హిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎంతో మంది దేవుళ్లను పూజిస్తారు. వారి అనుగ్రహం.. ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పరమేశ్వరుడిని మాత్రం అందరి దేవుళ్లకు పూజించినట్టు పూజిస్తే ఫలితాలు రావని పండితులు చెబుతున్నారు.
మీరు ఎప్పుడైనా శివుని ఆలయంలో గానీ.. శివ లింగాన్ని పరిశీలిస్తే.. ఆ లోకేశ్వరుడికి కుంకుమ తిలకం అనేది అస్సలు వాడరు. ఎందుకంటే ఈశ్వరునికి చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటున కూడా పూజించకూడదని సూచిస్తున్నారు. తులసి, శంఖం, కొబ్పరి నీళ్ల, ఎర్రని రంగులో ఉండే పూలతో పాటు మరికొన్ని వస్తువులతో ఆ పరమేశ్వరునికి పూజలు చేయకూడదు.. చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి.. ఏయే వస్తువులతో పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయి.. వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోకంలో ఎంతమంది దేవుళ్లున్నప్పటికీ.. భోళాశంకరుడు, మంజునాథుడు, అమరేశ్వరుడు అని అనేక పేర్లతో పిలువబడే ఈ దేవుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు మనస్ఫూర్తిగా కోరికలు కోరితే వాటిని వెంటనే తీర్చే బోళా శంకరునిగా పరమేశ్వరున్ని ప్రార్థిస్తారు.
మహాశివరాత్రి, శ్రావణ మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనదని పండితులు చెబుతూ ఉంటారు. అందరు దేవుళ్లను విగ్రహ రూపంలో పూజిస్తే.. ఒక్క శివుడిని మాత్రం లింగ రూపంలో పూజిస్తారు. అంతేకాదు అందరూ దేవుళ్ల విగ్రహాలకు తిలకం దిద్దినట్లు.. మహేశ్వరుడికి ఈ విధంగా చేయరు. కాబట్టి శివుడిని పూజించేటప్పుడు కుంకుమ, సింధూరం అనేవి పెట్టకూడదు. సాధారణంగా సింధూరం చాలా మంది దేవుళ్లకు ఎంతో ఇష్టమైనది. మహిళలు తమ భర్తతో, వారి ఆయుష్షుతో దీన్ని పోలుస్తారు. అయితే శివుడిని మాత్రం డిస్ట్రాయర్ అని పిలుస్తారు. కాబట్టి శివలింగంపై సింధూరం ఇవ్వకూడదని పండితులు చెబుతారు.
ఆధ్యాత్మిక, ధార్మిక విశ్వాసాల ప్రకారం శివునికి తిలకం దిద్దడం అశుభంగా పరిగణిస్తారు. అందుకే శివుని లింగానికి తిలకం అనేది అస్సలు దిద్దరు. మన హిందూ ధర్మం ప్రకారం, పసుపును చాలా పవిత్రంగా భావిస్తాం. శుభకార్యాలకు, ముఖ్యమైన వంటల్లో కచ్చితంగా పసుపును వాడతాం. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసేటప్పుడు కూడా పసుపును పవిత్రంగా భావించి.. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తాం. ఇదిలా ఉండగా.. శాస్త్రాల ప్రకారం శివలింగం అనేది పురుష తత్వానికి ప్రతీక. పసుపు అనేది మహిళలకు సంబంధించినది. పరమేశ్వరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇదొక కారణమని చెబుతుంటారు. కాబట్టి శివున్ని పూజించే సమయంలో పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది. ఆ పూజా ఫలాలను పొందలేరు.
శంఖంతో నీరు ఇవ్వొద్దు.. సాధారణంగా చాలా మంది దేవుళ్లకు శంఖంతో జలాభిషేకం చేస్తుంటారు. కానీ శివలింగానికి మాత్రం అలాంటి నీటిని అర్పించకూడదు. శివ పురాణం ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని చేతిలో మరణించాడు. కాబట్టి శివుడిని పూజించే సమయంలో శంఖంతో నీటిని ఇవ్వడం నిషేధించడమైనది. అందుకే శంఖంతో శివలింగాన్ని పూజించరు.
శివ లింగంపై బిల్వపత్రాలు ఉంచొచ్చు. ఇవంటే శివుడికి చాలా ప్రీతికరం. కానీ తులసి ఆకులతో మాత్రం శివలింగానికి ఎప్పటికీ పూజలు చేయకూడదు. పురాణాల ప్రకారం, జలంధరుడు అనే రాక్షసుడికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని విష్ణువు ఇస్తాడు. అమరుడు కావడంతో అతను ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితిలో విష్ణువు, శివుడు అతన్ని చంపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ నేపథ్యంలో బ్రుంద తన జలంధురని మరణం గురించి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కోపంలో తులసి ఆకులను శివరాధనలో ఎప్పటికీ వినియోగించొద్దని శపిస్తుంది.