గర్భగుడి చలికాలంలో వేడిగాను, ఎండాకాలంలో చల్లగాను ఉండే ఆలయం

0
1974

మన దేశంలో అతి ప్రాచీన దేవాలయాలలో అప్పటి టెక్నాలజీ ఇప్పటికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయ గర్భగుడి చలికాలంలో వేడిగాను, ఎండాకాలంలో చల్లగాను ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి విశేషాలు మరెన్నో ఈ ఆలయంలో ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bhavanarayana Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, భావ దేవరపల్లి బాపట్ల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పంచ భావన్నారాయణ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భావన్నారాయణస్వామి వారి ఆలయం ఉంది. అయితే మిగతా నాలుగు, కాకినాడ నగరంలోనే ఒక భాగంగా ఉన్న సర్పవరంలో ఒకటి, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలోని పెదగంజాంలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లా పట్టిసంలో ఒకటి. ఇలా మొత్తం ఐదు క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ లభించిన శాసనాల ద్వారా చోళరాజులలో ఒకరు ఈ ఆలయాన్ని నిర్మించారు.

Bhavanarayana Temple

ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు. ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు ఏనుగు కాలు ఆకారంలో ఉండటం విశేషం. అంతేకాకుండా ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

Bhavanarayana Temple

ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే సంవత్సరంలో అన్ని రోజులు వెలుగుతూ ఉండే అఖండ దీపారాధన సేవ ఒక ప్రత్యేకత. చాలామంది భక్తులు ప్రత్యేకించి ఈ అఖండ దీపారాధన కోసం ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.