పరమశివుడు వెలసిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి గిరిజనుల నమ్మకం. కొండల నడుమ వెలసిన ఈ స్వామి వారి ఆలయం దగ్గరలో ఉన్న జలపాతం అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండలం, ఎర్రగొండపాలెం నుండి 50 కి.మీ. దూరంలో శ్రీ పాలంకేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ సుమారు 100 అడుగుల ఎత్తుగల కొండ పైభాగం నుండి క్రింద ఉన్న గుండంలోకి సెలయేరులా జలపాతం దూకుతుంటే “ఆకాశగంగా శివుని నెత్తిన” పడుతున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రకృతి దృశ్యం చుసిన భక్తులు ఆనంద పారవశ్యులవుతారు.
ఈ ఆలయం ఒక పెద్ద కొండ చరియ క్రింద ఒదిగి ఉంది. ఈ కొండ చరియ క్రింద సుమారు నాలుగు వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఉంది. సహజసిద్దంగా ఏర్పడిన కొండచరియ ఈ ఆలయంలో ప్రతిష్టించబడి ఉన్న వీరభద్రస్వామి ప్రసక్తి స్కందపురాణంలో ప్రస్తావించబడింది.
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ప్రకృతి గుండంలో స్నానం ఆచరించి మొదట పుట్టలమ్మను పూజిస్తారు. ఈ ప్రాంతం గిరిజన కుటుంబాలు కాళికాదేవి ని పుట్టలమ్మ అనే పేరుతో కొలుస్తారు. సంతానం లేని స్త్రీ పురుషులు ఉపవాస దీక్షతో కొండ చరియా నుండి పంచలింగాలపై పడు నీటి బింధువులని దోసిలిపట్టి ఆ దోసిలిలో నీటి బిందువులను పడితే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల గట్టి నమ్మకం.
ప్రతి సంవత్సరం తొలిఏకాదశి, ద్వాదశి రోజులలో జరిగే తిరునాళ్ళకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. వీరు అడవిలో 8 కి.మీ. దూరం నడిచి ఈ ఆలయాన్ని చేరుకుంటారు. భక్తులు నల్లమల అడవుల గుండా నడిచి ఒకరోజు ముందు కృష్ణానది తీరమున అలాటం కోటకు చేరుకొని ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజైన ఏకాదశి రోజు కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించి కృష్ణానది తీరం వెంట 8 కి.మీ. దూరం నడిచి పుణ్యధామమైన పాలంకతీర్థం చేరుకొని ఇచట కొలువై ఉన్న స్వామివారిని దర్శిస్తారు.