11 Unique Qualities That One Should Adapt From Lord Rama’s Inspiring Life Journey

0
975

శ్రీ రామ రామ రామేతి… రమే రామే మనోరమే..!

శ్రీ రాముడు విళంబి నామ సంవత్సరం చైత్రశుద్ధి నవమి రోజు జన్మించాడని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇదే రోజున రాముల వారి కళ్యాణం కూడా జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆనవాయితీని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంతో పాటు మిగతా అన్ని ఆలయాలు పాటిస్తున్నాయి. రాముని కళ్యాణం.. జగత్ కళ్యాణం అని మన పెద్దలు చెబుతుంటారు. ఆ రోజు ఈ ప్రపంచాన్ని పాలించే మన తల్లిదండ్రులు లాంటి సీతారాములు ఒక్కటై సృష్టి మనుగడకు కారణం అవుతారని అంటారు. అలాంటి పవిత్ర కార్యం ప్రతి సంవత్సరం రామనవమికి దేశంలోని అన్ని రామాలయాల్లో జరుగుతోంది. కానీ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల.. లాక్ డౌన్ కారణంగా ఆ అదృష్టాన్ని మనం ఈ రోజు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం.

1 Sri Rama Navamiతల్లిదండ్రులు, అత్తమామల దీవెనలు.. బంధువుల కలయిక.. స్నేహితుల సందడి.. చుట్టాల మర్యాదల మధ్య ఒక పురుషుడు, స్త్రీ ఒక్కటై భార్యభర్తలుగా బాధ్యతలు తీసుకునే పుణ్యకార్యం పెళ్లి అంటే. అలాగే సీతారాముల కళ్యాణం కూడా. తండ్రి మాట దాటని, తల్లిని దైవంగా భావించే కొడుకులా.. తమ్ముళ్లని ప్రేమించే అన్నగా.. భార్యకి మంచి భర్తగా.. ప్రజలకు అసలైన పాలకుడిగా.. మాట ఇచ్చి తప్పని స్నేహితుడిగా రాముడు ఒక సంపూర్ణ రూపం. భగవంతుడు మనిషి రూపంలో ఈ భూమి పైకి వచ్చిన అవతారమే శ్రీరాముడి పుట్టుక. మనిషిగా బతికాడు.. మనిషిలా బాధలు అనుభవించాడు.. మనిషి ఎలా బతకాలో చూపించి మహనీయుడు అయ్యాడు. భగవంతుడే మానవ జన్మ ఎత్తి.. ఆ జన్మకు ఏ విధంగా ఒక సార్థకత వస్తుందో నిరూపించి చూపించాడు. ఒక రాజుగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి రామన్న రాజ్యం అంటే ఎలా ఉంటుందో ఈ రోజుకీ మనం మాట్లాడుకునేలా చేశాడు.

2 Sri Rama Navamiమరి.. అలాంటి శ్రీ రాముడిని విగ్రహంగా.. ఫోటోలో దేవుడు కదా అని మొక్కి వదిలేద్దామా..! రామాయణంలో రాముడి పాత్ర గురించి మనం ఏం తెలుసుకుందాం..? ఏ ఏ గుణాలు మనం అలవరుచుకుందాం..? ఏ విధంగా మన జీవితంలో ఆ రాముడికి భాగం ఇద్దాం..?
ఈ విధంగా ఆలోచిస్తే.. ఎన్నో ఎన్నెన్నో మనం ఆయన నుంచి నేర్చుకోవచ్చు.

* ఒక తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు సరిపోడా..! రాముడికి తండ్రి చెప్పింది పాటించడం, ఎదురు ప్రశ్నలు వేయకుండా నడుచుకోవడమే తెలుసు. ఈ రోజుల్లో ఎంత మంది అలా ఉండగలుగుతున్నాం?
* తెల్లారితే అయోధ్యకి అధిపతి అయ్యే అవకాశం ఉన్న సమయంలో తల్లి కైకేయి.. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడు వనవాసం చేయాలని చెప్పగానే ఏ మాత్రం ఆశలు కోల్పోకుండా.. కోపం చూపించకుండా చెప్పినది చేయడానికి పాటించాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి.

3 Sri Rama Navami
* ఒకే మాట.. ఒకే బాణం.. అదే విధంగా ఒకే భార్య.. రాముడు ఏకపత్నీవ్రతుడు అని మనం రాముడిని కొలుస్తున్నాం. పెళ్లి అనే బంధానికి విలువ ఇచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవడం ఈ రోజు సమాజంలో ఎక్కడ చూస్తున్నాం. అలాంటి వాళ్లందరికి రాముడు ఆదర్శప్రాయుడే.
* ఒక రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. తన గొప్పతనం ఎంతటిదో ఎదుటి వాళ్ళు తెలుసుకుని మెలగాలని.. ఒక రాజు తన స్థాయికి తగ్గ వారితోనే స్నేహం చేయాలని ఉంటుంది. కానీ.. రాముడు కులం, మతం చూడలేదు.. వేటగాడు, పడవ నడుపుకునే గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. తన స్నేహితుడు అని చెప్పుకున్నాడు. అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు.
* స్నేహితుడు సుగ్రీవుడి కష్టాలను పంచుకున్నాడు. సహాయం చేశాడు. సుగ్రీవుడి భార్యని ఎత్తుకెళ్ళి తనని బాధ పెడుతున్న అన్న వాలి బారి నుంచి రక్షించాడు. చెట్టు చాటు నుంచి వాలిపై బాణం వేసి సుగ్రీవుడి బాధలు పోగొట్టాడు. దీనిపై ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఒక రాజు అయి ఉండి.. పిరికివాడిలా చెట్టు చాటు నుంచి వాలిని చంపడం ఏంటని..! కానీ వేటాడేటప్పుడు చెట్టు చాటు నుంచే జంతువుని చంపాలి… అదే ఇక్కడ రాముడు పాటించిన నియమం.

4 Sri Rama Navami
* రాముడు దేవుడు లాగే బతికాడు అని ఎలా చెప్తాం..! సీతమ్మ బంగారు లేడి చూపించి అది కావాలి అనగానే.. ఏమీ ఆలోచించకుండా పరిగెత్తాడు కదా. దేవుడికి అన్ని తెలుసు అనుకుంటే… అలా వెళితే తర్వాత జరిగే ప్రమాదం ముందే తెలుసుకుని ఉంటాడు కదా.. ఎందుకు వెళ్ళిపోవాలి. అయినా బంగారు జింక ఎక్కడైనా ఉంటుందా..? ఆ మాత్రం ఆ దేవుడు తెలుసుకోలేక పోయాడా..?
* సీతమ్మ లంకలో ఉంది.. అక్కడికి వెళ్లాలంటే మధ్యలో సముద్రం ఉంది. అది దాటాలంటే అంత కష్టపడి కోతుల సహాయంతో వారధి కట్టాలా..? దేవుడు అనుకుంటే అది ఎంత పని.. మరి వేరే వాళ్ళ సహాయం ఎందుకు..?

5 Sri Rama Navami* రాముడి జీవితం అంటే.. హనుమంతుడి గురించి తప్పక మాట్లాడాల్సిందే. రాముడికి హనుమంతుడి కన్నా నమ్మకస్తుడు ఎవరు ఉంటారు .. రాముడి సేవకుడిలా.. నిజమైన భక్తుడిలా.. నమ్మిన బంటులా ఈ రోజుకీ మనం ఆ ఇద్దరి గురించి తలుచుకుంటున్నాం. చేయ్యెత్తి మొక్కుతున్నాం.
* నమ్మకం అనేది ఒకరిపై అంత తేలిగ్గా ఎలా కలుగుతుంది. తన శత్రువు రావణుడి తమ్ముడు విభీషణుడే వచ్చి శరణు కోరితే.. ఎందుకు ఆ రాముడికి అనుమానం కలగలేదు. ఎలా నమ్మాడు.. శత్రువు తమ్ముడు కదా.. ఏం ప్రమాదం ఉంటుందో అని అనుమానించలేదు. రావణుడిని చంపి లంకను ఇస్తా అని విభీషణుడికి మాట ఇచ్చాడు. అప్పుడు అక్కడ తనతో ఉన్నవాళ్లు ఒక మాట అడిగారు. ”విభీషణుడు వస్తే లంక ఇస్తా అన్నావు.. మరి ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తారని..?” అప్పుడు రాముడు చెప్పిన సమాధానం.. ” అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా..” అని. శత్రువుని కూడా ఒకే విధమైన భావంతో చూడడం ఎందరికి సాధ్యం..?
* శత్రువు.. తన భార్యని ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు అని తెలిసినా.. క్షమించడానికి మనసు ఉంటుందా.. ఇంకో అవకాశం ఇస్తామా..? కానీ రాముడు క్షమించాడు.. చేసిన తప్పు తెలుసుకోమని అవకాశం ఇచ్చాడు. శత్రువుని చంపడమే అసలైన శిక్ష అని ఏ రోజూ అనుకోలేదు.
* ఎవరో ఏదో తన భార్య గురించి తప్పుగా మాట్లాడారు కదా అని తేలిగ్గా తీసుకోలేదు. తన రాజ్య ప్రజల మాటలను కూడా గౌరవించాడు. ఆ మాటలకు కట్టుబడ్డాడు. నిందలు మోశాడు.. భార్యకి దూరంగా ఉన్నాడు. అది భార్యపై అనుమానం కలిగి కాదు.. నిజం ఏంటో లోకానికి తెలిసేలా చేయడానికి.

6 Sri Rama Navamiఇంత గొప్ప ఆ అద్భుత కావ్యాన్ని, తరతరాలుగా మనం ఎన్నో సార్లు విన్నాం.. వింటూనే ఉన్నాం.. వింటుంటాం కూడా.
రామాయణాన్ని.. ఒక్క శ్లోకంలో ఇలా చెప్తారు.

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణమ్ ||

SHARE