దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ద్వాపరయుగం నుండి ఉన్న ఈ ఆలయంలోని గర్భగుడిలోకి భక్తులకి ప్రవేశం అనేది లేదు. ఇంకా గర్భగుడిలో ఉన్న స్వామి వారి విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ వెలసిన ఆ స్వామి ఎవరు? ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రము దక్షిణ కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఉడుప అనే మాట నుంచి ఈ ఉరికి ఉడిపి అనే పేరు వచ్చింది. ఉడుప అంటే చంద్రుడు. తన మామగారైన దక్ష ప్రజాపతి వల్ల శాపం పొందిన చంద్రుడు ఇక్కడ చంద్రపుష్కరి అనే పేరు ఉన్న తటాకం ప్రక్కన చంద్రమౌళీశ్వరుని గూర్చి తపస్సు చేసి శాపవిమోచనం పొందాడని స్థలపురాణం. ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది అని తెలుస్తుంది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వాపరయుగం నాటిదిగా ప్రతీతి. ఈయన ఒక చేతిలో త్రాడు, మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణములు ధరించి దివ్య మంగళ రూపంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు.
మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పుముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండడం వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అయితే అంత్యకులానికి చెందిన కనకదాసు కృష్ణదర్శనం కోసం ప్రాధేయపడగా పూజారులు నిరాకరించారు. కనకదాసు భక్తిని మెచ్చిన కృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం. కనకదాసుకు కనిపించిన కిటికిలో నుంచే నేటికీ భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు. దీనిని కనకుడి కిటికీ అంటారు. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండప నిర్మాణం చేశారు. దీనికే కనకదాసు మండపమని పేరు. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.
ప్రధాన ఆలయమంతా శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణచిత్రాలతో నిండి ఉంటుంది. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే తీర్థమండపం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకి 9 సార్లు అర్చనలు జరుగుతాయి. కిలో బంగారం, మూడువేల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లతో తయారైన కిరీటం శ్రీ కృషుడికి అలంకరిస్తారు.
ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న చిన్ని కృష్ణుడు వెలసిన ఈ ఆలయంలో మేధ్యసరోవరం అనే పేరుగల ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది.