This Man’s Heart Rendering Poems Are A Must Read To Every Living Human Being Out There

0
558

Written By: Aranya Krishna

1) అంతరంగం

1 Heart Rendering Poemsఏముందక్కడ?
పురాతనమైన గాయం వుంటుంది
ఆదిమానవి నెత్తుటిమరక వుంటుంది

ఆ ఆఛ్చాదన వెనుక
రెండు నెత్తుటి కొండలుంటాయి
రెండు విషాదాంత కావ్యాలుంటాయి

ఆ గుడ్డపీలిక చాటున
పసుపుతాటికి చిట్లిన చర్మం వుంటుంది
రూపాయి నాణేలతో అచ్చు వేసిన
పచ్చబొట్లు వుంటాయి
హింసానందపు స్మృతులుగా మిగిల్చిన
సిగరెట్టు మరకలుంటాయి

ఆ గుడ్డముక్క చాటున
ఆకలి సెగతో లేచిన కురుపులుంటాయి
నెత్తురు గూడు కట్టిన ‘మెహెందీ’ గడ్డలుంటాయి

*****

ఈ నాగరికతలో
గుండెలు బహిర్గతమై
హృదయం పంజరంలోకి వెళ్ళిపోతుంది
మేకలు కసాయివాడి ముందు
స్వఛ్చందంగా తలలు వంచుతాయి
థియేటర్లు కసాయి కొట్లుగా వెలుస్తాయి
కోసిన గుండెలు గల్లాపెటెలవుతాయి
కళాఖండాలన్నీ మాంసఖండాలమయమౌతాయి

జాగ్రత్తగా చూస్తే
ఆచ్ఛ్చాదితమైన గుండెల వెనుక
అనాఛ్చాదిత హృదయం వుంటుంది
అక్కడ ప్రేమ ఫలాలే కాదు
గురిచూసే నిప్పుల గోళాలూ వుంటాయి

2) వైచిత్రి

2 Heart Rendering Poemsనిశ్శబ్దం
నా అవ్యక్త సంఘర్షణాత్మక స్వీయ సంభాషణ

అసలీ ప్రపంచంతోనే నాకేదో తగాదా
యుద్ధరంగానికి వెళ్ళేముందు
ఖడ్గచాలనం చేసే మైదానం నా నిశ్శబ్దం
ఏనాడూ విజయం సాధించలేదు
తీవ్రంగా గాయపడటమే తప్ప!
ఒక దోసెడు నిశ్శబ్దం
ఔషదం రాసి ఖడ్గాన్ని అందించి
సాధన చేసుకోమని తాను విస్తరిస్తుంది

చాలామంది నన్ను దగా చేసి వుంటారు
కొందరి విషయంలో నేనుకూడా దగాకోరునే కావొచ్చు
ఒక నిశ్శబ్ద అంతరంగ వీక్షణలోనే
నాలోనూ అందరిలోనూ నిజాయితీని చూడగలను
దైనందిన రణగొణధ్వనుల్లో ఇన్వాళ్రేపట్లకోసం
ప్రణాళికలు వేస్తూ గడుపుతాను
చెరువుగట్టు మీదనో సముద్రం ఒడ్డునో
తోటలో చెట్టు కిందనో
నా రాత్రిగదిలో కుర్చీ మీదనో
గతం గాయాలపిట్టై వాలుతుంది నిశ్శబ్దంగా
బాధగా దాని తల నిమురుతాను
బాధని ప్రేమించలేకున్నా దూరం చేసుకోలేను
నిశ్శబ్దంలో ఏమొచ్చినా నివారించలేను

ఒక మంచి స్నేహితుడెదురైనప్పుడు
నిష్కల్మష నిశ్శబ్దాన్ని స్పృశించినంత ఆనందం
మంచి స్నేహితుల సమూహంకోసం
ఈ ప్రపంచంతో నిరంతరం తగాదా పడుతూనే వుంటాను

3) మమ్మల్ని క్షమించకండి

3 Heart Rendering Poemsనవ్వండి పిల్లలూ నవ్వండి
నోరారా నవ్వండి
మీ కన్నుల పండగగా నవ్వండి

మేమెంత దగా చేసినా
క్షమించే హృదయం మీది
మీరెంత అర్ధనగ్నంగా పీలికల బట్టలతో వున్నా
గంధర్వ సౌందర్యంతో ధగధగలాడుతున్నారు
నవ్వండి పిల్లలూ నవ్వండి

బ్రాండెడ్ బట్టలేసుకున్నా
స్వీయ మానసిక దుర్గంధంతో
ముక్కుమూసుకు తిరిగే మమ్మల్ని చూసి
ఫెటేల్మని నవ్వండి
పొట్టల్లో ఆకలి ఎర్రకారమై పేగుల్నెంతగా చుట్టేసుకుంటున్నా
నవ్వండి బుజ్జోళ్ళలారా నవ్వండి

ప్రతి క్షణం ఏదో తెలియని ఆకలితో, ఆయాసంతో
అలమటిస్తూ సంచరిస్తూ కార్లల్లో విమానాల్లో బంగళాల్లో ఏడ్చేవాళ్ళం
మమ్మల్ని చెప్పుతో కొట్టినట్లు నవ్వండి
ఒకరినొకరు కరుసుకుంటూ కౌగిలించుకుంటూ
మీకిష్టమొచ్చిన భంగిమల్లో విరగబడి నవ్వండి
ఆకలిదప్పు తెలియనంతగా నవ్వండ్రా బుజ్జాయిలూ నవ్వండి

అహంకారపు ఆధిపత్యపు హోదాల ఎలుక కంతల్లో దాక్కుంటూ
చీకటి తారాటల ఒంటరి బతుకు భారాల నిట్టూర్పుల్లో
ఊపిర్లు ఖర్చు చేసుకుంటూ సతమతమయ్యే మమ్మల్ని చూసి
చంద్రకాంతి ఒడిసిపట్టిన పలువరసల్తో
మా చెంపలకు ఇరువైపులా చళ్ చళ్మని నవ్వండి

ప్రాయశ్చిత్తం చేసుకోలేని జాతి నీతుల మీద
మీ నవ్వుల తుంపర్లు ఉమ్మిలా ఎగిసిపడేంతగా నవ్వండి

4) తిరుగు పాట!

4 Heart Rendering Poemsమాంసం బాబూ మాంసం
కోడి కన్నా మేక కన్నా సునాయాసంగా
దొరుకుతున్న మనిషి మాంసం బాబూ
కబేళాలలోో నరకబడ్డ మాంసం కాదు బాబూ
కత్తి గాటు పడకుండానే
రహదార్ల మీద వడగళ్ల వానలా కురిసిన
మనిషి మాంసం ముక్కలు బాబూ
చావు భయంతో కాక బతుకు భయంతో
పరుగులెత్తుతున్న వెచ్చని నెత్తుటి మనుషుల
చల్లటి మాంసం బాబూ

మీరు నిర్బంధ విలాసాల్లో విసుగ్గా దొర్లుతున్నప్పుడు
రైలు పట్టాల మీద ఎగిసిపడ్డ మాంసం ముద్దలు బాబూ
చడీ చప్పుడు లేకుండా దూసుకొస్తున్న చావుతో
తరమబడ్డ మనుషుల పచ్చి మాంసం నాయనా!
తిరుగుబాటు చేయటం తెలియక తిరుగుబాట పట్టిన
మీ అంతటి మనుషుల మాంసం బాబూ

కనిపించని సూక్ష్మక్రిమిని హంతకుడిగా చూపించి
ముసుగేసుకున్న అసలైన వేటగాడెవడో
కనబడకుండానే విసిరిన బాణాలు చీల్చిన గుండెల్లోంచి
చివ్వుమని తన్నుకొచ్చిన రక్తంలో తడిసిన మాంసం బాబూ

అరి కాళ్లను మంటల్లోకి కట్టెల్లా నెట్టినట్లు
మండుతున్న రోడ్ల మీద అడుగడుగూ వేసుకుంటూ
వాళ్లు వెళుతున్నది చావు నుండి పారిపోటానికి కాదు బాబూ!

వాళ్ల నడకని ఓ ఎరుక నడిపిస్తున్నది
ఎగిరొచ్చిన వలస పక్షి
చస్తే తన చావు పడకని పుట్టిన గూటిలోనే ఏర్పాటు చేసుకోవాలనుకొని
కార్చిచ్చుల పాలైన అడవుల నుండి వెనక్కి తిరిగి ఎగురుతూ వెళ్లినట్లు
వాళ్లు ఇంటి బాట పట్టిన సిద్ధార్థుల్లా నడుస్తున్నారు
***

జాతి నిర్మాణానికి దేహాల్ని పనిముట్లుగా ఉపయోగించి
తమ కంకాళల్ని తీసి పునాదుల్లో భద్రపరిచిన వాళ్ల చేతుల్లో
పంటలా పెరిగిన దేశం
వాళ్ల కాలి పిక్కల గట్టిదనంతో బలపడ్డ దేశం
వాళ్ల భుజాల మీదగా ఎదిగిన దేశం
వాళ్ల కండల్ని కరగతీసి పరిశ్రమలై భవంతులై విరగబడి నవ్విన దేశం
ముఖానికి ముసుగులు తొడుక్కొని
భయం భయంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ల వీపుల మీద కత్తులు దించింది
సంపదల్ని సృష్టించిన వాళ్లు కాందిశీకులై తరమబడుతున్నారు బాబూ

అంతేలే బాబూ అంతేలే
ఇది చేతులకి నెత్తురంటని
హంతకుల యొక్క హంతకుల కొరకు హంతకులచే తీర్చిదిద్దబడ్డ రాజ్యం కదా!
కన్నెర్ర చేయకు బాబూ
బాధ్యతల్లేని పాలకులందరూ హంతకులే కదా!

5) వేట

5 Heart Rendering Poemsఇంటి నుండి
అన్నల ఆంక్షల్ని నాన్న అనుమానాల్ని
అమ్మ చెప్పే జాగ్రత్తల్ని
మోసుకుంటూ వీధిలోకెళ్తే
ఎన్ని ఎదుర్కోళ్ళనీ!

ఓ జులపాల ఆల్సేషియన్
బూతుల్ని ముఖం మీద మొరుగుతుంది
మరో గుంటనక్క
రెండర్ధాల పాటని ఊళ పెడుతూ వెళుతుంది
ఒక ముసలి గుడ్లగూబ
చూపుల బల్లేల్ని కండరాల్లోపలికి దించుతుంది
ఇంకో మొసలి తనని కనికరించక పోతే
శాలువా కప్పేసుకుంటానని దీనంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది
బస్సులో ఓ జెర్రిపోతు
ఊపిరి బుసని వీపంతా పులిమితే
మరో ఆక్టోపస్
గొంగళిపురుగు వేళ్ళతో ఒళ్ళంతా కెలుకుతుంది
ఆఫీసులో ఓ కరటకుడు మరో దమనకుడితో
“కేర్ ఫ్రీ” మీద జోకు విషవాయువు వదుల్తాడు
ఆమె బాత్రూం కి వెళ్ళటం కూడా వాళ్ళకి ఓ వింతే

చూపుల శిలువల్ని మాటల శిలల్ని ఇంటికి మోసుకొచ్చి
రాత్రి కలల్లో కళ్ళు మూర్చ పోయినప్పుడు
గాయాల నుండి స్రవించిన నెత్తుటి మడుగులో మనసు
కరుగుతున్న మంచుగడ్డగా సాక్షాత్కరిస్తుంది

6) జన్మభూమి

6 Heart Rendering Poemsఈ దేశాన్ని తవ్వితే
నుదుట చెమట ఆరని
అస్థిపంజరాలు దొరుకుతాయి
ఈ మట్టిని తవ్వితే
ఏ గోధూళి వేళలోనో నిశ్శబ్దంగా మట్టిలో కలిసిపోయిన
రైతుల పక్కటెముకలు తగులుతాయి
ఈ నేలను తవ్వితే
ఏ ఆకురాలు కాలంలోనో ఇంకిపోయిన
అన్నార్తుల ఉచ్వాస నిశ్వాసాలు వినబడతాయి

ఈ భూమి గర్భంలో
మతాలకన్నా మనుషుల ఆనవాళ్ళే ఎక్కువ

మనుషులు భూమి శిశువులు
దేవుళ్ళు భూమి మీద జన్మించరు
వాళ్ళు దురాక్రమణదారులు
భూమిని చీలుస్తారు
మనుషుల్ని విడతీస్తారు

వాళ్ళు మందిరాల్ని ఓట్లపెట్టెల్ని
ఆయుధాలుగా ప్రతిష్ఠిస్తారు
మనం విత్తనాలతోనూ నాగళ్ళతోనూ
ఇతర పనిముట్లతోనూ బయలుదేరదాం
ఎగుడుదిగుళ్ళను చదును చేద్దాం
భూమినీ మనుషుల్నీ సారవంతం చేద్దాం

శతృ నిర్మూలన అనంతరం
సృజనాత్మకంగా ఆవిర్భవించే వరికంకుల ముందు
సాష్ఠాంగ ప్రణామం చేద్దాం

7) స్పర్శ

7 Heart Rendering Poemsదారితప్పి ప్రపంచంలోకి వచ్చినట్లనిపిస్తుంది
మనుషులతో పురాతన బంధమేదీ స్ఫురించదు
అందరూ నిగూఢమైన రహస్యాలు దాచుకున్న
ఏకాంత ద్వీపాల్లా కనిపిస్తారు
ప్రతీ గుండె మీదా మూసుకున్న తలుపులు
మునివేళ్ళ స్పర్శకు ఏ స్పందనా లభించదు

ఒడ్డు కనిపించని నదిమధ్య ఏకాంత నావలా
మనుషుల మధ్య అనంతమైన హృదయయానం
ఎప్పుడో ఓ హృదయచాలనం పెనవేస్తూ
అంతలోనే వియోగం నులిమేస్తూ

రాలిపడ్డ పువ్వు
ఎగరలేని పక్షి
అనాధ శిశువు
బిడ్డని పోగొట్టుకున్న తల్లి
నీళ్ళు నిండిన కళ్ళు …. ఎదురైనప్పుడు
హృదయశూన్యంలో తడి ఆవరిస్తుంది
మొద్దుబారిన మనసులో ఒక చప్పుడవుతుంది
గాజుపెంకులు గుచ్చుకున్న గుండె స్వచ్చమౌతుంది
మానవదుఖం మాత్రమే
మనుషులమీద ప్రేమను పెంచుతుంది

అప్పుడప్పుడూ ఈ ప్రపంచంతో ఏదో రాజీ
అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు
నాలికమీద లౌక్యం
కనుపాపలవెనుక రహస్యకాంక్షలు
ముఖ కవళికల్లో లోకం గౌరవించే గాంభీర్యం కనిపిస్తాయి

అడవిలో
తెల్లగులాబీ ముళ్ళ మీద ఒరిగిపోతున్న ఓ పిట్టగానం పునీతం చేస్తుంది

తీరాలు దాటుకుంటూ వలసవచ్చి
దీపస్తంభానికి గుద్దుకొని మరణించే పక్షుల సహజాతంలా
ఈ ప్రపంచంతో ఏదో అనివార్య అనుబంధం

అయినా సరే!
స్తంభాన్ని కూల్చాలన్న లక్ష్యంతోనే పయనం

SHARE