Home Entertainment This Short Story Of A Guy Who Visited Hyderabad Book Fair Will...

This Short Story Of A Guy Who Visited Hyderabad Book Fair Will Leave You In Splits

0

మట్టిని పోలిన రంగు శోధిస్తే దొరికింది ఇంద్రుని వజ్రాయుధం వీటికి తోడు తెల్లటి అమృతం. ఆహా! దీన్ని తినడం కోసమే వుంకో జన్మఎత్తచు. నేను మాట్లాడేది బిర్యానీ గురుంచి కవిని కదా ఆ మాత్రం రాయకుంటే నా జన్మకు అర్థం ఏముంటుంది. నా పేరు “అభ్యుదయ నవ జ్ఞానశేఖర్ విలయా” పేరు నేను పెట్టుకుందే నా అసలు పేరు ఎవరికి తెలీదు. ఇవాళ Dec 31st, 3 గంటల 43 నిమిషాలకు Hyderabad Book Fairకి బయలుదేరాను. దారిలో నేను రాసిన పుస్తకాలు, కవితలు అన్ని గుర్తుకువచ్చాయి. నేను నా ప్రేయసి కోసం రాసిన 23వ కవిత మధ్య భాగముని గుర్తుచేస్తుకుంటున్న సమయానికి నేను రావాల్సిన చోటు రానే వచ్చింది. ఒక్కసారిగా దారి తప్పి ఏదైనా MALLకి వచ్చాను ఏమో అనుకున్నాను ఆ జనాన్ని చూసి లేదు నేను వచ్చింది సరైన ప్లేస్కే.

Book Stallఇంతమంది బుక్స్ కొనడానికే వచ్చారా? ఒకవేళ నిజంగా అందరూ పుస్తకాలపై ఇంత ప్రేమతో అన్నిటిని చదివేసి జ్ఞానం పెంచేసుకుని ఆలోచించడం మొదలు పడితే ఈ దేశం పరిస్థితి ఏంటో అని బాధపడ్డాను. వెంటనే దూరంలో కాషాయ రంగు చొక్కా కనపడింది ఆ రంగు చూసి Democracy జిందాబాద్ అని అరిచి లోపలికి బయలుదేరాను. లోపలికి ఎంటర్ అవగానే “1001 ways to improve your life by bending your right knee and twisting your middle finger of the left hand” by Dadsheru అనే self-help పుస్తకం కనపడింది. Dadsheru ఇవాళ దేశంలో దేవుడితో సమానం నిత్యం కష్టపడే మనుషులకు ప్రతి నిమిషం విశ్రాంతిలో మునిగి తేలే Dadsheru కష్టం విలువ చెప్తుంటాడు దాని పక్కనే “The Inner Turmoil of the Inner Bladder: Engineering Sucks” by Vittal Rambo అనే పుస్తకం చూసాను ఈ పుస్తకం నేను కూడా ఆ రోజుల్లో చదివాను ఈ రచయిత “Existential Crisis” ని మార్కెటింగ్ చేసిన విధానముని చూస్తే భయమేస్తోంది.

ఇంజనీరింగ్ అంటే ఒక పనికి మాలిన చదువు అని ప్రతి ఒక్కరిలో musicianలు, writerలు, painterలు దాగి ఉంటారు అని పుస్తకాలు రాయడం, seminarలు ఇవ్వడమే ఇతని పని. దీనిని నమ్మి ఎందరో యువకులు జీవితంలో హాయిగా ఉన్న తెలీకుండానే యే మాత్రం self-check చేసుకోకుండా ఉద్యోగాలు వదిలేసి సర్వ నాశనం అయిపోయారు. ఈ రెండు పుస్తకాలు చూడగానే మా నాన్న గుర్తుకువచ్చాడు మా నాన్న సైకిల్ రిపైర్లు చేస్తుంటాడు. నేను మా సైకిల్ షాపులో కూర్చొని Self-Help బుక్ చదువుతున్నాను మా నాన్న శరీరం నుంచి కారే చెమట ద్వారా అర్థమైంది ఆ రోజు ఎండ ఎంత తీవ్రంగా ఉందొ అని. నాకు భయమేసింది ఆ ఎండని చూసి కానీ నాన్న పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉన్నాడు నాకు నా మీద నాకే అసహ్యం వేసింది ఒక్కసారిగా చేతిలో ఉన్న బుక్ని విసిరిపారేసి ఎండలో నాన్నకి పనిలో సహాయం చేయడానికి పోయాను. అప్పటినుంచి self-help బుక్ ముట్టలేదు. వెంటనే పక్క Book Stallకి వెళ్ళాను అక్కడ ఎదురుగా ఒకడు కుడి సంకలో రంగనాయకమ్మ రాసిన ‘రామాయణ విషవృక్షం’ ఎడం సంకలో చాగంటి రాసిన ‘శ్రీమద్రామాయణము’ పెట్టుకొని తిరుగుతున్నాడు వీడి దుంపతేగా He is in for a treat అనుకున్నాను. అలా ప్రతీ stall చూస్తూ పోతున్నాను రకరకాల వ్యక్తులు కనబడుతున్నారు.

ఇద్దరు High Standard Englishలో తెలుగు భాష గొప్పతనం గురుంచి గొడవపడుతున్నారు. ఒకమ్మాయి ప్రతి stallలో రెండు పుస్తకాలు కొంటుంది తెల్లటి scarfతో తన ఎర్రటి పెదాలని చామనచాయ ముక్కుని దాచేసింది కేవలం వెన్నెల నిండిన తన కళ్ళు మాత్రమే కనపడుతున్నాయి తను నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. కాసేపు నేను వచ్చిన పని మర్చిపోయి తన వెంట తిరిగాను అంతే అంతకు మించి ఏమి లేదు. కేశవ్ రెడ్డి పుస్తకాలు చూసాను ఎంతో బాధపడ్డాను మలయాళంలో వచ్చిన Jallikattu ఈ మధ్య తమిళ్లో వచ్చిన Asuran లాంటి కథల్ని రెడ్డి గారు ఎప్పుడో రాసి పడేసారు కానీ మన వాళ్లు మన దగ్గరే ఉన్న అద్భుత కథల జోలికి పోరు ఇదేమి దౌర్భాగ్యమో అనుకున్నాను. అలా అలా తిరుగుతుండగా నేను రాసిన పుస్తకం కనిపించింది “నెత్తురు విడిచిన పాదం” ప్రేమ కవిత్వాలా సంపుటి By అభ్యుదయ నవ జ్ఞానశేఖర్ విలయా. ఈ పుస్తకం ఇంజనీరింగ్ అయిన తరువాత రాసాను నా ప్రియురాలికి పెళ్లి అయిపోయింది బాగా డబ్బున్న వ్యక్తితో ఆ బాధలో ఈ కవిత్వాలు రాసాను. అప్పుడు మేము ఇద్దరం చేసుకున్న పిల్ల ప్రమాణాలు గుర్తుకువచ్చాయి పక పకమని నవ్వాను వెంటనే మనసులో “గతంలో గొంతు నులిమే విరహమే ఈ క్షణం కడుపు ఉబ్బ నవ్విస్తుంది” అని అనుకున్నాను.

మాసిన గడ్డంతో ఒక వ్యక్తి నా పుస్తకంని తీక్షణంగా చూస్తున్నాడు నేను అతనిని చూసి ఇతను ఖచ్చితంగా కవి గాని లేదా ప్రేమ విఫలం అయిన దేవదాసు అయిన అయ్యి ఉండాలి అనుకున్నాను. పుస్తకం చదువుతూ కన్నీరు పెట్టుకున్నాడు, హమ్మయ్య దేవదాసు ఇతడు అని ఫిక్స్ అయ్యాను. అయిన అంతలా నేను ఏమి రాసి ఉంటానా అని తెరిచి చూసాను “తన పెదాల శ్వాస ఇంకా నా పెదాలపై నాట్యమాడుతూనే వుంది కానీ ఇప్పుడు తను వేరొకరి కౌగిలిలో నలుగుతుంటుంది” అని వుంది ఒక్కసారిగా నేనేనా ఇది రాసింది అని ఆశ్చర్య పోయాను, వెంటనే యువకులని ఈ ప్రేమ అనేది ఒక eternal sadness అని తప్పు దారి పట్టించినందుకు బాధపడ్డాను. ఈ పుస్తకం తరువాత చాలానే రాసాను చాలా వరకు ప్రేమ విరహం పైనే నేనేంటి అందరూ వాటి పైనే రాస్తాం ప్రపంచం చూడకుండా ఒక గదిలో కూర్చొని మాదే పెద్ద బాధ అని తెగ హడావిడి చేస్తాం ఈ రోజుల్లో ఇది మరీ fashion అయిపోయింది. ఒకసారి ఒక రైతుని కలిశాను అతడిని నా ప్రేమ కవిత్వాలు చదవమని చెప్పాను “అన్నం మెతుకు కోసం పోరాడే వాడికి ప్రేయసి గురుంచి కవిత్వం రాసే సమయం ఎక్కడిది బాబూ, ఆకలి రెక్కలు చేసే చప్పుడు ముందు మీ విరహపు కన్నీటి చుక్కలు తుచ్చమ్” అని ఏదో చెప్పి వెళ్ళిపోయాడు నాకు చెప్పుతో కొట్టినట్టు అనిపించింది అప్పటి నుంచి ప్రేమపై కవిత్వాలు రాయడం మానేసాను. పక్కనే ఈ మధ్యే నేను రాసిన “హిందుత్వ అదరహో, మిగిలినవన్నీ బెదరహో” అనే పుస్తకంని ఎర్ర చొక్కా వేసుకున్న ఒక Comrade చదువుతున్నాడు.

ఈ పుస్తకం రిలీజ్ అయిన వారంకి కొంతమంది ఇంటికి వచ్చారు చచ్చాను రా దేవుడా అనుకున్నాను వాళ్లు కాషాయ రంగు టోపి ఒక చిన్న లాటి బెత్తడు నిక్కారు నాకిచ్చి జై శ్రీ రాం అని నాకు సన్మానం చేశారు “Ignorance is bliss” అన్న మాట విలువ నాకు ఆ రోజు తెల్సింది. కానీ ఇక్కడ comrade ఆ పుస్తకాన్ని ఉరిమి ఉరిమి చూస్తున్నాడు నాకు ఎందుకో అనుమానం వచ్చి అక్కడ నుంచి పారిపోయాను. దూరం నుంచి ఎర్రటి చొక్కా ధరించిన comradeని చూసాను ఒక్కసారిగా అది యెరూపో, నలుపు, తెలుపో, కాశయమో అర్థం కాలేదు “ఎరుపు అసిత్త్వం కోల్పోయి చాలా కాలమే అయింది” అని అనుకున్నాను. Don’t judge a book by its cover అనే sentence కూడా బుర్రలో జివ్వుమని మెరిసింది.అన్ని stallలు తిరిగేసాను ఎందుకో suddenగా అమ్మ గుర్తుకు వచ్చింది.

అమ్మ గుర్తుకురావడం ఏంటి? ఆమెని చూసి ఎంత కాలం అయిందో కూడా గుర్తులేదు. దూరంలో ఒక బుక్ స్టాల్ ఉంది అక్కడ జనాలు లేనట్టు అనిపించింది అక్కడికి వెళ్లి చూసాను ఆ స్టాల్ పేరు “అమ్మ stall” అక్కడ జనాలు లేరు పుస్తకాలు లేవు ఒక తెల్లటి కాగితం పై “అమ్మలు అంటే కవులకు ఎందుకు అంత లోకువ మేము మీ అక్షరానికి కూడా నోచుకోలేమా? దమ్ముంటే మా గురుంచి రాయండి” అని రాసి ఉంది. నాకు అవమానం జరిగినట్టు అనిపించింది వెంటనే అమ్మ గురుంచి రాసి పద్దేడం అనుకున్నాను. అయిన అమ్మల గురుంచి ఏమి రాస్తాము వాళ్ళకి ఒక individuality వుండదు కలలు వుండవు. వెంటనే మా అమ్మ గుర్తుకువచ్చింది ఆమెని మించిన boring మనిషి ఈ ప్రపంచంలో ఇంకొకరు వుండరు ఏమో? పొద్దునే లేవడం ఇళ్లు చిమ్మడం తల స్నానం చేసి దేవుడికి మొక్కడం మాకు వండి పెట్టడం తరువాత సీరియళ్లు చూస్తూ రోజును గడపడడం ఇది ఒక దినచర్యేనా. Feminism వంటివి మా అమ్మకి తెలివు నాన్నతో గోడవైతే ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఎప్పుడు ఆయననే అంటిపెట్టుకొని ఉంటుంది.

ఆమెది పల్లెటూరు చిన్నప్పుడు మా school దగ్గరికి వచ్చి “మా సిన్నోడికి ఈ నాస్త పోట్లము ఇవ్వండి సిన్నోడు ఆకలికి తట్టుకోలేడు” అనేది అది విన్న నా స్నేహితులు “సిన్నోడా సిన్నోడా పండు తింటావా ఆకలి వేస్తోందా” అని వెక్కిరించేవారు నాకు పట్టరాని కోపం వచ్చేది ఇంటికి వెళ్లి ఒకసారి Mummy అని ఇంగిలిపీసులో నువ్వు schoolకి రాకు నీ వల్ల అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అని అరిచాను ఆమె ఇవేమీ పట్టించుకోకుండా “సిన్నోడా తిందువు రా” అని అనేది. ఏడో క్లాస్ దాకే అమ్మ చదువుకుంది “బెండకాయ తినురా సిన్నోడా ఎక్కాలు బాగా వస్తాయి” అని నస పెట్టేది. పుస్తకాలు చదువు అంటే చదివేది కాదు ఎప్పుడు ఇంటి పని మా పనితోనే ఆమె జీవితం సరిపోయింది. ఇంతటి బోరింగ్ lifestyle గురుంచి ఏమి రాయగలను అని ఆలోచించాను. ఆ తెల్లటి కాగితం మడిచి జేబులో పెట్టుకొని “అమ్మ stall” ని ఒకసారి చూసి ఏమి రాద్దామా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా రూమ్ కి వచ్చేసాను.

“అమ్మంటే ఆకాశం” అని రాయడం మొదలుపెట్టాను వెంటనే రాసిన వాక్యాన్ని కొట్టేసాను అప్పుడుయెప్పుడో ప్రియురాలిని ఆకాశం అంటూ వర్ణించిన కవిత్వం గుర్తుకువచ్చింది. అయ్యో! ఆకాశం అంత ప్రియురాలికె ఇచ్చేసెనే అని బాధపడ్డాను. ధైర్యం అంటూ రాయడం మొదలుపెట్టాను అయిన అమ్మకి ధైర్యం ఎక్కడ ఏడ్చి చచ్చింది రోడ్డు కూడా పక్కన ఎవరు లేకుంటే క్రాస్ చేయలేదు. ఏదో జ్ఞాపకం వచ్చింది అప్పుడు నా వయసు 10 – 12 ఏళ్ళు ఉండచ్చు నాకు ఏదో చచ్చే రోగం వచ్చింది అప్పుడు అమ్మ 176 గుడి మెట్లు మోకాళ్లపై నెత్తురు కారుతున్న నీళ్లు కూడా ముట్టకుండా ఎక్కింది వెంటనే నాకు బాగైపోయింది వయసు వచ్చాక నీకేమైన పిచ్చ ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా నమ్ముతావు అని వెక్కిరించే వాడిని. దేవుడు దయ కన్నా డాక్టర్ వైద్యం కన్నా అమ్మ నమ్మకం బిడ్డకు ప్రాణం పొస్తది ఏమో అని అనుకున్న మనసులో. ఒక్కసారిగా బిడ్డలు అందరూ తల్లుల రక్తం తాగి బతుకుతారు ఏమో అనిపించింది. ఈ సారి భయమనే పదం రాసాను నాకు కుక్కలు అంటే భయం(ఇప్పటికి కూడా) అమ్మకి చచ్చేంత భయం చిన్నపుడు ఎప్పుడో స్కూల్ నుంచి వస్తుంటే ఒక్కసారిగా ఒక కుక్కల ముఠా సుమారు ఒక 6 ఉండచ్చు నన్ను తరుముకున్నాయి ఆప్పుడు అమ్మ ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు అమ్మ భయస్తురాలైన నన్ను ఎత్తుకొని కుక్కల్ని తరిమేసింది అప్పుడు అమ్మ కింద పడిపోయింది చీర కాస్త చినిగింది మొఖంపై దెబ్బ తగిలింది ఇంకా ఆ ఘాటు ఉండచ్చు? నాకు మాత్రం యే దెబ్బ తగల్లేదు.

“సిన్నోడా నీకు ఏమి కాలేదు కదా?” అని రక్తం కారుతున్న మొఖంతో అడిగింది. ఇదంతా నీ వల్లే అంటూ అమ్మ కౌగిలిని విడిపించుకొని ఏడుస్తూ పరిగెత్తేసాను. దూరం అని పేపర్ పై రాసాను నా ఇంజనీరింగ్ అపోయాక ప్రేమ విఫలం కావడంతో ఈ బంధాలు ఇవ్వని సంకెళ్లు అనే భ్రమలో soul-searching tripకి మా నాన్న ఇచ్చినా డబ్బులతో బయలుదేరాను అప్పుడు వెళ్లిన నేను ఇప్పటికి ఇంటికి పోలేదు ఎప్పుడో నాన్న చనిపోతే వెళ్ళాను అంతే. ఎవడో వెధవ చెప్పాడు రచయిత అంటే చీకటిలో ఒంటరిగా కూర్చొని రాయాలి అని అది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది వాడిని రాయితో కొట్టాలి అని. సరే, మనము ఏదో తెలుసుకోడానికి ఈ వెధవ soul-searching tripలకి పోతుంటాం కానీ అమ్మకి ఒక soul ఉంటది కదా sorry చిన్నప్పుడు పాలు తాగేటప్పుడే వాళ్ల soulని కూడా తాగేస్తాము ఏమో మనము అందుకేనేమో అమ్మలకి పిల్లలు తప్ప వేరే లోకం ఉండదు. మనలని బాగా చూసుకోడమే వాళ్ల soul-searching ఏమో?

అమ్మ గురుంచి ఏమి రాయలేకపోయాను కానీ ఎందుకో తెలీదు అమ్మతో మాట్లాడాలి అనిపించింది ఫోన్ చేద్దామా అనుకున్నాను…అసలు అమ్మ ఇప్పుడు ఎలా ఉందో అని తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఫోన్ తీసాను, ఎప్పుడు చివరిగా అమ్మతో మాట్లాడను అని కూడా సరిగ్గా గుర్తులేదు. Happy new year 2020 అంటూ బయట అరుపులు. Time 12 అయినట్టుంది. అమ్మకి కాల్ చేసాను తను ఫోన్ ఎత్తలేదు, నిద్రపోతుంటుందిలే అని అనుకున్నాను కానీ ఎందుకో భయమేసింది వెంటనే కాల్ చేసాను మళ్ళీ ఎత్తలేదు మళ్ళీ చేసాను ఈ సారి కట్ అయిపోయింది మళ్ళీ చేసాను ఫోన్ మొగుతూనే వుంది ఇక్కడ నాకు చచ్చేంత భయమేస్తోంది ఫోన్ లిఫ్ట్ చేశారు అటు పక్క “హలో” అని నీరసంగా అన్నారు. అమ్మ గొంతు అని నాకు అర్ధమయ్యింది. ఏమి మాట్లాడాలో నాకు తెలీలేదు చిన్నగా ఏదో నసిగను వెంటనే అమ్మ “సిన్నోడా” అంది నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నేను ఏమి మాట్లాడలేదు “సిన్నోడా నువ్వేనా” అని అంది. మోనంగానే ఉన్నాను నేను. “సిన్నోడా తిన్నావా” అని అమ్మ ప్రేమతో అంది. ఒక్కసారిగా “సిన్నోడా తిన్నావా” అనే శబ్దం ముందు ప్రపంచం నిశ్శబ్దం అయిపోయింది. ఒక్క మాట రాసాను “అమ్మను మించి అణిచివెయ్య పడ్డ జాతి ఎక్కడ ఉంటుంది?”

Exit mobile version