గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి.
అప్పట్లో ఎన్నో హిందూ ఆలయాలు ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. అయితే, శ్రీశైలంలోని ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకపోగా దీన్ని అత్యంత పవిత్రధామంగా భావించడం గమనార్హం. ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో కర్నూలు జిల్లాను జాగీరుగా పొందిన దావుద్ ఖాన్ అనే సేనాని సోదరుడు ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం విశేషం.
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకారంతో గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయములో గర్భాలయం వెనుక భాగములో గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినిపిస్తుంది. ఈ ఆలయంలో శివ పార్వతులు భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి సమీపంలోగల మల్లెలతీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.
నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా, పర్యాటక స్థలంగా కూడా ఆకట్టుకుంటోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత రమణీయంగా ఉంటాయి. శ్రీశైలానికి 3 కిమీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. హైదరాబాద్‌కు 214 కి.మీ, విజయవాడకు 263 కి.మీల, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.