ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఐదుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ సమస్య స్త్రీల నుండి వారి సంతానానికి కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు స్వతహాగానే ఇంటి పనులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లేవారైతే బయట పనులతో కూడా ఒత్తిడికి గురవుతారు. దాంతో పాటు రుతుచక్రం, గర్భధారణ.. వంటి కారణాల వల్ల కూడా వారిలో హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేదా హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోవడం. మన ఆహార అలవాట్లలో సరైన మార్పులు చేసుకుని మందులు సరిగ్గా తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. అయితే దానికంటే ముందు థైరాయిడ్ ఎన్ని రకాలుగా బాధపెడుతుందో తెలుసుకోవాలి.
మన గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి థైరాయిడ్ గ్రంథి (గ్లాండ్). ఇది మన శరీరం మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్లు మన శరీర మెటబాలిక్ యాక్టివిటీలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇవి మన శరీరంలోని వివిధ కణాలు ఎంత శక్తిని ఉపయోగించాలో కూడా పర్యవేక్షిస్తుంటాయి.
థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను బట్టి థైరాయిడ్ లో ప్రధానంగా 5దు రకాలు:-
- హైపోథైరాయిడిజం
- హైపర్ థైరాయిడిజం
- గాయిటర్
- థైరాయిడ్ నోడ్యూల్స్
- థైరాయిడ్ క్యాన్సర్
ఈ ఐదులో హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం చాలా సాధారణం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది హైపో థైరాయిడ్. దీని వలన శరీరానికి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు అందవు, ఫలితంగా జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు తిన్న ఆహారం అంత త్వరగా ఎనర్జీగా మారదు. దానివల్ల బరువు ఎక్కువగా పెరిగిపోతారు. దానితోపాటు అలసట, నీరసం తోడవుతాయి.
హైపోథైరాయిడిజం ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం:
- అయోడైజ్డ్ ఉప్పు
- అవిసె గింజలు
- చిక్కుళ్ళు
- ఆలివ్ నూనె
- గుడ్లు
- పాలు
- పీచు పదార్ధాలు ఉన్న ఆహరం
- చేపలు
- నీరు
ఇక రెండవది హైపర్ థైరాయిడ్. థైరాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ సమస్యతో బాధపడేవారు బరువు తగ్గిపోతారు. ఈ సమస్య ఉన్నవారిలో నీరసంగా ఉండటం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు వాపు కనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చిరాగ్గా ఉంటుంది. చెమట పట్టడం, బరువు తగ్గడం, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి.
హైపర్ థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహరం:
బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్లు, కాలీఫ్లవర్ మరియు ముల్లంగి వంటి ఆకుపచ్చ కూరగాయలను తినొచ్చు. సలాడ్లు ముఖ్యంగా టమోటాలు, దోసకాయలు మరియు క్యాప్సికమ్ తో చేసిన సలాడ్లు తినవచ్చు. కాలానుగుణ పండ్లను తినడం మంచిది. ఆయా సీజన్లలో లభించే పండ్లు అంటే మావిడి, జామకాయలు స్ట్రాబెర్రీలు, బేరి మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో అధిక థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధించే పదార్థాలు ఉంటాయి. ఇంకా దానిమ్మ, ఆపిల్, నారింజ మరియు చెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కువగా తినాలి. అవోకాడోలో పుష్కలంగా ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, సెలీనియం మరియు జింక్ ఉన్నాయి. వీటితో పాటు పిస్తా, బాదం వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి.