అందంగా ఉండాలని కోరుకొని అమ్మాయిలు ఉండరు. అందంగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ వద్దనుకున్నా ముఖంపై మచ్చలు, మొటిమలు వచ్చి వేధిస్తూనే ఉంటాయి. అలా వచ్చేదే మంగు. ఆ మంగు కాస్త ముక్కు మీద నుండి బుగ్గల వరుకు అంత వ్యాపిస్తుంది. చర్మంపై అక్కడక్కడా ఏర్పడే నల్ల మచ్చలు లేదా ప్యాచుల్లాంటి మచ్చల్ని హైపర్ పిగ్మెంటేషన్ (మంగు మచ్చలు) అంటారు.
చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి రంగునిస్తుంది. అయితే ఇది చర్మంపై అక్కడక్కడా మరీ ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇదనే కాదు.. ఈ మంగు మచ్చలు ఏర్పడడానికి మన జీవనశైలి కూడా ఓ రకంగా కారణమే అంటున్నారు నిపుణులు. మంగు శరీర తత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైన కారణాల వల్ల మంగు వస్తుంది.
జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. కొంతమందికి ఈ మంగు వంశపారంపర్యంగా, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ మంగు వస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ చికిత్సలో భాగంగా వాడే మందులు, Non-Steroidal Anti-Inflammatory Drugs (NSAIDs), Tetracyclines, Psychotropic Drugs.. వంటి మందులు ఈ సమస్యకు కారణమవుతాయట.
గర్భిణుల్లో హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగా మెలనిన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది కూడా పిగ్మెంటేషన్‌కి కారణమవుతుంది. అయితే ఈ మంగు తగ్గటానికి ఎంతో మంది డాక్టర్లను కలిసినప్పటికీ తగ్గదు. అయితే, ఈ మచ్చలను చూసి మీరు కుంగిపోవద్దు. వీటిని తగ్గించేందుకు కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి.
యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లు.. సమపాళ్లలో తీసుకొని.. ఈ మిశ్రమాన్ని దూదితో నల్ల మచ్చలున్న చోట అద్దాలి. రెండు మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది.
కలబందలో ఉండే అలోయిన్ అనే పదార్థం నల్ల మచ్చల సమస్యను తగ్గిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట కలబంద గుజ్జు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా సమస్య తగ్గే వరకూ రోజూ చేయాల్సి ఉంటుంది.
వీలైనంత వరకు ఎండ బాగా ఉన్న పగటి సమయంలో బయటికి వెళ్లకపోవడమే మంచిది. ఎండలో బయటకు వెళితే SPF-30 ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ రాసుకోవడం తప్పనిసరి. ముఖంపై సూర్యరశ్మి పడకుండా హ్యాట్స్, గొడుగు.. వంటివి వాడాలి. అలాగే బయటికి వెళ్లినప్పుడు చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం కొంతవరకు మంచిది. చర్మానికి పడని మందులు మానేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
ఎర్ర ఉల్లిపాయ రసంలో మంగు మచ్చల్ని తగ్గించే గుణాలున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి దీన్ని మచ్చలపై అప్లై చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఉపయోగించి తయారు చేసిన క్రీమ్స్ కూడా బయట దొరుకుతాయి. నిపుణుల సలహా మేరకు వాటిని కూడా ఉపయోగించచ్చు. వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్‌ను మచ్చలపై కాసేపు రుద్దడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.
గేదె పాలను చిలికి తీసిన వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి గేదె పాలల్లో నూరి రాస్తుంటే మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది.
పాలలో కాటన్ బాల్‌ని ముంచి.. దాంతో నల్ల మచ్చలున్న చోట రుద్దుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే త్వరలోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులోని లాక్టికామ్లం మచ్చల్ని తగ్గించడంలో సహకరిస్తుంది. పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.