Home Unknown facts శత్రు పీడలను తొలిగించే రామ నామం విశిష్టత

శత్రు పీడలను తొలిగించే రామ నామం విశిష్టత

0

“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే”

‘శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్. ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి’ అంటూ శ్రీరాముని స్తుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతహ కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు “రామ రామ రామ” అనే తారక మంత్రమే తోడ్పడింది.

Uniqueness Of The Rama Namamఅందుకే ఈ నామం కలిగిన రాముడి కంటే.. కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది? రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.

భగవంతుడి నమ స్మరణ చేయడం సాధారమే. భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి ఉంటుంది. మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, రామనామం శక్తి సామర్థ్యాలను ఏంటో పరిశీలిద్దాం.

శ్రీరామనామం అత్యంత మహిమాన్వితమైనది. సకల పాతకాలను రూపుమాపి భవబంధాలను తొలగించగల తారకమంత్రము. కలియుగంలో మానవులు తరించగల మార్గం. ‘రా’ అంటే మన పెదవులు విడివడి మనలోని పాపాలన్నీ బయటకుపోయి ‘మ’ అన్నప్పుడు పెదవులు మూసుకుని తిరిగి వాటిని లోపలికిపోకుండా చేస్తుంది. రామనామ జపం సకలార్థ సాధనం, మోక్షప్రదాయం.

‘‘రామ రామ రామ అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ చేసినంత ఫలం’’ అని శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం చాలా మందికి తెలియదు. పరమేశ్వరుడు కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉంటాడట. ‘రామ’ శబ్దం అత్యంత సులభంగా ఉండి ఆబాలగోపాలం నోట పలకటానికి అనువుగా ఉంటుంది. ‘శ్రీరామ’ అనే శబ్దం వల్ల అనేక శుభాలు కలుగుతాయి కాబట్టి ఆ నామాన్ని కోటిసార్లు వ్రాయడం. నేటికీ ఎందరో భక్తులు ‘రామకోటి’ వ్రాస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించ గలుగుతున్నారు. కొన్ని ప్రముఖ రామాలయాలలో రామకోటి రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేసే శ్రీరామనామ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీరామ నామాన్ని నిరంతరం జపించటం వలన శత్రుపీడలు, సకల రోగాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవించగలుగుతారు. ‘శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష!’- తెలిసి పలికినా తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది. చంటి పిల్లలకు స్నానం చేయించాక చివరలో ‘శ్రీరామరక్ష’ పెట్టటం తల్లులందరికీ అలవాటు. ఏ కష్టం కలిగినా ‘శ్రీరామచంద్రా! నీవే దిక్కు’ అని అనుకోవటం అనాది నుండి వస్తున్న ఆనవాయితీ! తుమ్మినా ‘రామచంద్రా!’, క్రింద పడినా ‘రామచంద్రా!’, ఆకలి వేసినా ‘అన్నమో రామచంద్రా!’ అంటూ ఉండే సామాన్య జనులకు కూడా అండదండగా ఉండి ఆదుకుని కాపాడేది రామనామమే!

Exit mobile version