది అంతస్తుల భవనమంత ఎత్తుండే శివలింగం కర్ణాటకలోనే ఉంది. అక్కడ కమ్మసంద్ర గ్రామంలోని 108 అడుగుల భారీ శివలింగం ప్రపంచంలోనే అతి ఎత్తైనదిగా పేరు పొందింది. ఏటా శివరాత్రికి ఇక్కడికి 2 లక్షల మంది భక్తులు వస్తారు. దీనికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించారు. 13 ఎకరాల సువిశాల ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహంతో పాటు 35 అడుగుల నందికేశ్వరుడు, చిన్న చిన్న లింగాలు మొత్తం 90 లక్షల వరకు ప్రతిష్టించారు.
మొత్తం కోటి లింగాలు ప్రతిష్టించాలనే సంకల్పంతో 1980లో ఈ మహాలింగాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని కోటిలింగేశ్వరాలయంగా పిలుస్తారు.