ఈ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పేర్కొంటారు. ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటాడు. ఇలా స్వామివారు దర్శనం ఇవ్వడం వెనుక ఒక కారణం ఉంది. ఇంకా ఇక్కడి నదికి చాలా ప్రత్యేకత అనేది ఉంది. మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం ఏంటి? ఆ ఆలయ విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, విలుప్పురమ్ జిల్లాలో తిరుక్కోవళ్లూర్ అనే గ్రామం ఉంది. ఇది విల్లిపురానికి ఉత్తరంగా 45 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడే తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం పల్లవరాజులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయం నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ ఆలయంలో నాలుగు స్థంబాలు ఉన్నాయి. అందులో తూర్పువైపు గా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉన్నది. అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడొవదిగా చెబుతారు.
పూర్వం ఒకసారి ఈ ఆలయం పక్కనే ఉన్న మృకండమహర్షి ఆశ్రమంలోని ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం వచ్చారు. అయితే వీరు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంత నిలబడి మాట్లాడుకుంటుండగా, వారి మధ్య ఎవరో నిలబడి ఉండటం వలన గది మరింత ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆ గదిలో వారికీ పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది. అప్పుడు ఆ ఆళ్వారుల మనసు పులకరించింది.
ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి. ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు, ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు. కుడిచేత శంఖం, ఎడమచేత చక్రం ధరించి, స్వామియొక్క చూపుడు వేలు పైకి చూపిస్తూ భక్తులకి దర్శనమిస్తారు. పూర్వము ఒకప్పుడు బలి చక్రవర్తిని పాతాళానికి త్రొక్కిన తరువాత ఇచట వెలసినట్లు తెలియుచున్నది. అందువలనే స్వామివారు ఒంటికాలిపైనా నిలబడి ఉన్నారని తెలియుచున్నది. ఈ స్వామివారిని తమిళంలో అయ్యన్నార్ అనిపిలుస్తారు. ఇక్కడి అమ్మవారి పేరు పుషవల్లి తాయార్.
ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయానికి అనుకోని పెన్నానది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కొని ఇక్కడికి వచ్చి త్రివిక్రమస్వామికి ఆరాధన చేసేవాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది. అందుకే ఈ నదిని కూడా గంగానది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి. ఇక ఋషులు ముక్తిపొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గముగా తిరుక్కోవళ్లూర్ ను పేర్కొంటారు.