Home Unknown facts రాతితో కొడితే వింత శబ్దం ఏంటి ? ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి ఎవరు

రాతితో కొడితే వింత శబ్దం ఏంటి ? ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి ఎవరు

0

ప్రకృతి అందాల నడుమ ఒక కొండ గుహలో ఈ ఆలయం వెలసి భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం గండి రామన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరి రాముడు కొలిచిన ఈ ఆలయాన్ని గండి రామన్న ఆలయం అని ఎందుకు అంటారు? ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి ఎవరు? ఇంకా ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva Lingam

తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక కొండ గుహలో ఈ రామన్న ఆలయం ఉంది. ఇది ఒక శివాలయం. అయితే శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు జరిపాడని స్థానికులు విశ్వసిస్తుంటారు. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి రామన్న గండి అని పేరొచ్చిందని, ఇది రానురాను గండిరామన్నగా స్థిరపడిందని చెప్తుంటారు.

ఇంతటి విశిష్టత కల్గిన ఈ ఆలయం ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  నిర్మల్‌ అనగానే సహజంగానే అందరికీ గుట్టలు గుర్తొస్తాయి. దానికి నిదర్శనంగా ఈ గండిరామన్న ఆలయం సైతం గుట్ట ప్రాంతంలోనే కొలువై ఉంది. ఆలయం చుట్టూ పచ్చని మొక్కలు, పర్వతాలు దర్శనమిస్తాయి. పెద్దపెద్ద బండరాళ్లతో ఉన్న ఈ గుట్టపై ఉన్న గుహలో రాతితో చేసిన శివలింగ, నందీశ్వరుని విగ్రహాలున్నాయి.

అయితే సీతాన్వేషణ చేసే క్రమంలో శ్రీరాముడే స్వయంగా ఈ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో దక్షిణముఖంగా ఉండే హనుమంతుని విగ్రహం సైతం రాతిపై చెక్కి ఉండటం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గుహవరకు వెళ్లడానికి మెట్లున్నాయి. గుహలోకి ధారాళంగా గాలి, వెలుతురు వస్తుండటం విశేషం. సమీపంలోనే వినాయకుని ఆలయం సైతం ఉంది. ఇక గుట్టపైకి వెళ్తే కంచుబండ కనిపిస్తుంది.

ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, రాతితో కొడితే ఇక్కడ శబ్దం వినడానికి వినసొంపుగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చే ఆ శబ్దం వినడానికి భక్తులు ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు. పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణంలో దత్తసాయిబాబా ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఆలయం పక్కనే దత్తాత్రేయుని ఆలయం సైతం కొలువై ఉంది. ఈ ఆలయంలో భారీ శివరూప విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దక్షిణముఖ అభయాంజనేయస్వామి భారీ విగ్రహం, సాయి గురుస్థాన్‌, శివాలయాలను ఈ ఆలయంలో నూతనంగా నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నందదీప్‌ అనేది ఎక్కడా కనిపించదు. అయితే షిర్డీ తరహాలో ఇక్కడ సైతం నందదీప్‌లోని జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది.

ఇలా ప్రకృతి అందాల నడుమ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన ఈ శివాలయానికి రోజు రోజు భక్తుల తాకిడి అనేది పెరుగుతూ వస్తుంది.

Exit mobile version