ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్ళకు ఆదిదంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకమైనవి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. వీటిలో అత్యంత మహిమాన్వితమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి.. మరి ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేతి ప్రతిష్టింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. భక్తుల నుండి పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. బ్రహ్మణుడైన రావణుడిని చంపడంల వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలిగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారులు కథనం.
విజయనగర రాజులు పరిపాలనా కాలంలో ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు.. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్లుగా కాకుండా ఇక్కడి శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది. అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.
ఈ దేవాలయంనకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇక్కడ మండపం నాలుగు స్థంభాలమీద నిర్మించబడి, ప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి వున్నది. ఈ నాలుగు స్థంభాను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫ్గాుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.