Home Unknown facts గోదాదేవి ఆచరించిన ఈ వ్రతం వెనుక ఉన్న ప్రాముఖ్యత

గోదాదేవి ఆచరించిన ఈ వ్రతం వెనుక ఉన్న ప్రాముఖ్యత

0

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం – “ధనుర్మాసం”. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన “తిరుప్పావై” ని ఈ మాసం రోజులు పఠిస్తారు.

Uniqueness of Dhanurmasa Poojaముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్ధోజనం సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ధనుర్మాస వ్రతం:

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది.

ఈ నెలరోజుల పాటూ “ధనుర్మాసవ్రతం” ఆచరించాలి.ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును ‘మధుసూదనుడు’ అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయాని కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.

మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ ‘చెక్కర పొంగలి’ ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన ‘పులగం’ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ ‘దధ్యోదనం’ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప,దీప, దక్షిణ,తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.

వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని –
“మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||”
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ –
“ఇందిరా ప్రతి గృహ్ణాతు”

అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.

Exit mobile version