Home Unknown facts పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ కొలువైన దేవతలు ఎవరు ?

పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ కొలువైన దేవతలు ఎవరు ?

0

అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో దేవత వుంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు. ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది.

Ayyapa Swamyఈ ఆలయంలో స్వామి ప్రతిష్టుడైన సందర్భంగా మృదంగ, భేరీ, కాహళ, దుంధుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర,మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు. ఇదీ ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. నలభై రోజులు దీక్ష చేసినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనంద రూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది. యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతము కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి.

అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలలను ధరిస్తారు. రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి.

దీక్షా సమయంలో పాటించే ఆహారనియమం శరీరాన్ని అదుపులో ఉంచి, చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు వుంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లరాళ్ళను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం.

అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్యఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు.

40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకొన్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడిలో బయలుదేరతారు. ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలిసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేయాలి.

Exit mobile version