Home Unknown facts ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి?

ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి?

0

భీష్ముడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ మహిమ విన్న తరువాత ధర్మరాజు మహదానందం పొందాడు. అయినా ధర్మరాజుకు సందేహాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందుకే ధర్మరాజు భీష్ముడితో ” పితామహా పూజించడానికి, నమస్కరించడానికి అర్హులు ఎవరు? ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి? ఎవరికి హాని కలిగిస్తే మానవులకు హాని, అశుభములు కలుగుతాయి అని అడిగాడు.

Bheeshmaభీష్ముడు ధర్మనందనా! ఈ లోకములో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే. బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు తప్పవు. బ్రాహ్మణులు సంతోషించిన సకల శుభములు కలుగుట తధ్యము. బ్రాహ్మణులు ఈ లోకముకు ఆధారము. బ్రాహ్మణులు ధర్మముకు వారధిలాంటి వారు. సకలశాస్త్రములు వేదవేదాంగములు ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే. విప్రులకు తపస్సు, సత్యవాక్కు ధనముతో సమానము. బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనము పెట్టిన వాడి పాపములు పటాపంచలు అవుతాయి. దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు బాలుడైనా పూజనీయుడే. ఇక వృద్ధ బ్రాహ్మణుని విషయము చెప్పనవసరం లేదు అని భీష్ముడు చెప్పాడు.

ధర్మరాజు, పితామహా! బ్రాహ్మణులను గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా ,బ్రాహ్మణులను పూజించిన వారికి కలుగు శుభములు ఏంటి? వారిని ఇంతగా పూజించడానికి బ్రాహ్మణులలో ఉన్న విశిష్ట గుణాలు ఏవి అని అడిగాడు. ధర్మనందనా నీ సందేహానికి సమాధానంగా పవనార్జున సంవాదం వినిపిస్తాను.

కార్తవీర్యార్జునుడు వేయి చేతులు కలిగిన మహావీరుడు. అతడు తనకు కలిగిన బలగర్వము వలన ఈ ముల్లోకములలో నాకు సాటి బలవంతుడు లేడు అని బిగ్గరగా పలికాడు. అది విన్న ఒక భూతము బదులుగా ఓరాజా నీవు ఇలా పలుకరాదు. లోకములకన్నా భూసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా అని పలికింది.

అందుకు కార్తవీర్యార్జునుడు, బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు అలాంటి బ్రాహ్మణులు రాజులకంటే అధికులు ఎలా అవుతారు. నాకు అనుగ్రహం వస్తే బ్రాహ్మణులను ఆదరిస్తాను. కోపం వస్తే అందరినీ దండిస్తాను అని చెప్పాడు. ఈ మాటలకు ఆ భూతము మారుపలుకక వెళ్ళి పోయింది.

ఆ సమయంలో వాయుదేవుడు ఓ రాజా నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని అనుకుంటున్నావు. కాని ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని తెలుసుకో. ముల్లోకాలలో పూజనీయులు బ్రాహ్మణులే. అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమ ముని శాపం పొంద లేదా ,అగస్త్యుడు సముద్రమును ఔపోసన పట్ట లేదా, భృగ మహర్హి అగ్ని దేవుడిని శపించ లేదా అన్నాడు. ఆ మాటలకు కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు.

ఇంతచెప్పినా కార్తవవీర్యార్జునుడు అంగీకరించక మౌనం వహించాడు. అప్పుడు వాయు దేవుడు తిరిగి మహారాజా అంతెందుకు నీ గురువు బ్రాహ్మణుడు అయిన దత్తాత్రేయుడి మహిమవలెనే కదా నీవింత గొప్పవాడివి అయి ఇంతటి మహా బలపరాక్రమాలు సంపాదించి రాజులలో మాణిక్యములా వెలుగుతున్నావు. నీవే కాదు మానవులు, దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమవలెనే మనుగడ సాగిస్తున్నారు. కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యములను పొందు అన్నాడు. కార్తవవీర్యార్జునుడి గర్వము అంతటితో అణిగి పోయి బ్రాహ్మణుల గొప్పతనము అంగీకరించి బ్రాహ్మణులను పూజించి సుఖములను పొందాడు. కనుక ధర్మరాజా నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు అన్నాడు భీష్ముడు.

 

Exit mobile version