This Guy’s Take On RGV’s Gayam Shows Why It Is One Of The Most Underrated Movie In RGV’s Filmography

0
565

Written By Swaroop Thotada

“గాయం” సినిమాపై కొన్ని ramblings:

(అప్పటి సామాజిక పరిస్థితులకి, అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలకు ఈ సినిమా ఎలా అద్దం పట్టిందో అందరికీ తెలుసు కాబట్టి సామజిక కోణం గురించి మళ్లీ రాయకుండా కేవలం పాత్రల గురించి, డ్రామా గురించి నాలుగు మాటలు)

1 Gayamచిత్రంలో అనిత (రేవతి) దుర్గ (జగపతి బాబు) ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే సన్నివేశం సినిమా మొత్తానికి most dramatic point అనిపిస్తుంది నాకు. ఒక రకంగా సినిమా అంతా ఈ సీన్ వద్దకే దారితీస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. జీవితంలో చెరో దిక్కూ విడిపోయిన ఈ ఇద్దరూ చాలా దూరం వెళ్ళిపోయి మళ్లీ ఇక్కడ ఒకరికొకరు తారసపడ్డ సందర్భం. ఇదివరకు కలిసి జీవించాలనుకున్నంత compatibility ఉన్న మనుషులు కాలచక్రం గిర్రుమని తిరిగి ఇక్కడ ఆగాక భిన్నధ్రువాలుగా ఎదురుపడతారు. అక్కడ జరిగే చాలా చిన్న సంబాషణలోనే ఈ సినిమా ఆత్మను మొత్తం ఆవిష్కరించాడు వర్మ. దుర్గ పాత్రకి గురునారాయణ్ (కోటా) ప్రత్యర్థి, ప్రతినాయకుడు కావచ్చు, కానీ అతనికి అర్ధవంతమైన సవాలు విసిరేది ప్రతిసారీ అనితే. ఎందుకంటే అనిత కేవలం దుర్గ మాజీ ప్రేయసి మాత్రమే కాదు, చీకట్లోకి అడుగు పెట్టాక అతను పోగొట్టుకున్న మనస్సాక్షి కూడా. అందుకే ఆమె వేసే ప్రతి ప్రశ్ననూ దుర్గ rhetoric తో తిప్పి కొట్టడమో, లేక తనని తాను సమర్ధించుకోవడమో చేస్తాడే తప్ప ఆమె తప్పని ఎప్పుడూ వాదించడు.

అనిత స్పర్ధ దుర్గ ఒక్కడితోనే కాదు. పిరికివాడైన ఆంధ్రజ్యోతి ఎడిటర్ తో, సమాజానికి ప్రత్యక్షంగా ప్రమాదకరమైన గురు నారాయణ్ తో, పరోక్షంగా కారణమయ్యే సామాజిక అలసత్వంతో, అంత మంది ప్రాణాలు పోయినా జరిగిన గొడవ గురించి మాట్లాడ్డానికి నిరాకరించే ఆ థియేటర్ యజమానితో, చివరికి ఛార్జ్ ఎక్కువ చెప్పే ఆటోవాడితో కూడా. అనిత దుర్గ కోల్పోయిన మనస్సాక్షి మాత్రమే కాదు, ఈ దేశంలో మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ కొన ఊపిరితో ఉన్న సామాజిక స్పృహకి ప్రతీక కూడా. దౌర్జన్యం రాజ్యమేలే ఈ ప్రపంచంలో ఆ స్పృహకి ప్రయాస, నిరాశ అనివార్యాలు. ఆ బలహీనతకి సాదృశ్యం అయిన అనిత చీర కట్టుకుని సిటీ బస్సెక్కి ఆఫీసుకెళ్లి పెన్నుతో వార్తలు రాసే ఒక అమ్మాయి. అన్ని మాసిన గడ్డాలు, కత్తులు, తుపాకులు, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆమె కలం బలం ఎంత? తన భర్తని చంపేస్తానని గురునారాయణ్ బెదిరిస్తే పరిగెత్తుకుంటూ తాను అప్పటి వరకూ విమర్శించిన దుర్గ సహాయం కోరేంత. ఈ కథ ఒక రకంగా ఈమె ఫెయిల్యూర్ స్టోరీ (కాదని చివరి voiceover లో బుకాయించే దర్శకుడి లౌక్యాన్ని పక్కన పెడితే). ఆదర్శాలకీ, ప్రాక్టికల్ జీవితానికీ మధ్య అంతరాన్ని జీర్ణించుకుని తన చుట్టూ ఉన్న మనుషుల passivity ని అరువు తెచ్చుకుని రాజీ పడిపోవడం చేతగాని తన తొట్రుపాటుని ఆమె ముఖాముఖీగా కలుసుకునే ఒక anti-climax ఈ సినిమా ముగింపు.

5 Gayamఅనిత, దుర్గ ఇద్దరూ భిన్న ధృవాలన్న సంగతి వారి ప్రేమ లేత చిగురు దశలో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది కానీ పరస్పర ఆకర్షణలో వాళ్లు అంతగా గమనించరు. ఈ ఇంటర్వ్యూ సీన్ లోనే ఆ సాక్షాత్కారం పూర్తిగా జరిగేది. “అప్పుడంటే నీ పరిస్థితులు నిన్నలా చేయించాయి. ఇప్పుడేమైంది? న్యాయస్థానానికి వచ్చి నిజం చెప్పచ్చు కదా? ” అని ఆమె అడిగిన ప్రశ్నకి అతను “నా దృష్టిలో గురునారాయణ్ న్యాయం. సర్కార్ (రామిరెడ్డి) చట్టం” అని తాను ఉన్న చీకటి ప్రపంచపు మూలసూత్రాన్ని one-liner లా చెబుతాడు దుర్గ. “పోనీ ఇప్పుడు జరుగుతున్న సమస్యలకి పరిష్కారం ఏమిటో నువ్వు చెప్పగలవా? ” అని ఆమెని ఎదురు ప్రశ్నిస్తాడు. అనితకు ప్రతి సారీ ఎదురయ్యే ప్రశ్న ఇదే. సీతారామ శాస్త్రి అనిత ఆదర్శాలు వల్లించినప్పుడల్లా ఆమెను ఈ ప్రశ్నతోనే నిలువరిస్తాడు. అనిత దృష్టిలో ప్రతి వ్యక్తీ తన పనుల పట్ల individual responsibility తీసుకోవడం ఒకటే పరిష్కారం. కానీ అరాచకమే నైజమై బ్రతుకుతున్న ఆమె చుట్టూ సమాజం ఈ నిజాన్ని కేవలం ఒక మొండి ఆదర్శంగా మార్చేస్తాయి. ఆమె ఇంటర్వ్యూ లో నిజాయితీగా అడిగే ప్రశ్నలకి “గదైతే ఖండిస్తన్న” అని అబద్దాలాడే కోటా పాత్ర అందుకు సాక్ష్యం. ఈ క్లిష్ట ప్రశ్నకు సమాధానం దుర్గ దగ్గర ఉంటుంది. కానీ అతను అనితకి అర్ధమయ్యే భాషలో చెప్పలేడు. అతని ప్రపంచంలో దెబ్బకు దెబ్బే సమాధానం. ఏ శక్తుల్ని ఎదిరించి పోరాడుతున్నాడో అతనూ అలాంటి శక్తిగానే తయారయ్యే అనివార్యతని ఒప్పుకున్న resignation అతనిది.

2 Gayamతను తన అన్నయ్య స్థానాన్ని భర్తీ చేస్తాననీ, ఎంత మంది ఎదురైనా చంపుతానని ఆమెకు నిస్సంకోచంగా చెప్పినప్పుడు వెళ్లిపోయిన అనిత తరువాతి అంతర్మధనాన్ని మనం తర్వాత ఎక్కడా చూడం. కొంత కాలం తర్వాత అతనికి మళ్లీ తారసపడిన ఆమె పూర్తిగా కరుడుగట్టిన idealist అవుతుంది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని పెళ్లి కూడా చేసుకుంటుంది. తన ఆదర్శాల్ని కొనగిస్తుంది. ఈ పాత్రని ఇలాగే కొనసాగిస్తే అది ఒక పాత్రగా కాక కేవలం పైన అనుకున్నట్టు సమాజపు మనస్సాక్షి అన్న metaphor గానే మిగిలిపోయేది. కానీ చివర్లో తన భర్తతో దుర్గకి ఇదివరకున్న సంబంధం గురించి చెప్పినప్పుడు ఈ ఖాళీ భర్తీ అవుతుంది. దుర్గ స్థానంలో అప్పుడు ఎవరున్నా అలాగే చేసేవారు కాబట్టి అతన్ని వదిలెయ్యడం తప్పేమో అన్న ఆమె అంతర్మధనాన్ని భర్తతో వ్యక్తం చేస్తుంది. దుర్గ ఆ రోజు ఇంటర్వ్యూ లో ఇచ్చిన సమాధానాలు ఆమెను శాంతపరుస్తాయి. తాను వదిలి వెళ్లిపోయిన దుర్గ అంత అమాయకుడేం కాదు. దుర్గ పరిస్థితుల వల్లే ఆ ఊబిలో ఇరుక్కోవచ్చు, కానీ అనిత అన్నట్టుగానే అతను బైటికీ రావచ్చు. కానీ రాడు. పరిస్థితులు ఒక ఫార్శ్యం ఐతే అతని లోపల కూడా తన అన్నయ్య లో ప్రవహించే రక్తమే ఉంది. దాని ప్రకంపనలు మనం అనితని బీచ్ వద్ద ఏడిపించిన వాళ్ళని అతను కొట్టేటప్పుడే మనం చూడచ్చు. పరిస్థితులు వేరేలా ఉంటే అతను అనుకున్నట్టు ఉద్యోగం చేస్తూ అనితని పెళ్లి చేసుకుని హ్యాపీ గా సెటిల్ అయ్యేవాడేమో. కానీ పరిస్థితులు ఇటు నెట్టాక, ఈ అగాధంలో అతను సహజంగానే అమిరిపోతాడు. అతని అన్నయ్య చావుకి పగ తీర్చుకునేటప్పుడే “ఇప్పుడు ప్రశ్న చంపాలా వద్దా అని కాదు, ఎలా చంపాలని” అని అప్పటికప్పుడే ఆరితేరిపోతాడు. Godfather సినిమాలోని Michael Corleone (Al Pacino) పాత్ర ఈ దుర్గ పాత్రకి ప్రేరణ అని తెలిసిందే. ఐతే Godfather లో Kay (Diane Keaton), Michael తన కుటుంబం లోని మిగతా వాళ్ళలా కాదన్న అపోహతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది కానీ మోసపోతుంది. Part 2 లో అతన్నుంచి విడిపోతుంది. ఇక్కడ అనిత దుర్గను పెళ్లి చేసుకుంటే ఆమె integrity దెబ్బ తినడమే కాదు, ఆమె తెలివితేటల్ని ఆమే అవమానించుకున్నట్టు కూడా. డ్రామా పరంగా కూడా పెళ్లయ్యాక అతన్ని ఆక్షేపించడం తప్ప ఆమే ఏమీ చేయలేదు. ఆమె అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కనుక, అతనితో వ్యక్తిగత సంబంధం ఇక లేదు కనుకే వీరిద్దరి dynamic ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. భావోద్వేగాల పట్టింపులు లేకుండా అతన్ని clinical గా పరీక్షిస్తుంది అనిత. ఇప్పుడామె దృష్టిలో దుర్గ ఒక సామాజిక రుగ్మతకు లక్షణం మాత్రమే. ఆమె reasoning కి స్పందించే ఆ పాత దుర్గ అతనిలో ఎప్పుడో మాయమైపోయాడని ఇంటర్వ్యూ లోనే ఆమెకు స్పష్టం అవుతుంది. ఒక్కో చోట అనిత పాత్ర దర్శకుడి నైతిక అభిప్రాయాలకి surrogate గా, ఒక్కో చోట ఆడియన్స్ కి ఉండే ప్రశ్నలకి proxy గా పనిచేస్తూనే three dimensions కలిగి ఉంటుంది.

7 Gayamదుర్గలో అంతర్గతంగా ఉన్న హింసాత్మక కోణం నేపథ్యంలో ఈ చెరసాలలో దుర్గ తానే బంధించుకున్నాడా, ఇరుక్కుపోయాడా అన్నది అంత తేలికైన ప్రశ్న కాదు. అనిత ప్రశ్నలకు దుర్గ చెప్పే సమాధానాలు తిరిగి ప్రశ్నలే. సీతారామ శాస్త్రి పాటలో కూడా “నిగ్గదీసి అడుగు” అని సమాజాన్ని అడగమంటాడే తప్ప ఆయనా ఖరాఖండీగా ఏమీ చెప్పడు. ఓపెన్ క్లైమాక్స్ తో దర్శకుడు కూడా ప్రశ్నలతోను, అరకొర సమాధానాలతోనే సరిపెడతాడు. అందుకే “ఆ థియేటర్ లో జరిగిన సంఘటనకి నిన్ను ఇంటర్వ్యూ చేయడానికొచ్చాను” అని అనిత అన్నప్పుడు దుర్గ ఒకటే అంటాడు…. “తెలుసుకుని ఏం చేస్తావ్? ” అని. అనిత ఇచ్చే పరిష్కారాలు అతనికి నప్పవు, అతని చుట్టూ ఉన్నవాళ్లకు కూడా రుచించవు. అనిత ఆలోచనా విధానం బాగా తెలిసిన దుర్గ అందుకే ఆమె చెప్పేది వినిపించుకోడు.

6 Gayamఈ పాత్రల scope నుండి బైటికొచ్చి ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు కనీసం theoreticalగానైనా సమాధానాలుంటాయి. సామాజిక మార్పులు, పటిష్ట వ్యవస్థలు, నీతివంతమైన రాజకీయాలు, కఠినమైన చట్టాలు లాంటివి. కానీ ఈ కథ పరిధిలోకి అవి రావు. ఈ కథ ఒక గాయం. గాయాలకు కట్టు కట్టచ్చు, మందు పూయచ్చు లేదా శాస్త్ర చికిత్సా చేయచ్చు. కానీ చివరికి అది నయమైనా అవ్వకపోయినా, అప్పటివరకూ నొప్పిని మాత్రం భరించాలి. ఆ నొప్పిని బాహాటంగానో పంటిబిగువునో భరిస్తున్న పాత్రల సంఘర్షణే ఈ సినిమా.

SHARE