త్రిమూర్తుల కోవెలగా పిలువబడే హరి హర క్షేత్రం ఎక్కడ ఉందొ తెలుసా ?

0
281

పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ క్షేత్రంలో నరసింహ స్వామి గురించి తపస్సు చేస్తాడు. రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు. ఈ మహిమాన్విత ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. మూలవిరాట్టును అష్టదిగ్భందనం చేస్తూ ఎనిమిది వైపులా ఎనిమిది ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు. ఇటువంటి నిర్మాణం మనకు ఏ పుణ్యక్షేత్రంలో కూడా కనిపించదు. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల బారిన పడకుండా ఉండవచ్చునని భక్తులు నమ్ముతారు. అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.

Dharmapuri Templeశ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తారు. ఇది సైతక శిల్పం కావడం విశేషం. దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని (తీర్థాన్ని) ఏర్పరుస్తాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని త్రిమూర్తుల కోవెల అంటారు. ధర్మపురి, చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, గొప్ప శిల్ప కళతో అలంకరించబడిన మహా పుణ్యక్షేత్రం.

Dharmapuri Templeపవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ధర్మపురి క్షేత్రం. ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.

Dharmapuri Templeధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది, అది యమ ధర్మరాజు ఆలయం. ధర్మపురికి వెళితే యమపురి ఉండదు అని చెబుతుంటారు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ గా వస్తుంది. వచ్చిన భక్తులు యమధర్మ రాజు ఆలయం ముందు గండ దీపం పెడతారు.దీనివల్ల మరణగండాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయప్రాంగణంలో వినాయకుడి కోవెల మరియు వేణుగోపాల స్వామి వారి ఆలయాలు కూడా దర్శనం ఇస్తాయి. ప్రధానఆలయానికి కొంత దూరంలో స్వామి వారి కొలను ఉంది. కానీ అందులో భక్తుల స్నానాలు నిషిద్ధం. స్వామి వారి ఉత్సవాల సమయంలో లక్ష్మి నరసింహ స్వామి వారు కొలనులో స్నానం ఆచరిస్తారని ప్రతీతి.

Dharmapuri Templeగోదావరి నదీ తీరంలో గోదావరి అమ్మవారి ఆలయం ఉంది. ధర్మపురికి వచ్చిన భక్తులు గోదావరిలో స్నానం చేసి గోదావరి అమ్మవారిని ముందుగా దర్శించుకుంటారు. గోదావరి నదిలో బ్రహ్మ దండముతో తవ్విన గుండం ఉంటుంది. ఈ నది దక్షిణ వాహిని. దక్షిణ దిక్కుగా ప్రవహించే నది కాబట్టి దక్షిణ వాహిని అని పేరు వచ్చింది. ధర్మ పురి క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ధర్మపురి పట్టణం, జగిత్యాల్ నుండి -30 కిమీ, మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

SHARE