This Write Up About ‘Viswa Nata Chakravarthi S.V. Ranga Rao’ Shows Why His Legacy Is Irreplaceable

తన గదాయుధంతో అభిమన్యుణ్ణి మూర్ఛపోయేలా చేసి వికటాట్టహాసం చేస్తున్నాడు ఘటోత్కచుడు – ఎక్కడ రాక్షసుడు చెలరేగిపోతాడోనని సుభద్రాదేవి విల్లు తీసుకుని …
“అఖిలరాక్షసమంత్రతంత్రాతిశయమునణచు శ్రీ కృష్ణుసోదరినగుదునేనీ….దివ్యశస్త్రాస్త్రమహిమలతేజరిల్లు అనఘు అర్జున పత్నినే అగుదునేనీ…”
అని పద్యం అందుకుంటుంది …

“శ్రీ కృష్ణుసోదరినగుదునేనీ… ” అనగానే వికటాట్టహాసం నుంచి విస్మయానికి …”…అర్జున పత్నినే అగుదునేనీ” అనగానే విస్మయం నుంచి వినయవిధేయతలతో కూడిన పశ్చాత్తాపంతో పాటు కించిత్ భయం కూడా చూపిస్తూ రెప్పపాటు వ్యవధిలో ముఖకవళికలు మార్చగలిగిన నేర్పు కేవలం ఆయనకే సొంతం …

సదాజపుడి వేషంలో ఉన్న అంజి గాడి మాయమాటలు నమ్మి మాయాశక్తులన్నీ నిక్షిప్తమై ఉన్న తన గడ్డాన్ని తీసేస్తాడు నేపాల మాంత్రికుడు… ‘బుల్ బుల్’ కోసం ప్రేమికుడిలా మారిన మాంత్రికుడు గదిలోకి వెళుతూ తన నడకలో కూడా చూపిన నట వైదుష్యం ఆయన ప్రత్యేకం …

1 Sv Ranga Raoతిరునాళ్లలో తప్పిపోయిన తన కూతురి పేరు మీద నడుపుతున్న పాఠశాల, సరైన అధ్యాపకులు లేక దారితప్పుతుంటుంది. భార్యాభర్తలైన ఇద్దరు బీఏలు కావాలని ప్రకటన ఇస్తాడు అప్పాపురం జమిందారు గోపాలం – ‘అదే’ … గొప్ప వినోదాత్మక చిత్రం ‘మిస్సమ్మ’లో – రెండక్షరాల పదాన్ని సందర్భానికి తగ్గట్టుగా రకరకాలుగా పలికించడం ఆయన నట వైవిధ్యానికి ఉన్న కోటి ఉపమానాల్లో ఒకటి … అదే అదే … ‘అదే’ అనే రెండక్షరాల పదం …

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో…ఎన్నెన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో రకరకాల పాత్రల్లో తన నటనతో సినిమా ప్రేక్షకులను కనువిందు చేసిన కళాకారుడు, ఆజానుబాహుడు శ్రీ సామర్ల వెంకట రంగారావు అలియాస్ ఎస్వీఆర్ ఉరఫ్ ‘మహానటుడు’

2 Sv Ranga Raoహిరణ్యకశపుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, ఘటోత్కచుడు, నరకాసురుడు, కీచకుడు, భీష్ముడు, హరిశ్చంద్రుడు – ఇలా ఎస్వీఆర్ ఏ పాత్ర చేసినా, అందులో ఒదిగిపోయే ఆయన ఆహార్యం, ఆ వాగ్దాటి, సంభాషణల ఉచ్ఛారణలో వేగంతో పాటు ఉండే స్పష్టత, పదాలు పలకడంలో చూపించే ఆ విరుపులు – ఇలా ప్రతీ విషయంలోనూ శ్రద్ధ తీసుకుని ఆయన చేసే నట విన్యాసం “గగన పాతాళ లోకములలోని సమస్త ‘నట’కోటులు నాకె మ్రొక్కవలదే” అన్నట్టు సాగుతుంది…

వెండితెరపై ఆయన కీచకుడిగా అరగంట పాటు చేసిన నట విజృంభణ ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఐదు సార్లు రాష్ట్రపతి అవార్డు, ఉత్తమ నటుడిగానే కాక సొంత నిర్మాణంలో చేసిన సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా సైతం ‘నంది’ అవార్డులు అందుకున్న బహుముఖప్రజ్ఞాశాలి ఎస్వీఆర్.

3 Sv Ranga Raoనేను పుట్టడానికి పదేళ్ల ముందే కాలం చేసిన ‘విశ్వనటచక్రవర్తి’ నట విశిష్టత గురించి చెప్పడానికి, నాకు తెలిసిన తెలుగు భాష కాదు కదా, అక్షరమాలలోని అక్షరాలన్నిటితో పదాభిషేకం చేసినా కూడా వర్ణింపతరం కాదు …

నేడు భారతీయ సినిమాలో కొత్త ఒరవడి ‘బయోపిక్’లది – పొరబాటున ఎస్వీఆర్ మీద బయోపిక్ తీయాలనే దురాలోచన ఏ నిర్మాత, దర్శకులకు అయినా వచ్చి, ఎవరైనా తమ దురదృష్టం కొద్దీ ఎస్వీఆర్ లాగా నటించడానికి ముందుకొస్తే …

4 Sv Ranga Raoమొదటి రోజు మేకప్ వేసుకుని అద్దంలో చూసుకోగానే ….
అద్దంలో వారికి కనిపించేది వారు కాదు …

ఆరడుగుల విగ్రహం …. బిగ్గరగా పరిహసిస్తూ …

“భలే డింభకా భలే …
సాహసివి రా …
చూస్తివిరా ‘పాతాళ భైరవి’ ?!,
విన్నావా ‘మాయాబజార్’ గురించి …
చిన్నపుడు మీ పెద్దలు చెప్పలేదా ‘నర్తనశాల’ కథ …
తెలియదా ‘పండంటి కాపురం’ సంగతి …
నా లాగా నటించడానికే సిద్దము అయినావురా డింగరి !!

హా … శిష్ట, దుష్ట, క్లిష్ట పాత్రల్లో నన్ను చూసిన వారెవరైనా ఈ సాహసము చేసేదరా ?!
మారుమ్రోగే నా స్వరాన్ని విన్న తెలుగు నటులెవరైనా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టెదరా ?!
నా లాగా నటించవలెనన్న నీ ఆలోచనకు నా ఆశీర్వాదం ఉండునేమో కానీ అవమాన భారంతో రేపు ఈ అద్దం ముందు నువ్వు నిలబడితే మాత్రం నీకు గుర్తుకు వచ్చేది మళ్ళీ నా ‘డైలాగే’ రా ఢింభకా !! ”

అనేయగలడు….

మరో వందేళ్ళైనా..

హై హై నాయకా…

ఎస్వీఆర్ జయంతి సందర్భంగా…

– రావూరి

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR