వివాహ విషయంలో, జ్యోతిష్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వధూవరుల వివాహ పొంతన పరీక్ష చేయడానికి, వర్ణం, వశ్యం, జన్మ/నామ నక్షత్రాలు, యోనులు, గ్రహాలు, గణాలు, రాసులు, నాడులు, కూటాలు అని ఎనిమిది అంశాలని పరిగణనలోకి తీసుకునే పద్ధతి ఉంది. వీటిలో ఆఖరి రెండు అంశాలకూ ప్రస్తుతం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలినవి పెద్దగా పట్టించుకోవడంలేదు. మొత్తం 27 నక్షత్రాలు, దేవ, మానుష్య, రాక్షస అని మూడు తరగతులుగా/గణాలుగా విభజించారు. వధూవరులిద్దరూ ఒకే గణానికి చెందినవారైతే మంచిది. లేకపోతే వారు కొన్ని నిబంధనల్ని పాటించాలి. వధూవరులు వారి జన్మ సమయాన్ని బట్టి వారు కొన్ని జంతుయోనులకు చెందినవారైవుంటారు. వారు జాతివైరం గల జంతువులకి చెందినవారు కాకుండా వుండాలి. ఉదాహరణకి, సింహం –జింక, పులి–మేక, పాము–ముంగిస, పిల్లి–ఎలుక, ఇలా వైరి వర్గానికి చెందకుండా వుండాలి.
ఇక పోతే ఒకే గోత్రం, లేదా ఒకే ప్రవర కలిగినవారు వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు. తండ్రికి 7 తరాలవరకు, తల్లికి 5 తరాలవరకు సపిండురాలైన కన్యను చేసుకోరాదని శాస్త్రవచనం. అందరూ కూడా తమ వర్ణానికి చెందిన కన్యనే వివాహమాడాలని స్మృతులు శాసించాయి. కానీ, బ్రాహ్మణులు మూడువర్ణాలకు చెందిన కన్యలని, క్షత్రియులు రెండువర్ణాలకు చెందిన కన్యలని, వైశ్యులు వైశ్యవర్ణానికి చెందిన కన్యలను వివాహమాడవచ్చు అని కొన్ని స్మృతులు బోధించాయి. దీనిని అనులోమ వివాహం అంటారు. కానీ నిమ్నవర్ణాలవారు హెచ్చువర్ణాలవారితో వివాహానికి స్మృతులు అంగీకరించలేదు. దీనిని విలోమవివాహం అంటారు.
బుద్ధిమంతుడుగా వున్న వరునికే కన్యను ఇవ్వాలని శాస్త్రాలు చెపుతున్నాయి. పెళ్లయ్యేవరకూ అతడు బ్రహ్మచర్యాన్ని పాటించినవాడై వుండాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా వుండాలి. వివాహ వయస్సు దాటినవారికి కన్యనివ్వడంలో సందేహాలున్నప్పటికీ మంచి లక్షణములున్నట్లయితే అమ్మాయిని ఇవ్వవచ్చు. వరునికి విద్య, బలం, ఆరోగ్యం, అంగబలం అనేవి వుండాల్సినవి.
వధువుకి స్త్రీత్వమెట్లాగో అట్లే పుంస్త్వము కూడా పురుషులకు ముఖ్యమైనది. బీజ రహిత పురుషులు క్షేత్రమును పొందేందుకు అనర్హులు. అందుకే అతడి యొక్క అవయవాల లక్షణాలను బట్టి పురుషత్వము పరీక్షించిన తర్వాత కన్యను ఇవ్వాలని చెప్పబడింది. నపుంసకులు 14 రకాల తరగతులుగా వుంటారనీ, వారికి పిల్లనియ్యరాదని నారద మహర్షి చెప్పాడు.
భార్య చనిపోయిన వానికి కన్యను ఇవ్వడం కంటే అసలు వివాహం చేసుకోని వానికి ఇవ్వడం శ్రేష్టం. వివాహం కాకుండా బ్రహ్మచారిగా వున్న పురుషుడికి కన్యాదానము చేయడం వల్ల అనంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. రెండవ వివాహానికి సిద్ధంగా వున్నవాడికి ఇచ్చినట్లయితే సగం ఫలం వస్తుంది. పలు పర్యాయాలు వివాహం చేసుకున్నవాడికి ఇస్తే నిష్ఫలం.
అంతేకాదు మిత్రులచేత, కులముచేత విడువబడినవాడు, పతితుడు, అసవర్ణుడు, పక్షపాతరోగి, రహస్య వేషంలో వుండేవాడు, బాన కడుపు కలవాడు, సగోత్రుడు కన్యనిచ్చేందుకు పనికిరాడు. అటువంటి వారితో అమ్మాయికి పెళ్లయినట్లతే త్వరలో ఆ వధువు తిరిగి పుట్టింటికి వచ్చేస్తుందని వసిష్ఠులవారు చెప్పారు. అంతేకాదు మరీ దగ్గరగా వున్నవాడికి, మరీ దూరంగా వున్నవాడికీ, అతి బలవంతుడైన వాడికి, బలహీనమైనవాడికి, జీవితానికి సాధనం లేనివాడికి, మంద బుద్ధి ఉన్నవాడికి కన్యను ఇవ్వరాదని చెప్పబడింది.